Elections 2024: ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్స్
ABN , Publish Date - May 09 , 2024 | 12:47 PM
వేసవికాలం రాగానే హైదరాబాదులో ఉండలేక ఏదైనా చల్లని ప్రదేశానికి వేసవి విడిదిగా వెళ్లే టాలీవుడ్ నటీనటులు ఈసారి చాలామంది ఎన్నికల ప్రచారంలో వున్నారు. ఎండలని, మధ్య మధ్యలో పడే వర్షాలని లెక్కచెయ్యకుండా తమ అభ్యర్ధులని గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో టాలీవుడ్ నటీనటులు చాలా బిజీగా తమ అభర్ధుల గెలుపుకోసం ఎండను సైతం లెక్కచెయ్యకుండా ప్రచారం చేస్తున్నారు. సీనియర్ నటుడు వెంకటేష్ ఇటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో, అటు ఆంధ్రలోని కైకలూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. (Tollywood actors Venkatesh and Nikhil Siddhartha campaigning in the upcoming elections for thei respective candidates) ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి కోసం ఖమ్మంలో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిగిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ప్రచారం చెయ్యడమే కాకుండా, అక్కడ అందరితో ఫోటోలో కూడా దిగుతున్నారు వెంకటేష్.
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డిని, వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వెంకటేష్, రఘురామిరెడ్డి ఇద్దరూ ఇప్పుడు వియ్యంకులు కావటంతో, వెంకటేష్ తన వియ్యంకుని విజయం కోసం ఎండని సైతం లెక్కచెయ్యకుండా ఖమ్మంలో ప్రచారం చేస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్స్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తే అక్కడకి కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. (Venkatesh campaigning in Khammam of Telangana State and Kaikaluru in Andhra Pradesh) ఇటు ఖమ్మంలో ప్రచారం ముగించుకొని, వెంకటేష్ ఆంధ్ర ప్రదేశ్ లోని కైకలూరులో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాసరావు కోసం ప్రచారం చేస్తున్నారు. మంచి తనానికి మారుపేరు కామినేని శ్రీయనివాస రావు అని, అతను మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి అని, అందుకోసం అతనికి ఓటు వేసి గెలిపించమని వెంకటేష్ ఓటర్లను కోరారు. అక్కడ ప్రచార జీపులో ఎక్కి వోటర్లని విశేషంగా ఆకర్షిస్తున్నారు వెంకటేష్.
ఇక యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చీరాల కూటమి అభ్యర్థి ఎం.ఎం. కొండయ్య యాదవ్ కోసం నిఖిల్ చీరాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొండయ్య యాదవ్ జనసేన తరపున చీరాల నుండి బరిలో నిలబడ్డారు. అతను నిఖిల్ కి దగ్గర బంధువు కావటంతో, నిఖిల్ అతని గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క 'స్వయంభు' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటూనే, ఇంకో పక్క తన మామయ్య అయిన కొండయ్య యాదవ్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నిఖిల్.
అలాగే ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ కూడా హైదరాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాదు బీజేపీ అభార్థి మాధవి లతని గెలిపించాల్సిందిగా నవనీత్ కౌర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నవనీత్ కౌర్ చాలా తెలుగు సినిమాల్లో నటించి ఇప్పుడు రాజకీయాల్లో వున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యురాలిగా బీజేపీ తరపున పోటీలో వున్నారు. ఇప్పుడు మాధవి లత కోసం హైదరాబాదు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చాలామంది నటీనటులు ఓపెన్ గానే బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వటం ఆసక్తికరం. నాని, రాజ్ తరుణ్, వికె నరేష్, నిర్మాత నాగ వంశి, నటులు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, జబర్ దస్త్ లో చేసే నటులు షకలక శంకర్, హైపర్ ఆది, కిర్రాక్ ఆర్ఫీ ఇలా చాలామంది తమ సంఘీభావం తెలిపారు. ఇంకో సీనియర్ నటుడు సురేష్ కూడా సామజిక మాధ్యమంలో పవన్ కళ్యానికి తన మద్దతును తెలిపారు.