Bhimaa Movie Review: గోపీచంద్ పోలీసు పాత్రలో నటించిన 'భీమా' ఎలా ఉందంటే...

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:51 PM

గోపీచంద్ మళ్ళీ ఇంకోసారి పోలీసు పాత్రలో నటించిన 'భీమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ కథానాయికలు, కాగా ఎ హర్ష దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి

Bhimaa Movie Review: గోపీచంద్ పోలీసు పాత్రలో నటించిన 'భీమా' ఎలా ఉందంటే...
Bhimaa Movie Review

సినిమా: భీమా

నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్, నాజర్, నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారి, పూర్ణ తదితరులు

ఛాయాగ్రహణం: స్వామి గౌడ

సంగీతం: రవి బస్రూర్

నిర్మాత: కెకె రాధామోహన్

దర్శకత్వం: ఎ హర్ష

రేటింగ్: 2 (రెండు)

విడుదల తేదీ: మార్చి 8, 2024

-- సురేష్ కవిరాయని

నటుడు గోపీచంద్ కి ఒక మంచి విజయవంతమైన సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు అతను 'భీమా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా చేశారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. సినిమా విడుదలకి ముందు ఇది ఒక వ్యాపారాత్మక సినిమాగా చెప్పారు, ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Gopichand 'Bhimaa' Movie Review)

bhimaastill.jpg

Bhimaa story కథ:

మహేంద్రగిరి పట్టణానికి భీమా (గోపీచంద్) పోలీసు అధికారిగా వస్తాడు. రావటంతోనే అదే వూర్లో వున్న భవాని (ముఖేష్ తివారి) అనే రౌడీని, అతని అనుచరులను కొట్టి తాను వచ్చింది వాళ్ళ అంతు చూడటానికే అని చెప్తాడు. అదే వూర్లో టీచర్ గా పని చేస్తున్న విద్య (మాళవిక శర్మ) తో ప్రేమలో పడతాడు. విద్య ఒక పక్క టీచర్ గా పనిచేస్తూనే, ఇంకో పక్క ఆ వూర్లో ప్రజలకి తన ప్రకృతి వైద్యంతో జబ్బులు నయం చేస్తున్న రవీంద్ర వర్మ (నాజర్) దగ్గర రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. భవాని అక్రమంగా లారీలో రవాణా చేస్తున్న పిల్లలని భీమా రక్షించి ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భవానీ మనుషులతో పోరాటం అవుతుంది. ఆ పోరాటంలో భవానీ మనుషులు భీమాపై విషప్రయోగం చేసి అతన్ని తీసుకెళ్లి సముద్రంలో పడవేస్తారు. అదే వూర్లో వున్న పరమశివుడి గుడిలో ఎవరైనా చంపబడితే దశదిన కర్మలోపు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు వచ్చి పిలిస్తే చనిపోయిన వారి ఆత్మ ఆ వ్యక్తిని ఆవహిస్తుంది. అలాంటి గుడి కొన్ని సంవత్సరాలుగా మూతబడి ఉంటుంది. (Bhimaa Movie Review) ఎందుకు ఆ గుడి మూతబడి వుంది? సముద్రంలో పడిన భీమా పరిస్థితి ఏంటి? రవీంద్ర వర్మ ఆయుర్వేద వైద్యంతో పాటు ఇంకేమైనా చేస్తూ ఉంటాడా? భీమా ఆ గుడి తలుపులు తీయించగలిగాడా? భవానీ వెనకాల ఇంకెవరైనా వుండి నడిపిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే 'భీమా' సినిమా చూడాల్సిందే.

gopichandbheema.jpg

విశ్లేషణ:

దర్శకుడు ఎ హర్ష 'భీమా' అనే సినిమాతో కొత్త పాయింట్ తీసుకున్నాడు కానీ, చెప్పే విధానం మాత్రం పథ పద్ధతిలో చెప్పడంతో కొత్తదనం ఏమీ కనపడదు. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది, కానీ కొంత సమయానికే దర్శకుడు అదే మూస పద్దతిలో కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. సినిమా మొదలైనప్పుడు సుమారు 20 నిముషాల పాటు పరుశురామ క్షేత్రం గురించి, శివాలయంలో చేసే పూజలు ఇవన్నీ వివరించుకుంటూ వెళతాడు దర్శకుడు, అవి ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఆ తరువాతే కథ రొటీన్ అయిపోవటమే కాకుండా, ఇది ఒక పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ రుచి చూపించినట్టుగా చూపిస్తాడు. ఆ వూరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ వూరిలో వున్న రౌడీ ఇంటికి నేరుగా వచ్చి అక్కడ అతనికి హెచ్చరిక చేస్తాడు. బాగుంది ఇంతవరకు, కానీ ఆ తరువాత ఆ ఎస్ఐ అక్కడ కాలేజీలో టీచర్ గా పని చేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ సన్నివేశాలే చాలా ఎబ్బెట్టుగా ఉండటమే కాకుండా, బోర్ కొట్టించే విధంగా సాగదీసాడు దర్శకుడు. వీటికి బదులు ఇంకో ముఖ్యమైన పాత్ర వుంది, ఆ పాత్ర మీద దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొదటి సగంలో చాలా భాగం ఎస్ఐ గోపీచంద్, మాళవిక శర్మ మధ్యన సాగదీసిన సన్నివేశాలతో నడిపిస్తాడు. రెండో సగంలో ఒక ముఖ్యమైన పాత్రని ప్రవేశ పెడతాడు, కానీ ఆ పాత్రని దర్శకుడు చూపించే విధానం అంత నమ్మేట్టు చెయ్యలేకపోయాడు. విడుదలకి ముందు ఈ సినిమాలో ఒక ఫాంటసీ ఉంటుంది అని చెప్పారు, ఆ పాయింట్ చివర్లో ఎక్కడో చూపిస్తారు. అలాగే ప్రియ భవాని శంకర్, గోపీచంద్ మధ్యన నడిచే ప్రేమ సన్నివేశాలు కూడా సాదా సీదాగా వున్నాయి తప్పితే అందులో కూడా కొత్తదనం ఏమీ లేదు.

ఈ సినిమాలో గోపీచంద్ ని ఒక మాస్ అవతార్ లో చూపించాలని దర్శకుడు అనుకున్నాడు, అందుకు బోయపాటి శ్రీను తరహాలో కొన్ని పోరాట సన్నివేశాలని పెట్టాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకొని, ప్రేమ సన్నివేశాలు, వెన్నెల కిశోర్ తో వచ్చే సన్నివేశాలు కొంచెం వినోదాత్మకంగా రాసుకొని ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది. రవి బస్రూర్ నేపధ్య సంగీతం కొంచెం లౌడ్ గా అనిపిస్తుంది, మరీ వ్యాపారాత్మక దృష్టితో ఈ సినిమా చేసినట్టుగా కనపడుతోంది, అందుకే ఆ ప్రేమ సన్నివేశాలు కూడా ముందు బెంచివాళ్ళకి తగినట్టుగా చీప్ గా తీసాడు దర్శకుడు. ఛాయాగ్రహణం పరవాలేదు అనిపించింది. మొదటి సన్నివేశాలు, చివరి సన్నివేశాలు బాగా రాసుకున్నాడు దర్శకుడు, మధ్యలో సన్నివేశాలు అతికించినట్టుగా ఉంటాయి. సినిమాలో భావోద్వేగాలు అంతగా కనిపించవు.

bhimaastillone.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే గోపీచంద్ ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన షేడ్స్ లో కనిపిస్తాడు. తన వంతు కృషి బాగానే చేశారు, ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో గోపీచంద్ బాగున్నారు. కానీ కథ కొంచెం బలంగా వుండి ఉంటే బాగుండేది. మాళవిక శర్మ చాలా అందంగా, గ్లామర్ గా కనిపిస్తారు, ప్రియ భవాని శంకర్ పాత్ర నిడివి కొంచెం తక్కువే అని చెప్పాలి. తెలుగులో పరభాషా నటులు విలన్ గా చేస్తున్నారు కానీ వాళ్ళకి గొంతు మాత్రం చాలా పెద్దగా, అరుస్తున్నట్టుగా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. మరి అంత లౌడ్ వాయిస్ అవసరమా, అనిపిస్తూ ఉంటుంది. ముఖేష్ తివారి విలన్ గా కనిపిస్తారు. నాజర్, నరేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్ అందరూ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. పాటలు మామూలుగా ఉంటాయి.

చివరగా, 'భీమా' సినిమా కేవలం ముందు బెంచిలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా వ్యాపారాత్మక విలువలతో కూడిన హంగులు పెట్టి అల్లిన కథలా అనిపిస్తుంది. దర్శకుడు హర్ష ఒక కొత్త పాయింట్ తో చెప్పాలని అనుకున్నారు, కానీ కథనం, చూపించే విధానం అంతా పాతపద్ధతిలోనే వెళ్లడంతో సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలగదు. బోయపాటి తరహాలో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించటంతో తలలు ఎగిరి పడుతూ ఉంటాయి, అవి చూడటానికి కొంచెం ధైర్యం అవసరమే! కేవలం మాస్ ప్రేక్షకులకి మాత్రమే ఈ సినిమా!

ఇది కూడా చదవండి:

Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

Updated Date - Mar 08 , 2024 | 04:51 PM