Hits and Flops 2024: మొదటి నాలుగు నెలల్లో బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...

ABN , Publish Date - May 02 , 2024 | 04:06 PM

ఈ సంవత్సరం నాలుగు నెలల్లో సుమారు వంద సినిమాలు విడుదలైతే అందులో వేళ్ళపై లెక్కపెట్టే విధంగా కొన్ని సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. ఎన్ని హిట్స్, యావరేజ్ గా ఎన్ని నడిచాయి, విజయం సాధిస్తాయి అనుకున్న సినిమాలు ఏ విధంగా డిజాస్టర్ అయ్యాయి ఒక్కసారి చదవండి

Hits and Flops 2024: మొదటి నాలుగు నెలల్లో బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...
Hits and Flops of first four months in Tollywood

మే నెల వచ్చేసింది, ఈ వారం నాలుగు సినిమాలు విడుదలకి కూడా సిద్ధం అయ్యాయి. మరి మొదటి నాలుగు నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చాలానే విడుదలయ్యాయి, అందులో ఎన్ని విజయం సాధించాయి, ఎన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయో ఒకసారి చూద్దాం. సుమారు వంద సినిమాలు విడుదలైతే అందులో కేవలం కేవలం రెండు సినిమాలు మాత్రమే పెద్ద విజయం సాధిస్తే, ఇంకొన్ని యావరేజ్ గా నడిచాయి. మొత్తంమీద వేళ్ళపై లెక్కపెట్టగలిగేటట్టుగా విజయాలు వున్నాయి తప్పితే, ఎక్కువ విజయాలు నమోదు కాలేదనే చెప్పాలి.

gunturkaaramhouseset.jpg

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'గుంటూరు కారం' జనవరి 12న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగా అంత విజయం సాధించలేదనే చెప్పాలి. మొదటి నుండి ఈ సినిమా కొంచెం వివాదాల్లో, అంటే కొంతమంది నటీనటుల మార్పు, ఛాయాగ్రాహకుడు మార్పు, చిత్రీకరణ చాలా ఆలస్యం అవటం ఇలా ఎప్పుడూ వార్తల్లో వుంది. విడుదలైన తరువాత కూడా ఈ సినిమాపై ఎన్నడూ లేని విధంగా ప్రతికూల వార్తలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా రావటం వలన ఆ ప్రభావం సినిమాపై పడింది. ఎన్ని ప్రతికూల వార్తలు వచ్చినా ఈ సినిమా యావరేజ్ సినిమాగా నిలిచింది. ఆంధ్రాలో బాగానే ఆడింది అని, నైజాంలో లాభాలు లేవని విశ్లేషకుల అభిప్రాయం.

hanuman.jpg

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కథానాయకుడిగా తీసిన 'హనుమాన్' కూడా 'గుంటూరు కారం' విడుదలైనరోజే విడుదలైంది. అయితే ఈ సినిమాకి మొదట్లో థియేటర్స్ తక్కువైనా, ఈ సినిమా బాగుంది అనే నోటిమాటతో విజయఢంకా మోగించింది. ఈ నాలుగు నెలల్లో 'హనుమాన్' మొదటి స్థానంలో వుంది అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ 'హనుమాన్' సినిమా సుమారు రూ.250 కోట్లకి పైగా నెట్ సాధించింది అంటే ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం అవుతోంది కదా.

Saindhav-4.jpg

వెంకటేష్ కథానాయకుడిగా జనవరి 13న విడుదలైన 'సైంధవ్' డిజాస్టర్ అయితే, ఆ మరుసటి రోజు అంటే జనవరి 14న నాగార్జున కథానాయకుడిగా విడుదలైన 'నా సామి రంగ' విజయం సాధించింది. నాగార్జునతోపాటు ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కథానాయకులుగా నటించారు. ఆ తరువాత వరసగా సినిమాలు విడుదలవుతూనే వున్నాయి, అందులో రవితేజ నటించిన 'ఈగల్' కూడా వుంది. అది ఫిబ్రవరి నెలలో వచ్చింది, వెళ్ళిపోయింది.

EAGLE.jpg

ఆ తరువాత మార్చిలో వరుణ్ తేజ్ మొదటిసారిగా తెలుగు, హిందీ భాషల్లో నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' కూడా విడుదలైంది. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. విశ్వక్ సేన్ నటించిన 'గామి' మార్చి 8న విడుదలైంది, యావరేజ్ అని విశ్లేషకులు చెపుతున్నారు.

tillusquarestill.jpg

మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' ఊహించని విధంగా చాలా పెద్ద ఘన విజయం సాధించింది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మింది అనే చెప్పాలి. ఈ సినిమాతో సిద్దు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. తరువాత గోపీచంద్ నటించిన 'భీమా' కూడా అంత పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఏప్రిల్ నెలలో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఫామిలీ స్టార్' విడుదలైంది. మృణాల్ ఠాకూర్ కథానాయిక, పరశురామ్ పెట్ల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు, మొదటి ఆటకే ఫలితం తెలిసిపోయింది. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు, కానీ ఈ సినిమా దర్శకుడు పరశురామ్ విజయ్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు ఈసారి అని అన్నారు విమర్శకులు. ఏమైనా ఈ నాలుగు నెలల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి అనిపిస్తోంది.

హిట్స్

హనుమాన్ (బ్లాక్ బస్టర్)

టిల్లు స్క్వేర్ (సూపర్ హిట్)

నా సామి రంగా (హిట్)

గుంటూరు కారం (యావరేజ్)

గామి (యావరేజ్)

ఓం భీం బుష్ (యావరేజ్)

ఫ్లాప్స్

సైంధవ్ (డిజాస్టర్)

ఈగల్ (డిజాస్టర్)

ఆపరేషన్ వాలెంటైన్ (డిజాస్టర్)

ఫామిలీ స్టార్ (డిజాస్టర్)

భీమా (డిజాస్టర్)

గీతాంజలి మళ్ళీ వచ్చింది (డిజాస్టర్)

డబ్బింగ్ సినిమాలు

ప్రేమలు (హిట్)

మంజిమ్మల్ బాయ్స్ (హిట్)

లాల్ సలాం (డిజాస్టర్)

రత్నం (డిజాస్టర్)

Updated Date - May 02 , 2024 | 04:06 PM