Bangaru Kutumbam: అక్కినేని బంగారు కుటుంబం ప్రత్యేకత అదే
ABN , Publish Date - Mar 17 , 2024 | 04:43 PM
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రాల్లో అధిక శాతం విజయవంతమైనవే. వాటిల్లో నటుడు కైకాల సత్యనారాయణ, ఆయన సోదరుడు నాగేశ్వరరావు కలసి నిర్మించిన ‘బంగారు కుటుంబం’ చిత్రం కూడా ఒకటి.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswarao), దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayanarao) కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రాల్లో అధిక శాతం విజయవంతమైనవే. వాటిల్లో నటుడు కైకాల సత్యనారాయణ, ఆయన సోదరుడు నాగేశ్వరరావు కలసి నిర్మించిన ‘బంగారు కుటుంబం’(Bangaru kutumbam) చిత్రం కూడా ఒకటి. ఏ తరహా చిత్రాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియని అయోమయ పరిస్థితి సినీ పరిశ్రమలో నెలకొన్న సమయంలో విడుదలైన ‘బంగారు కుటుంబం’ సూపర్ హిట్ అయి, పరిశ్రమకు దిక్సూచిగా నిలిచింది. రూ. 85 లక్షల వ్యయంతో తయారై 30 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసింది. కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి ‘బంగారు కుటుంబం’ నిరూపించింది. 1993 సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ‘బంగారు కుటుంబం’ చిత్రం ప్రారంభమైంది. ఆ డేట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ‘సీతారామ జననం’ చిత్రంతో అక్కినేని హీరోగా పరిచయమై 50 ఏళ్లు, ‘హరిశ్చంద్ర’ నాటకంలో చంద్రమతి పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టి 60 ఏళ్లు, నిజ జీవితంలో 70 ఏళ్లు అయిన సందర్భంగా, సెప్టెంబర్ 20 ప్రత్యేకమైన రోజు కావడంతో ‘బంగారు కుటుంబం’ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. అక్కినేని, జయసుధపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు రాఘవేంద్రరావు కెమెరా సిచ్ఆన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మొదలియార్ పాత్ర దాసరి పోషించారు. అరవ యాసతో తెలుగు సంభాషణలు పలికి, కథలో కీలకమైన ఆ పాత్రకు ప్రత్యేకత చేకూర్చారు. ఇందులో అక్కినేని కుమారుడిగా తమిళ చిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్న విక్రమ్ నటించారు. మరో ఇద్దరు కొడుకులుగా రాజ్‌కుమార్, హరీశ్ నటించగా, కోడళ్ల పాత్రలను యమున, రాజీవి, రంభ పోషించారు. చిత్ర సమర్పకుడు కైకాల సత్యనారాయణ కామెడీ, విలనీ కలగలసిన పాత్ర పోషించారు. 1994 ఫిబ్రవరి 18న విడుదలైన ‘బంగారు కుటంబం’ చిత్రం ఉత్తమ కథాచిత్రంగా బంగారు నందిని పొందింది. అలాగే ఉత్తమ నటుడిగా అక్కినేని అవార్డ్ అందుకొన్నారు.