Bhoothaddam Bhaskar Narayana Movie Review: పరవాలేదు, ఒకసారి చూడొచ్చు

ABN , Publish Date - Mar 01 , 2024 | 07:54 PM

శివ కందుకూరి ఈసారి ఒక డిటెక్టివ్ కథా నేపథ్యంతో వున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పురుషోత్తం రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఎలావుందో చదవండి.

Bhoothaddam Bhaskar Narayana Movie Review: పరవాలేదు, ఒకసారి చూడొచ్చు
Bhoothaddam Bhaskar Narayana Movie Review

సినిమా: భూతద్దం భాస్కర్ నారాయణ

నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు

సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: గౌతమ్ జి

నిర్మాత: స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి

దర్శకత్వం: పురుషోత్తం రాజ్

విడుదల తేదీ: మార్చి 1, 2024

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

డిటెక్టివ్ కథనాలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అప్పట్లో చాలామంది నటులు చేశారు, ఈమధ్యన యువ నటులు కూడా అలాంటివి చేస్తూ వస్తున్నారు. నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే సినిమాలో డిటెక్టివ్ గా చేసి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ఇంకో యువ నటుడు శివ కందుకూరి 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాలో డిటెక్టివ్ గా నటించాడు, ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పురుషోత్తం రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కథని పురాణాలతో ముడిపెట్టడం కొంచెం ఆసక్తికరంగా వుంది. రాశి సింగ్ కథానాయికగా చేసిన ఈ సినిమాలో శివ కందుకూరి ప్రేక్షకుల మెప్పు పొందడా? సినిమా ఎలా వుందో చూద్దాం. (Bhoothaddam Bhaskar Narayana movie review)

bbnone.jpg

Boothaddam Bhaskar Narayana story కథ:

ఈ కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బోర్డర్ సరిహద్దులో జరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 హత్యలు జరుగుతాయి, అన్నీ ఆడపిల్లలవే. హత్య చేయబడ్డ శరీరాలకి తలలు వుండవు, ఒక దిష్టి బొమ్మ పెట్టి ఉంటుంది. ఎక్కడో హత్య చేసి అడవిలో తలలేని మృతదేహాన్ని వదిలేసి వెళ్ళిపోతూ వుంటారు. పోలీసులు ఎంత పరిశోధించినా ఒక్క ఆధారమూ దొరకదు, ఒక సైకో కిల్లర్ చేస్తున్నాడు అని అనుమానిస్తారు. అదే సమయంలో ఈ కేసును పరిష్కరించడానికి ప్రైవేట్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. మొదట్లో అందరూ భాస్కర్ నారాయణని కొంచెం సరదాగా తీసుకున్నా, ఈ హత్యల పరంపర, దానివెనుక దాగివున్న నేపధ్యం తెలుస్తూ ఉండేసరికి అతను ఈ కేసును ఎలా అయినా చేధించాలని తీవ్రంగా అనుకోని, పరిశోధనని వేగవంతం చేస్తాడు. అతని పరిశోధనలో ఇవి హత్యలు కావు, నరబలి ఇస్తున్నారు అని తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఇలా నరబలి ఇస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? ఈ నరబలి వెనుక వున్న పురాణ రహస్యం ఏంటి? భాస్కర్ నారాయణ ఎలా ఈ రహస్యాన్ని ఛేదించాడు? చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ అవుదామని అనుకున్న అతని కల నెరవేరిందా? ఇవన్నీ తెలియాలంటే ఈ 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమా చూడాల్సిందే. (Bhoothaddam Bhaskar Narayana review)

bbn.jpg

విశ్లేషణ:

డిటెక్టివ్ కథల నేపధ్యం వున్న సినిమాలలో చిక్కుముడులు ఒక్కొక్కటి విడిపోతూ దర్శకుడు ముందుకు తీసుకెళ్లాలి. ఈ సినిమా దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమా మొదలైన తరువాత కొంచెం కథ నీరసంగా కనిపించినా, సినిమా నడుస్తున్న కొద్దీ ఆసక్తిగా కథని ముందుకు తీసుకెళ్లాడు. రెండో సగం సినిమాకి ఎంతో బలమైనది. అయితే ఈ సినిమా కథలో ప్రత్యేకం ఏంటంటే, ఈ సినిమా కథకి పౌరాణికం నేపథ్యంలో చూపించడం. హత్యలు జరుగుతూ ఉండటం, పోలీసులకి డిటెక్టివ్ కి అసలు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం, ఎందుకు చేస్తున్నారో తెలియకపోవటం, ఎవరు చేస్తున్నారన్నది ఇవన్నీ సినిమా నడుస్తున్న కొద్దీ ప్రేక్షకుడికి ఆసక్తిగానే మలిచాడు దర్శకుడు.

మొదటి సగంలో కొంచెం కథ సరిగ్గా లేకపోయినా, దర్శకుడు రెండో సగం బలంగా తీయడంతో సినిమాపై ఆసక్తి పెరిగి, చివరి వరకు ప్రేక్షకుడికి ఉత్కంఠగానే ఉంటుంది. ఆధారం దొరికినట్టే అనిపిస్తూ దొరక్కపోవటం, కథలో మలుపులు తిరగడం బాగుంది. చివరి 30 నిముషాలు సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దర్శకుడు మంచి సన్నివేశాలతో రక్తి కట్టించాడనే చెప్పాలి. పోతనగారి భాగవతంలోని 'ప్రహ్లాద చరిత్ర' నుండి 'కలడంబోధిన్, కలండు గాలిన్, కలడాకాశంబునన్... ' పద్యం కూడా పెట్టి పౌరాణిక స్పర్శని కథలో విలన్ తో చెప్పించడం బాగుంది. యానిమేషన్ తో పురాణ కథని కూడా బాగానే చెప్పాడు దర్శకుడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి కానీ, మొత్తం మీద ఇది ఒక కాలక్షేపానికి పనికొచ్చే సినిమా అని చెప్పొచ్చు. దర్శకుడు కథనం మీద, నేపధ్య సంగీతం మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా చాలా బాగా వచ్చేది అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకి నేపధ్య సంగీతం చాలా ముఖ్యం. ఛాయాగ్రహణం బాగుంది, అలాగే సన్నివేశాలన్నీ మంచి సాంకేతిక విలువలతో బాగా తీశారు.

shivakandukuribhoothaddam.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే శివ కందుకూరి భాస్కర్ నారాయణగా మెప్పించాడు. ఇంతకు ముందు అతను చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని నటనలో పరిణితి కనిపిస్తుంది. అతని కెరీర్ కి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. అలాగే భావోద్వేగాల్లో కూడా బాగానే చేసాడు శివ. ఇక రాశి సింగ్ రిపోర్టర్ లక్ష్మిగా చేసింది, బాగుంది. మిగతా పాత్రల్లో అందరూ బాగా నటించారు. దేవి ప్రసాద్, శివన్నారాయణ, శివ కుమార్, వర్షిణి అందరూ బాగున్నారు. షఫీ చేత మంచి పాత్ర చేయిస్తే బాగుండేది.

చివరగా, 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమా రెండో సగం చాలా బలంగా ఉంటుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేలా సినిమా తీయగలిగాడు. ఈ డిటెక్టివ్ కథా నేపద్యానికి దర్శకుడు ఇచ్చే పురాణ స్పర్శ బాగుంది. డిటెక్టివ్ సినిమాలు చూసే ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది అనిపిస్తుంది, ఒక్కసారైతే చూడొచ్చు.

ఇది కూడా చదవండి:

Operation Valentine: సినిమా ఎలా ఉందంటే.. !

Updated Date - Mar 01 , 2024 | 08:08 PM