Rao Ramesh: తన పాత్రల్లో ఉండేట్టు, ప్రచారాలు కూడా వైవిధ్యంగా చేస్తున్న రావు రమేష్
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:19 AM
తాను చేసే పాత్రలు ఎంత వైవిధ్యంగా వుంటాయో, తన సినిమా ప్రచారాలు కూడా అంతే వైవిధ్యంగా ఉండేట్టు మొదలెట్టారు ప్రముఖ నటుడు రావు రమేష్. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సినిమాలో మొదటిసారి కథానాయకుడిగా చేస్తున్న రావు రమేష్ ఈ సినిమా ప్రచారాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే...
ఈరోజు రావు రమేష్ పేరు ప్రతి తెలుగువాడి ఇంట్లో నానుతున్న పేరు. ఇంటిల్లపాదీ టీవీలో గానీ, వెండి తెర మీద కానీ రావు రమేష్ ని చూడగానే 'ఇతనెప్పుడూ మనింట్లో మనిషి రా' అని ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అంటే అతను చేసిన పాత్రలు అంత ప్రభావం చూపించాయి తెలుగు ప్రేక్షకుడు గుండెల్లో. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వైజాగ్ మావయ్య పాత్ర తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్రయిపోయింది. తండ్రి రావు గోపాలరావుకు ఎంత పేరొచ్చిందో, తండ్రికి తగ్గ తనయుడిగా రావు రమేష్ కి అంత పేరొచ్చింది.
అయితే ఒక్క ఆ వైజాగ్ మావయ్య పాత్రే కాదు, ఎటువంటి పాత్ర వేసిన అందులో ఆ పాత్ర కనపడుతుంది తప్ప, రావు రమేష్ కనపడరు మనకి. అందుకే రావు రమేష్ ఏ సినిమాలో ఉంటే, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతను వేసిన పాత్ర చిన్నదైనా రావు రమేష్ పాత్ర ఎప్పుడూ హైలైట్ అవుతుంది. 'అజ్ఞాతవాసి' సినిమాలో వున్నా డైలాగ్ 'విమానంలో ఉన్నోళ్లంతా ఎగురుతున్నాం అనే అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం.. అంతే!' అనేది ఈరోజుకి వైరల్ అవుతూనే ఉంటుంది. రావు రమేష్ డైలాగ్ చెపితే అది వైరల్ అవకపోవటం అంటూ ఉండదు. అతని డైలాగ్స్ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఎందరో నాయకులకి, ప్రముఖుల్కి అన్వయించి వైరల్ చేస్తూనే వుంటారు. అదీ రావు రమేష్ అంటే, అతని డైలాగ్ పవర్ అంటే!
అతను పాత్రలో నటించాడు, ఆ పాత్ర ఎలా ఉంటుందో ఆలా ప్రవర్తిస్తారు (బిహేవ్), అందుకే రావు రమేష్ అంటే తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకం. రావు రమేష్ పాత్రలని ప్రేమించని, ఆస్వాదించని తెలుగు ప్రేక్షకుడు లేరంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకుడిని తన హావభావాలతో, మాటలతో కొంచెం కొంచెంగా రంజింపచేసే రావు రమేష్ ఇప్పుడు పూర్తిగా రంజింపచెయ్యాలనే ఉద్దేశంతో ఏకంగా ఒక సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమానే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం', విడుదలకి సిద్ధంగా వుంది.
రావు రమేష్ సరసన ఇంద్రజ కథానాయికగా నటించారు. అంకిత్, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు, కాగా బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల ఈరోజు ప్లాన్ చేశారు ఈ చిత్ర నిర్వాహకులు. ఈ సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు.
'ఎప్పుడూ సగం సగం ఎంటర్‌టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం ఉందా? లేదా? అని ఆ ఇద్దరూ రావు రమేష్ ని అడిగితే, అప్పుడు రావు రమేష్ 'ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే, సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి చెపుతూ ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం అని చెప్పారు రమేష్.