Manamey Movie Review: శర్వానంద్ కి 'మనమే' హిట్ ఇచ్చిందా...

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:05 PM

రెండేళ్ల విరామం తరువాత శర్వానంద్ 'మనమే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఎలా వుందో చదవండి

Manamey Movie Review: శర్వానంద్ కి  'మనమే' హిట్ ఇచ్చిందా...
Manamey Movie Review

సినిమా: మనమే

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, శివ కందుకూరి, రాహుల్ రామకృష్ణ, తులసి, సీత, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు

ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్

సంగీతం: హేషం అబ్దుల్ వహాబ్

నిర్మాతలు: టి. జి. విశ్వప్రసాద్

దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

విడుదల: జూన్ 7, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

నటుడు శర్వానంద్ కి ఒక పెద్ద బ్రేక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? అప్పుడెప్పుడో 'శతమానం భవతి' అనే సినిమా పెద్ద విజయం సాధించింది, ఆ తరువాత శర్వానంద్ కి అంతటి బ్రేక్ అయితే మాత్రం రాలేదు అని చెప్పాలి. అతని ముందు సినిమా కూడా విడుదలై రెండేళ్లు అవుతోంది, ఇప్పుడు చాలా విరామం తరువాత 'మనమే' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, కృతి శెట్టి కథానాయిక. ఇందులో శివ కందుకూరి ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Maname story కథ:

విక్రమ్ (శర్వానంద్) అల్లరి చిల్లరిగా తిరుగుతూ వుండే అబ్బాయి. ఒకరోజు అతని స్నేహితుడు అనురాగ్ (ఆదిత్ అరుణ్), భార్య ఇద్దరూ హైదరాబాదులోని ఒక ప్రమాదంలో చనిపోతారు అని తెలుస్తుంది. వారి రెండేళ్ల పిల్లవాడు ఖుషి మాత్రం ప్రమాదం నుండి బయటపడతాడు. ఆ పిల్లవాడికి బ్రిటిష్ పౌరసత్వం ఉండటంతో ఆ చిన్న పిల్లాడిని అనాధగా వదలడం ఇష్టంలేక, చూసుకునేందుకు విక్రమ్, సుభద్ర (కృతి శెట్టి) లు ముందుకు వచ్చి భార్య భర్తలుగా లండన్ వెళతాం అని చెప్తారు. లండన్ లో వీళ్ళిద్దరూ ఖుషిని చూసుకోవటంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? సుభద్రకు కార్తిక్ అనే అబ్బాయితే పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది, మరి ఆమె కార్తీక్ ని చేసుకుందా, లేక విక్రమ్ తో ప్రేమలో పడిందా? లండన్ లో రాహుల్ రవీంద్రన్ ఏమి చేస్తున్నాడు, అతను ఎందుకు పిల్లవాడైన ఖుషీని చంపాలని ప్రయత్నం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే 'మనమే' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

శ్రీరామ్ ఆదిత్య ఇంతకు ముందు 'హీరో' అనే సినిమాకి దర్శకత్వం వహించారు, ఆ సినిమా సరిగ్గా నడవలేదు. రెండేళ్ల తరువాత ఇప్పుడు ఈ 'మనమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా అని విడుదలకి ముందు ప్రచారాల్లో చెప్పారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడు అనేది చివర్లో ఒక పది నిముషాల పాటు మాత్రమే ఉంటుంది. అంతే ఆ పదినిముషాలకోసమని దర్శకుడు సన్నివేశాలని సాగదీసి, కథ ఏమీ లేకుండా, వున్నకథని కూడా ముందుకు తీసుకుపోకుండా ప్రేక్షకుడికి కొంచెం అసహనానికి గురిచేశాడు అనే చెప్పాలి.

తల్లిదండ్రులను కోల్పోయిన ఒక రెండేళ్ల పిల్లవాడు అనాధ కాకూడదని, ఆ తల్లిదండ్రుల స్నేహితులు (లీడ్ జంట) ఇద్దరు ఆ పిల్లవాడి సంరక్షణ బాధ్యత చూసుకోవాలని అనుకుంటారు. ఒక చిన్న పిల్లవాడిని చూసుకోవాలంటే ఎంత భాద్యత, ఎంత కష్ట పడాలి అనేది కథానాయకుడికి తెలుస్తోంది. అంతవరకు, అల్లరి చిల్లరిగా తాగుతూ, తిరుగుతూ వుండే కథానాయకుడికి ఒక్కసారిగా పశ్చాత్తాపం కలిగి తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు, వారిని చూడటానికి విదేశం నుండి వచ్చేస్తాడు. ఇది టూకీగా కథ. అయితే ఇందులో కథానాయకుడు అసలు విషయం గ్రహించే సమయానికి సినిమా చివరికి వచ్చేస్తుంది, తరువాత కొన్ని నిముషాల తరువాత సినిమా అయిపోతుంది.

ఆ కొన్ని నిముషాల కోసం దర్శకుడు రెండుగంటలకు పైగా సరైన కథ లేకుండా, భావోద్వేగాలు, సంఘర్షణ లాంటివి లేకుండా, తనకి తోచిన సన్నివేశాలతో సినిమాని సాగదీసి, ఏవేవో పాత్రలు ప్రవేశపెట్టి, ప్రేక్షకులకి నిద్ర వచ్చేట్టు చేస్తాడు. వినోదాత్మకంగా సన్నివేశాలతో కథని చెప్పాను అని దర్శకుడు అనుకొనివుండవచ్చు కానీ, చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం అటువంటి అనుభూతి కలగదు. దానికితోడు సినిమా అంతా నత్తనడకగా సాగుతూ ఉండటంతో, ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందా, అసలు కథలోకి ఎప్పుడు వస్తామా అని ప్రేక్షకుడికి ఎదురుచూపులే మిగులుతాయి. పోనీ వినోదం ఏమైనా ఉంటుందా అంటే, అది కూడా కాలం చెల్లిన వినోదమే. పాటలు ఈ సినిమాకి ఇంకో పెద్ద మైనస్ అనే చెప్పాలి. సినిమా ఎక్కువభాగం విదేశాల్లో చిత్రీకరించారు కాబట్టి విదేశాల్లో వుండే అందమైన ప్రదేశాలు వెండితెరపై ప్రేక్షకులకి చూపించడానికే ఈ సినిమా తీశారు అనే విధంగా కూడా ఉంటుంది.

శర్వానంద్, నేహా శెట్టి మధ్య వచ్చే మామూలు సన్నివేశాలు కానీ, ప్రేమ సన్నివేశాలు కానీ అంతగా ఆకట్టుకునేలా లేవు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం (కెమిస్ట్రీ) సరిగ్గా లేదు. సినిమాలో బలమైన సంఘర్షణ లేదు, అలాగే భావోద్వేగాలు కూడా లేవు. సినిమా మొదలైన దగ్గర నుండి 'మధ్యపానం ఆరోగ్యానికి హానికరం' అనేది తెరపైన ఎక్కువసేపు కనపడుతూనే ఉంటుంది, అంటే సినిమాలో కథానాయకుడు కనిపిస్తున్నప్పుడల్లా మధ్యపాన సీసాతోటే కనిపిస్తాడు. రెండో సగంలో కథ మరీ నత్తనడకలా సాగుతుంది. కథ ఎలా వుండబోతోంది, సన్నివేశాలు ఏమి వస్తాయి అనేది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు చాలానే వచ్చాయి. కొన్ని పాత్రలు ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి, ఉదాహరణకు రాహుల్ రవీంద్రన్ పాత్ర. అతను ఎందుకు ఆ చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి చంపాలనుకుంటాడో సరిగ్గా చెప్పలేకపోయాడు దర్శకుడు.

Manamey

ఇక నటీనటుల విషయానికి వస్తే శర్వానంద్ విక్రమ్ గా బాగా చేశాడు, కానీ పాటలు మాత్రం అతనికి సరిగా సరిపోలేదు అనిపిస్తోంది. కృతి శెట్టి సుభద్ర పాత్రలో కనపడుతుంది, ఆమెకి కూడా శర్వానంద్ తో సమానంగా మంచి పాత్ర ఇచ్చారు. కానీ వీరిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ సెట్ అవలేదు, అందుకనే ఆ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి అనిపిస్తుంది. శివ కందుకూరి పాత్ర సినిమాలో ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. శీరత్ కపూర్ పాత్ర ఎందుకు పెట్టారో తెలియదు. రాహుల్ రామకృష్ణ వినోదం పండలేదు. వెన్నెల కిషోర్ ని కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాడు, కానీ అతని ప్రతీ సినిమాలోనూ అదే వినోదం, అందుకని ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. సీత, తులసి, ముఖేష్ రిషి, సచిన్ ఖేడేకర్, దేవి ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ అందరూ అక్కడక్కడా కనపడతారు. అయేషా ఖాన్ కూడా కనిపిస్తుంది, ఆమె అందంగా వుంది. ఖుషి పాత్రలో చేసిన రెండేళ్ల చిన్న పిల్లాడు మాత్రం చాలా క్యూట్ గా వున్నాడు. అతను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు, ఒక సమయంలో ఆ పిల్లవాడి కోసమే సినిమా తీసినట్టుగా కనపడుతుంది.

చివరగా, 'మనమే' కథపై దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే, ఒక మంచి భావోద్వేగమైన సినిమాగా నిలిచేది. కానీ సినిమాలో భావోద్వేగాలు (emotions), సంఘర్షణ (conflict) అనేవి ఎక్కడా కనిపించవు. అక్కడక్కడా ఒకటి రెండు సన్నివేశాలు తప్పితే, సినిమాలో విషయం లేదు. విదేశీ లొకేషన్స్ మాత్రం బాగా చూపించారు.

Updated Date - Jun 07 , 2024 | 02:06 PM