Laggam Review: తెలంగాణ పెళ్లి నేపథ్యంలో 'లగ్గం' ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:58 PM

ఈ వారం పెద్ద చిత్రాలు హవా లేకపోవడంతో చిన్న సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో 'లగ్గం’ చిత్రం ఒకటి. బేవార్స్‌, భీమదేవరపల్లి బ్రాంచ్‌ వంటి చిత్రాల దర్శకుడు రమేష్‌  చెప్పాల తెరకెక్కించారు.

సినిమా రివ్యూ: 'లగ్గం’ (Laggam Review)
విడుదల తేది: 25–10–2024
నటీనటులు: సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్‌, రోహిణి, ఎల్‌బీ శ్రీరామ్‌, సప్తగిరి తదితరులు.

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ : బాల్ రెడ్డి

ఎడిటింగ్‌: బొంతల నాగేశ్వర్ రెడ్డి

సంగీతం: చరణ్ అర్జున్‌

నేపథ్య సంగీతం : మణిశర్మ

నిర్మాత : సుభిషి వేణుగోపాల్ రెడ్డి

దర్శకత్వం: రమేష్‌ చెప్పాల (Ramesh Cheppala)


ఈ వారం పెద్ద చిత్రాలు హవా లేకపోవడంతో చిన్న సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో 'లగ్గం’ (Laggam) చిత్రం ఒకటి. బేవార్స్‌, భీమదేవరపల్లి బ్రాంచ్‌ వంటి చిత్రాల దర్శకుడు రమేష్‌  చెప్పాల తెరకెక్కించారు. సాయి రోనక్‌, పగ్యా నగ్రా జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్‌, రోహిణి కీలక పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో చూద్దాం.

Laggam.jpg
కథ: (laggam movie)
తెలంగాణలోని ఓ పల్లెలో నివసిస్తుంటాడు సదానందం (రాజేంద్రప్రసాద్‌). తన కూతురు మానస (ప్రగ్యా నగ్రా) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో పెళ్లి చేస్తే సుఖపడుతుందని భావిస్తాడు. తన మేనల్లుడు చైతన్య (సాయి రోనక్‌) మంచి జీతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మంచి జీతం, కారు, బంగ్లా విలాసవంతమైన జీవితం ఉన్న అతన్ని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. మేనల్లుడితో కూతురి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపుతాయి. పెళ్లి పనులు సందడిగా మొదలైపోతాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. తనకు ఎట్టి పరిస్థితిలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వున్న అల్లుడే కావాలని పట్టుబట్టి కూర్చుంటాడు సదానందం. అల్లుడుకి జాబ్‌ లేదని తెలిసిన తర్వాత ఆ పెళ్లి తప్పించడానికి సదానందం ఏం చేశాడు? ఈ పెళ్లి చైతన్య, మానసకి ఇష్టం ఉందా లేదా? సాఫ్ట్‌వేర్‌పై సదానందంకు ఎందుకంత ఆసక్తి అనేది మిగతా కథ.

విశ్లేషణ:
సాఫ్ట్‌వేర్‌ అల్లుడు మాత్రమే కావాలనుకునే ఓ మేనమామ చుట్టూ తిరిగే కథ ఇది. తెలంగాణలో జరిగే పెళ్లిలో ప్రతి ఘట్టాన్ని అందంగా చూపిస్తూ దాని చుట్టూనే కొన్ని పాత్రలు, సంఘర్షణలను చూపించాలన్నది దర్శకుడి ప్లాన్‌ అన్నట్లు సినిమా చూస్తే తెలుస్తుంది. పెళ్లి, ఆ సన్నివేశాలు, పాటలు, ఫీల్‌గుడ్‌గా అనిపించాయి. పెళ్లి చుట్టూ తను రాసుకున్న సాఫ్ట్‌వేర్‌ కామెంటరీ, ప్రేమ, భావోద్వేగాలు మధ్య తేడాలు ఇందులో అంతగా అతకలేదు.  రాజేంద్రప్రసాద్‌కు సాఫ్ట్‌వేర్‌ మీదున్న ఆసక్తితో ప్రారంభమైన సీన్స్‌ పెళ్లి పనులు ఇరు కుటుంబాల సందడి, సింపుల్‌గా సాగే కథనం, విశ్రాంతి సమయానికి టర్న్‌ తీసుకుంటుంది. ఫస్టాఫ్‌ మధ్యలోనే ఆ మలుపుని ఊహించవచ్చు. ఇంటర్వెల్‌ తర్వాత హీరో చెప్పే వెర్షన్‌ ఇంకో లైన్‌ కలుస్తుంది. ఆ సందర్భంలో ఇరు కుటుంబాల మద్య వచ్చే సన్నివేశాలు సింక్‌లో ఉండవు. అయితే మేనత్తగా రోహిణి, మేనకోడలిగా మానస పాత్రలను బలంగా రాసుకున్నాడు దర్శకుడు. రోహిణి నటన కళ్ల నీళ్లు తిరిగేలా చేస్తుంది. మణిశర్మ బీజీఎంలో ఆ సన్నివేశాలపై ఇంపాక్ట్‌ చూపించింది.    సాఫ్ట్‌వేర్‌ జాబులపై ఇప్పటి తల్లిదండ్రులకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం నిత్యం  ఏదో ఒక మాధ్యమంలో చూస్తూనే ఉంటున్నాం. జాబ్‌ల రీత్యా విదేశాల్లో స్థిరపడ్డవారు అత్యవసర పరిస్థితుల్లో సొంతవారి దగ్గరకు రాలేని పరిస్థితిని చూస్తున్నాం. ఆ పాయింట్స్‌ ఆధారంగా కథను క్లోజ్‌ చేయడం రొటీన్‌గా అనిపించింది.



laggam-2.jpg
నటీనటుల విషయానికొస్తే..

సాయిరోనక్‌ చైతన్య పాత్రకు యాప్ట్‌ అయ్యాడు. సహజంగా నటించారు. హ్యాండ్సమ్‌నెస్‌, స్ర్కీన్‌ ప్రజెన్స్‌ బావుంది సాధారణ కుర్రాడిగా ఇమిడిపోయాడు, ప్రగ్యా నాగ్రా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కుదిరింది.  రాజేంద్రప్రసాద్‌కు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. కొట్టిన పిండి లాంటి పాత్ర ఇది. అలవోకగా చేశారు. కానీ తెలంగాణ యాస ఆయనకు సూట్‌ కాలేదు. సహజత్వం మిస్‌ అయింది. ఇక రోహిణి నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకు పేరు పెట్టక్కర్లేదు. ఎమోషనల్‌ సీన్స్‌ చేయడంలో రోహిణి ఆమె దిట్ట. ఇందులో మేనకోడలితో ఆమెకు వున్న ఎటాచ్‌మెంట్‌ హత్తుకునేలా ఉంటుంది. ఎల్‌బి శ్రీరామ్‌ తనదైన శైలిని చూిపించారు. డీజే క్యారెక్టర్‌లో చమ్మక్‌ చంద్ర నవ్వించాడు. రఘుబాబు, శ్రీకృష్ణుడు, రచ్చ రవి, సప్తగిరి లాంటి టైమింగ్‌ ఆర్టిస్ట్‌లను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. పాత్రల వరకూ వారంతా న్యాయం చేశారు.  బాల్‌రెడ్డి కెమెరా పనితనం ఉన్నతంగా ఉంది. సినిమాకు అదొక ఎసెట్‌. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ టచ్‌ చేసింది. చరణ్‌ అర్జున్‌ ఇచ్చిన పాటల్లో పెళ్లి పాట, చివర్లో వచ్చే అప్పగింతల పాట వినడానికి, చూడటానికి బావున్నాయి. ఎడిటింగ్‌ ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. ‘బలగం’ చిత్రం స్ఫూర్తితో తెలంగాణ ఆచార సాంప్రదాయలతో కూడుకున్న కథలు రాయడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్‌. లగ్గం చిత్రం ఆ స్ఫూర్తితోనే వచ్చిందని టైటిల్‌ ప్రకటించగానే అర్థమైంది. తెలంగాణలో జరిగే పెళ్లిలోని ప్రతి  విషయాన్ని వివరంగా చూస్తూ ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు. సొసైటీలో పెళ్లి వ్యవస్థ ఎలా ఉందో చెబుతూ దర్శకుడు కథ రాసుకున్నాడు. ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్‌ ఫిల్మ్‌గా తీయడం అభినందనీయం. అయితే స్టార్‌డమ్‌ లేని సినిమాలకు కంటెంట్‌ కింగ్‌గా ఉంటుంది. మరీ ఇంత క్లీన్‌గా ఉన్న సినిమా జనాల్ని థియేటర్‌కి రప్పిస్తుందా లేదా అన్నది చూడాలి.

ట్యాగ్‌లైన్‌: క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..

Updated Date - Oct 25 , 2024 | 07:52 PM