Freedom At Midnight Review: 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' ఎలా ఉందంటే

ABN , Publish Date - Nov 26 , 2024 | 09:50 PM

ఇండియాకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది.. భారతదేశ స్వాతంత్ర్యం.. స్వతంత్ర పోరాటం.. ఈ హెడ్డింగ్స్ తో చిన్నప్పుడు అంతా చాలానే చదువుకున్నాం. ఇప్పటికీ చాలామందికి ఆ వాక్యాలు గుర్తు. కానీ ఆ వాక్యాల మధ్య జరిగిన యుద్ధం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

వెబ్ సిరీస్ రివ్యూ:  'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' (Freedom at midnight Review)

ఓటీటీ: సోనీ లివ్ 

నటీనటులు : సిద్ధాంత్ గుప్తా, చిరాక్ వోరా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, లూక్ మెక్ గిబ్నే తదితరులు

సాంకేతిక నిపుణులు: 

సినిమాటోగ్రఫీ - మలయ్ ప్రకాష్
ఎడిటింగ్ - శ్వేతా వెంకట్
సంగీతం - అశుతోష్ పాఠక్
నిర్మాతలు - మోనీషా అద్వాని, నిఖిల్ అద్వాని, మధు భోజ్వాని(ఎమ్మె ఎంటర్టైన్మెంట్స్), ధనిష్ ఖాన్ (స్టూడియో నెక్స్ట్ డిజిటల్) 
దర్శకత్వం - నిఖిల్ అద్వాని (Nikhil Adwani)

ఇండియాకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది.. భారతదేశ స్వాతంత్ర్యం.. స్వతంత్ర పోరాటం.. ఈ హెడ్డింగ్స్ తో చిన్నప్పుడు అంతా చాలానే చదువుకున్నాం. ఇప్పటికీ చాలామందికి ఆ వాక్యాలు గుర్తు. కానీ ఆ వాక్యాల మధ్య జరిగిన యుద్ధం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. భారత స్వాతంత్ర్య పోరాటం అంటే అదేదో యుద్ధం కాదు, ఎంతో మథనం, ఇంకెంతో మేధోమథనం.. ఇంకా చెప్పాలంటే అతిపెద్ద రాజకీయం. అవేవీ పాఠ్య పుస్తకాల్లో కనిపించవు. టెక్ట్స్ బుక్స్ లో ప్రింట్ చేసిన అక్షరాల వెనక రాజకీయం, లాబీయింగ్, చాకచక్యం, తెలివితేటలు, సమయస్ఫూర్తి తెలుసుకోవాలంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాసిన పుస్తకాలు చదవాలి. లేదంటే అలాంటి ఓ పుస్తకం ఆధారంగా తీసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వెబ్ సిరీస్ చూడాలి. డ్రామా, ఉత్కంఠ, సస్పెన్స్, థ్రిల్, వయొలెన్స్, సెంటిమెంట్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. ఇలా నవరసాలు కలిసిన పోరాటం మనది. (Freedom at midnight Web series Review)

Gandhi.jpg

స్వతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచిపోయాయి. ఆ పోరాటం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన పెద్దలు చెప్పినా అది వాళ్ల ప్రాంతానికి లేదా కొన్ని వార్తా పత్రికల సమాచారం అయి ఉంటుంది. అలాంటి స్వాతంత్ర్య ఉద్యమంలోకి మనల్ని నేరుగా తీసుకెళ్లాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. ఇండియాకు ఫ్రీడమ్ కేవలం అహింసా మార్గంతోనే రాలేదు, తెరవెనక చాలా హింస జరిగిందనే పచ్చి నిజాన్ని కళ్లకుకట్టాడు. లారీ కొలిన్స్, డొమినిక్ లాపియర్ రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకం ఆధారంగా, అదే పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. 1975లో వచ్చిన ఈ పుస్తకం, స్వతంత్ర పోరాటానికి సంబంధించి అత్యంత ప్రామాణికమైన రచనగా చెప్పుకుంటారు. ఎందుకంటే, దీనిపై ఎలాంటి వివాదాలు లేవు, ఎలాంటి ఆరోపణలు-విమర్శలు లేవు. అంత బ్యాలెన్స్ డ్ గా, ఎంతో రీసెర్చ్ చేసి రాశారు ఈ పుస్తకాన్ని. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ కూడా అంతే బ్యాలెన్స్ డ్ గా ఉంటుంది. (Freedom at midnight)
aaaa.jpg
ఇందులో జిన్నా పాత్రనే తీసుకుంటే, చాలామంది భారతీయులకు అతడిపై వ్యతిరేకత ఉంటుంది. ఇండియాను విడదీసి, పాకిస్థాన్ అనే ప్రత్యేక దేశం తెచ్చుకున్నాడనే కోపం ఉంది. కానీ జిన్నా ఆలోచన విధానం ఏంటి.. అతడు ఏం ఆశించాడు.. అనేది ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమౌతుంది. అదే టైమ్ లో గాంధీకి సమానంగా ఎదగాలని, అందరూ అలా తనను గుర్తించాలనే జిన్నా స్వార్థం కూడా కనిపిస్తుంది. సహాయ నిరాకరణ ఉద్యమం నుంచే గాంధీ-జిన్నా సిద్ధాంతాల మధ్య తేడా వచ్చిందనే విషయాన్ని చూపించారు. బహుశా.. సహాయ నిరాకరణ ఉద్యమం రాకపోతే ఇండియా విడిపోయి ఉండేది కాదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. కేవలం జిన్నా మాత్రమే కాదు.. వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మౌంట్ బాటన్ లాంటి ఎంతోమంది వ్యక్తుల వ్యక్తిత్వాల్ని ఈ సిరీస్ లో ఆవిష్కరించారు. నిజానికి ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి, కానీ తెరపై లైవ్ లో కనిపిస్తుంటే మరింత నచ్చింది. మరీ ముఖ్యంగా దేశ విభజనపై గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించినప్పుడు నెహ్రూ, పటేల్ పడిన మానసిక సంఘర్షణను వెబ్ సిరీస్ లో ఎంతో హృద్యంగా చూపించారు.
_Sardar-Valla.jpg
ఇలా చెప్పుకుంటూపోతే సిరీస్ లో ప్రతి పాత్ర ఎంతో గొప్పగా వచ్చింది. ఆ పాత్రల్లో ఉన్న గొప్పదనం అటువంటిదైతే, వాటిని పోషించిన నటులకు కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. మహాత్మా గాంధీగా చిరాగ్‌ వోహ్రా  అద్భుతంగా నటించాడు. అతడి హావభావాలు సరిగ్గా సరిపోయాయి. ఇక జవహర్ లాల్ నెహ్రూగా సిద్దాంత్ గుప్తా జీవించాడనే చెప్పాలి. నెహ్రూకు సంబంధించి తెలియని ఎన్నో కోణాలు ఈ సిరీస్ లో మనకు కనిపిస్తాయి. వల్లభాయ్‌ పటేల్‌ గా రాజేంద్ర చావ్లా.. మహ్మద్ జిన్నాగా ఆరిఫ్ జకారియా.. లూయిస్‌ మౌంట్‌ బాటన్‌ గా ల్యూక్‌ మెక్‌ గిబ్నీ.. లేడీ మౌంట్‌బాటన్‌ గా కార్డెలియా బుగేజా.. సరోజినీ నాయుడు గా మలిష్కా మెండోన్సా అద్భుతమైన నటన కనబరిచారు.

పుస్తకాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడం చాలా పెద్ద విషయం. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఏ పోర్షన్ కు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి లాంటి విషయాలు చాలా పెద్ద సవాల్. ఈ విషయంలో దర్శకుడు నిఖిల్ అద్వానీ అతడి టీమ్ అద్భుతంగా పని చేసింది. రాకెట్ బాయ్స్ తర్వాత నిఖిల్ అద్వానీ బెస్ట్ వర్క్ ఇది. నొవాఖలీ ఘటన జరిగినప్పుడు గాంధీ అటు వెళ్లడం, సరిగ్గా ఇటు మౌంట్ బాటన్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. వీళ్లను ఎంత మెచ్చుకోవాలో, బహుశా అంతకంటే ఎక్కువగా నిర్మాతలు మోనీషా అద్వాని, సిద్ధార్ధ్, మధు భోజ్వాని మెచ్చుకోవాలి. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అద్భుతమైన ప్రొడక్షన్ విలువలు చూపించారు. బహుశా దర్శకుడు నిఖిల్, ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించడం వల్ల కూడా ఇంత మంచి ఔట్ పుట్ వచ్చి ఉండొచ్చు. ఆర్ట్ డైరక్టర్ విజయ్ ఘోడ్కే.. సంగీత దర్శకుడు అశుతోష్ పాఠక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 80 ఏళ్ల కిందటి పరిస్థితుల్ని తన ఆర్ట్ వర్క్ తో చక్కగా ఆవిష్కరించాడు విజయ్. ఇక అశుతోష్ అందించిన వింటేజ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
Clement Richard Attlee.jpg
తెలిసిన కథే అయినప్పటికీ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఈ వెబ్ సిరీస్ లో కనిపిస్తాయి. కాంగ్రెస్ లో అందరూ నెహ్రూను కాకుండా, వల్లభాయ్ పటేల్ ను ఎన్నుకున్నారనే విషయం ఎంతమందికి తెలుసు. పటేల్ కు దక్కాల్సిన ప్రధాని పదవిని గాంధీ చొరవతో నెహ్రూ దక్కించుకున్న విషయాన్ని అంతర్లీనంగా చూపించారు. అంతేకాదు.. దేశంలో పరిస్థితుల్ని నెహ్రూ కంటే ఎక్కువగా పటేల్ చక్కదిద్దినట్టు సిరీస్ లో చూపించడం కూడా ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ  సిరీస్ లో దాదాపు 40 శాతం బ్రిటిష్ ఇంగ్లిష్ డైలాగ్స్ వినిపిస్తాయి. అది తప్పనిసరి. మరింత మందికి సిరీస్ ను దగ్గర చేసేందుకు ఆ డైలాగ్స్ కు పారా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది. కేవలం సబ్ టైటిల్స్ తో సరిపెట్టారు. దీనికితోడు ఉద్యమంలో కీలకమైన మలుపుల్లో కొన్నింటిని వాయిస్ ఓవర్ తో, మరికొన్నింటిని చిన్నచిన్న సీన్స్ తో ముగించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక ఈ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు చాలా తక్కువమంది కాబట్టి ఎంత రీచ్ ఉంటుందనేది కూడా అనుమానమే. ఇలాంటివి పక్కనపెడితే.. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సిరీస్ ను ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా చూడాలి.

ట్యాగ్ లైన్:  స్వాతంత్ర్య పోరాటంలో అసలు కోణం

Updated Date - Nov 26 , 2024 | 10:08 PM