Elections 2024: రానా దగ్గుబాటి ముఖ్యమంత్రిగా నటించిన రెండు సినిమాలు
ABN , Publish Date - May 08 , 2024 | 12:52 PM
రానా దగ్గుబాటి నటించిన రెండు తెలుగు సినిమాలు 'లీడర్', 'నేనే రాజు నేనే మంత్రి' లో రానా ముఖ్యమంత్రి పాత్రలో కనపడతారు. ఈ రెండు సినిమాలు రాజకీయ నేపధ్యం వున్నవి, అందులో ముఖ్యమంత్రి అవటం కోసం చేసే ప్రయత్నాలు, పన్నాగాలు, కొన్ని సన్నివేశాలు నిజంగా జరిగుంటాయా అనిపించేలా వున్న ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయ నేపధ్యం వున్న సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో ముఖ్యమంత్రి పాత్ర వేసిన నటులు చాలా తక్కువ. ఆలా వేసినవాళ్లలో రానా దగ్గుబాటి ఒకరు. అతను చేసిన రెండు సినిమాలు 'లీడర్', 'నేనే రాజు నేనే మంత్రి'లో రానా ముఖ్యమంత్రి పాత్రలో కనపడతారు. ఈ రెండు సినిమాల కథలు రాజకీయ నేపధ్యంలో తీసి అందులో ఒకటి అవినీతి డబ్బును బయటకి తీయడానికి ఒకటి, ఓటు విలువ చాటి చెప్పే సినిమా ఇంకోటి, ఇలా ఈ రెండూ ఆలోచింపచేసేవిగా తీశారు. మొదటిది శేఖర్ కమ్ముల దర్శకుడు అయితే, రెండో సినిమాకి తేజ దర్శకుడు. ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి, రానాని నటుడిగా తీర్చిదిద్దాయి.
సినిమా: లీడర్
నటీనటులు: రాన దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్
దర్శకుడు: శేఖర్ కమ్ముల
ఫిబ్రవరి 19, 2010 న విడుదలైంది
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు రానా దగ్గుబాటి మొదటి సినిమా 'లీడర్'. దీనికి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కథ రాజకీయ నేపథ్యంతో వచ్చిన సినిమా. ముఖ్యమంత్రి హత్యకు గురయితే, అతని కుమారుడైన అర్జున్ ప్రసాద్ ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ముఖ్యమంత్రి అన్న కుమారుడు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూ అనేకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అందులో సోదరుడు వరసైన ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ని చంపే ప్రయత్నం కూడా చేస్తాడు. నిజాయితీతో పరిపాలన సాగించాలనుకున్న అర్జున్ ప్రసాద్ కి అతని పార్టీ ఎంఎల్ఏల నుండే సరైన సహకారం లభించకపోతే, అతను ప్రతిపక్ష నాయకుడి కుమార్తెని ప్రేమించినట్టు నటిస్తాడు. కొంతమంది ఎం.ఎల్.ఏ లని డబ్బులిచ్చి కొంటాడు. లక్ష కోట్ల నల్లధనాన్ని బయటకి తీసుకువరావటం కోసం అర్జున్ ప్రసాద్ ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి చివరికి మద్దతు లభించదు, రాజీనామా చేస్తాడు. ఎన్నికలు వస్తాయి, అప్పుడు ప్రజలను చైతన్యపరచడానికి రాజకీయవేత్తగా కాక, లీడర్ గా తయారవుతాడు. ఇది మంచి సినిమా అని అప్పట్లో విశ్లేషకులు భావించారు. రానా చాలా బాగా చేసాడు అని కూడా ప్రశంసించారు.
సినిమా: నేనే రాజు నేనే మంత్రి
నటీనటులు: రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసా
దర్శకత్వం: తేజ
ఆగస్టు 11, 2017 న విడుదలైంది
ఒక చిన్న వూర్లో వడ్ఢేవ్యాపారం చేసుకునే జోగేంద్ర, గర్భవతిగా వున్న తన భార్యని గర్భస్రావం చేశాడని సర్పంచ్ పై కోపంతో అతనిపై పోటీకి నిలబడి గెలుస్తాడు. తన భార్యని ఏదో అన్నాడని ఎం.ఎల్.ఏ ని చంపి, ఎం.ఎల్.ఏ. అవుతాడు. తరువాత మంత్రి అవుతాడు. ఇంక అప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటాడు. ఇలా అతని కోరిక బలంగా ఉండటంతో, అసలు ఎక్కడ మొదలుపెట్టాడు, అతని భార్యపై వున్న ప్రేమ, వూరు అన్నీ మర్చిపోతాడు. ముఖ్యమంత్రి అవటం కోసం ఏమేమి అక్రమాలు చెయ్యాలో అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఈలోగా భార్య మరణం అతనిలో మార్పు తీసుకువస్తుంది. ప్రజల నాయకుడిగా గెలవాలి అనుకుంటాడు, ఎన్నికల్లో తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు, అలాగే అతన ప్రతినిధులని కూడా నిలబెట్టి గెలిపించుకుంటాడు. ముఖ్యమంత్రి అయ్యే తరుణంలో తను నిలబెట్టిన కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని ప్రతిపక్ష నాయకుడితో ప్రభుత్వాన్ని నెలకొల్పేవిధంగా అడుగులు వేస్తారు. అది విన్న జోగేంద్ర ఆ అవినీతి నాయకులని చంపి జైలుకు వెళతాడు. ఉరిశిక్ష వేస్తారు, కానీ ప్రజలు ఉద్యమం చేసి న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకువరతంతో ఉరిశిక్ష ఆపేసి, ఒక కమిటీని వేస్తుంది. అప్పుడు జోగేంద్ర ఓటు హక్కు అనేది ఎవరికిపడితే వాళ్ళకి వేసేది కాదని, డబ్బులు తీసుకొని వేసేది కూడా కాదని, సమాజంలో ప్రతి మనిషి ఓటు వెయ్యడం నైతిక బాధ్యత అని చెప్పి తనకి తనే ఉరేసుకొని చచ్చిపోతాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది, దర్శకుడు తేజ కి, రానా దగ్గుబాటి నటనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.