నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. లీగల్‌గానే వెళతా
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:25 AM
హీరో రాజ్‌తరుణ్, లావణ్యల వివాదం బుధవారం కొత్త మలుపు తిరిగింది. రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘తిరగబడరా సామీ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగితే అక్కడికి లావణ్య వచ్చారు...
హీరో రాజ్‌తరుణ్, లావణ్యల వివాదం బుధవారం కొత్త మలుపు తిరిగింది. రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘తిరగబడరా సామీ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగితే అక్కడికి లావణ్య వచ్చారు. ఆ చిత్ర కథనాయిక, ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన మాల్వీ మల్హోత్రా కూడా వచ్చారు. రాజ్‌తరుణ్, మాల్వీ ఇద్దరూ వైట్ డ్రస్‌లో ఉండడం గమనార్హం. రాజ్‌తరుణ్ వస్తున్నాడని తెలియగానే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘నా సినిమా హిట్ అయినప్పుడు కూడా ఇంతమంది మీడియా సభ్యులు రాలేదు’ అంటూ రాజ్‌తరుణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన వివాదం గురించి ఆ మీడియా సమావేశంలో రాజ్‌తరుణ్ చెప్పిన మాటలు ఇవి.
నాలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకే లీగల్‌గా వెళుతున్నాను.
నా వల్ల గర్భం వచ్చిందనీ, అబార్షన్ చేయించానని ఆరోపిస్తున్నారు. మరి ఆ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే అవి నిజాలు కావు కనుక. అందుకే ఈ విషయం గురించి నేను మాట్లాడను. మా లాయర్ ద్వారా ప్రొసీడ్ అవుతున్నా.
నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఇన్నేళ్ల జీవితంలో ఎందరో పరిచయం అయి ఉంటారు. ఎంతో మందితో సాన్నిహిత్యం ఉంది. వాళ్లలో ఎవరైనా నేను మంచి వాడిని కాదు అని చెబితే పరిశ్రమ నుంచి తప్పుకొంటా.
నేనూ మనిషినే. బాధలు ఉండవా! ఆ బాధ వల్లే ‘పురుషోత్తముడు’ చిత్రం ఫంక్షన్‌కు కూడా రాలేదు. ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.
నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. అది ఇప్పుడు చెబుతున్న మాట కాదు. నా పాత ఇంటర్వ్యులు చూస్తే అది మీకు తెలుస్తుంది.
‘తిరగబడరా సామి’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇదనీ, మాల్వీ మల్హోత్రా మంచి నటి అనీ, ఆమెకు ఇదే తొలి సినిమా కనుక ఆదరించండి.
లావణ్య ప్రత్యక్షం
తనకు కనిపించకుండా తిరుగుతున్న రాజ్‌తరుణ్ ప్రసాద్ ల్యాబ్‌లో ఉన్నారని తెలియగానే లావణ్య అక్కడ ప్రత్యక్షమయ్యారు. రాజ్‌తరుణ్ కలుసుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు లావణ్యను అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఆమె మాదాపూర్‌లోని రాజ్‌తరుణ్ ఇంటికి చేరుకొని అక్కడ కూడా అందోళనకు దిగారు. తలుపు తీసే వరకూ అక్కడ నుంచి వెళ్లనని అన్నారు. రాజ్‌తరుణ్ అడిగిన ఆధారాలు తెచ్చినట్లు చెప్పారు.