Siddhu Jonnalagadda: కుమ్ముతున్న టిల్లుగాడు, సంచలన కలెక్షన్స్
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:41 AM
'టిల్లు స్క్వేర్' సినిమా మూడు రోజుల్లో సుమారు రూ. 55 కోట్ల గ్రాస్ కలెక్టు చేసి సంచలనాలు సృష్టించే దిశగా వెళుతోందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈమధ్యకాలంలో ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంతటి కలెక్షన్స్ రాబట్టడం ఇదే మొదటిసారని అంటున్నారు
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నడిచిన 'టిల్లు స్క్వేర్' సినిమా గత శుక్రవారం విడుదలైంది. మల్లిక్ రామ్ దర్శకుడు, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట దగ్గరనుండి పాజిటివ్ టాక్ రావటం, ఉదయం ఆటలు అన్నీ హౌస్ ఫుల్స్ అవటం ఆ తరువాత హిట్ టాకుతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించటం జరుగుతోంది. మొదటిరోజు కన్నా, రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే, మూడోరోజు ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టిస్తోంది.
అమెరికాలో అయితే ఈ సినిమా ఇప్పటికే 1.85 మిలియన్ డాలర్స్ కలెక్టు చేసిందని అంటున్నారు. అంటే సుమారు రూ. 15 కోట్లు వరకు అక్కడ కలెక్టు చేసి సంచలనం దిశగా దూసుకుపోతోంది. సిద్దు జొన్నలగడ్డ ఇంతకు ముందు చేసిన 'డీజీ టిల్లు' కన్నా ఆ సినిమా సీక్వెల్ అయినా ఈ 'టిల్లు స్క్వేర్' చాలా బాగుంది అనటం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ఒక చిన్న సినిమా పెద్దగా కలెక్షన్స్ కురిపించటం పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందని, ఇక లాభాల బాటలో పడిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఈమధ్య కాలంలో ఒక చిన్న సినిమా మూడు రోజుల్లో ఇంతటి కలెక్షన్స్ ఎన్నడూ సాధించలేదని కూడా అంటున్నారు. మూడు రోజులకి గాను ఈ సినిమా సుమారు రూ. 55 కోట్ల గ్రాస్ ఉంటుందని ఈ సినిమాకి ఇది అత్యంత భారీ కలెక్షన్స్ అని పరిశ్రమలో అశ్చర్యపోతున్నారు. అలాగే ఈ సినిమా నెట్ అంటే టాక్సులు అవీ పోను మూడు రోజులకు గాను సుమారు రూ. 33 కోట్లు కలెక్టు చేసిందని కూడా చెపుతున్నారు.
రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్టు చేస్తుందని కూడా అంటున్నారు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉందని, ఎందుకంటే ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు చూస్తున్నారని, సిద్దు జొన్నలగడ్డ టిల్లు పాత్రలో అందరినీ నవ్విస్తూ ఆ పాత్రలో మమేకం అయిపోయాడని అంటున్నారు. ప్రేక్షకులు థియేటర్స్ లో మొదటి నుండి చివరి వరకు నవ్వుతూనే వున్నారని, ఈ సినిమా నూటికి నూరుశాతం వినోదం పండిస్తోంది అని అంటున్నారు.