NTR Jayanthi: మరపురాని ఎన్టీఆర్ అడుగుజాడలు!
ABN , Publish Date - May 28 , 2024 | 03:44 AM
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం తెలుగువారికి ఓ తెరచిన పుస్తకం! ఆయన గురించి ఎంత చెప్పుకొన్నా కొంతే అవుతుంది. అదీ ఆయన చరిత్ర! అయినా...
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం తెలుగువారికి ఓ తెరచిన పుస్తకం! ఆయన గురించి ఎంత చెప్పుకొన్నా కొంతే అవుతుంది. అదీ ఆయన చరిత్ర! అయినా రామారావు జయంతి, వర్ధంతి ... రెండూ తెలుగువారికి ప్రత్యేక దినాలు. తెలుగునేల రాజకీయవేడితో కాగుతున్న సమయమిది. ఈ తరుణంలో తెలుగువారికి యావత్ ప్రపంచంలోనే అరుదైన స్థానాన్ని కల్పించిన ఎన్టీఆర్‌ను, ఆయన రాజకీయ జీవితాన్ని మననం చేసుకోవడం మనందరి విధి!
కళ కళ కోసం కాదు.. సమాజ శ్రేయస్సు కోసం అని నినదించడమే కాక వృత్తిజీవితంలో కూడా ఆచరించి చూపెట్టిన మొట్టమొదటి నటుడు ఎన్టీఆర్. ఆయనకు ముందు పృథ్విరాజ్ కపూర్, బళ్ళారి రాఘవ వంటి వారు ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాలంలో కొన్ని సాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్నా.. ఆ తర్వాత కాలంలో సమాజ హితంలో మమేకమై సంఘంలో సినిమా వారికి గౌరవస్థానం కల్పించి వారి స్థాయిని పెంచిన తొలి నటుడు మాత్రం ఎన్టీఆరే.
ఎన్టీఆర్ కంటే ముందు కొందరు నటులు రాజకీయాల్లో అడుగుపెట్టి విజయాలు సాధించారు. వారందరూ ఏదో ఒక పార్టీలో చేరి, తరువాత పాలిటిక్స్‌లో రాణించారు. ‘ప్రజల మనిషిని వేరే పార్టీలో చేరడమా!? అంటూ ఎన్టీఆర్ సొంతంగా తెలుగుదేశం పార్టీని నెలకొల్పి రాజకీయప్రవేశం చేశారు. 1982 మార్చి 29న తాను నెలకొల్పిన ‘తెలుగుదేశం’ పార్టీని కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో విజయపథంలో పయనింపచేసి ప్రపంచంలోనే చెరిగిపోని తరగిపోని చరిత్ర లిఖించారు ఎన్టీఆర్. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో రాజకీయాలలో సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ పాలనలో సాగిన రాజకీయ సంస్కరణలు సైతం మరపురానివి. వాటిని ఈ నాటికీ ఎందరో రాజకీయనాయకులు అనుసరిస్తూనే ఉండడం విశేషం! భారత రాజకీయాల్లో మహాత్మగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇక సంఘసంస్కర్తలుగా వెలుగుతున్న శంకరాచార్య, వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వారు ప్రజలను సంస్కరించారు. వారి బాటలోనే ఎన్టీఆర్ పయనిస్తూ పలు సామాజిక, రాజకీయ సంస్కరణలకు రూపశిల్పిగా నిలిచారు. ఆయన నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ, తెలుగు వారి జీవన వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తూ.. ఈ నాటికీ ప్రజాభిమానం చూరగొంటూనే ఉంది. ఆ అభిమానం చెరిగిపోనిది, తరిగిపోనిది అని మరికొద్దిరోజుల్లోనే మరోమారు రుజువు కానుంది. ఈనాటి ఆంధ్ర ప్రజల ప్రత్యేక ప్రమాదకర పరిస్థితులలో అండగా నిలబడటానికి, భవిష్యత్తుకి భరోసా కల్పించడానికి పోరాటరంగంలో నిలిచి, గెలిచి భావితరాలకు బంగారు బాటలు వేయడానికి ఎన్టీఆర్ అందించిన స్ఫూర్తి ఎప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటుందని ఆశిద్దాం., ఆకాంక్షిద్దాం.
కొమ్మినేని వెంకటేశ్వరరావు