Adi Parvam Review: మంచు లక్ష్మి 'ఆదిపర్వం' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Nov 09 , 2024 | 10:40 AM
అమ్మోరు, అరుంధతీ తరహా చిత్రమంటూ ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఆదిపర్వం’ . మంచు లక్ష్మీ ప్రసన్న కీలక పాత్రలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ: ఆదిపర్వం (Adi parvam)
విడుదల తేది: 8-11-2024
నటీనటులు: మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) , ఆదిత్య ఓం, ఎస్తర్, సుహాసిని(Suhasini), శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీశ్
సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, నిబెక్ లీ, రామ్ సుధీ.
ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటి
నిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటి (Sanjeev Megoti)
అమ్మోరు, అరుంధతీ వంటి పీరియాడిక్ ఫాంటసీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఇప్పటికీ ఆ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఆ తరహా చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి ఓ ప్రయత్నం చేశారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతీ తరహా చిత్రమంటూ ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఆదిపర్వం’ . మంచు లక్ష్మీ ప్రసన్న కీలక పాత్రలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ: (Adi parvam movie Review)
రాయలసీమలోని కడప దగ్గర్లోని ఎర్రగుడిలో గుప్తనిధులు ఉన్నాయని అక్కడి వారి నమ్మకం. గుప్త నిధి సొంతం చేసుకుంటే రాయలసీమలోనే గొప్పవాళ్ళు అవుతారని అంతా భావిస్తారు. దాని కోసం కడప ఎమ్మేల్యే నాగమ్మ (మంచు లక్ష్మి) వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు రాయప్ప అనే గ్రామ నాయకుడు కూడా గుప్త నిధి కోసం ప్రయత్నిస్తాడు. ఆ నిధి కోసం రాయప్ప, నాగమ్మ ఎలాంటి అరాచకాలు చేశారు? ఈ క్రమంలో రాయప్ప(సత్య ప్రకాశ్) తన కూతురు బుజ్జమ్మను ఎందుకు చంపాలనుకుంటాడు. నాగమ్మ కూడా ఆమెను ఎందుకు చంపాలనుకుంది? రాయప్పపై ఆదిపత్యం చెలాయించాలనుకునే నాగమ్మ కోరిక తీరిందా లేదా? మహాలక్ష్మీ అలియాస్ బుజమ్మ(శ్రీజిత), శ్రీను(వెంకట కిరణ్)ల ప్రేమ వ్యవహారమేంటి? అన్నది మిగతా కథ.
విశ్లేషణ: (Adi parvam movie Review)
1974-90ల సమయంలో యధార్థంగా జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిదని దర్శకుడు ముందే చెప్పారు. ట్రెజర్ హంట్ లాంటి కథలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇది కూడా అలాంటి ఆ తరహా కథే. మారుమూల ప్రాంతం, అక్కడ ఓ గుడి దానిలో గుప్త నిధి, తమ వశం చేసుకోవాలనుకునే ఇద్దరు పెత్తందారులు, రకరకాల ప్రయత్నాలు, మూఢనమ్మకాలు ఇదే కథ. ఒక నిధిని వశం చేసుకోవడానికి నర బలి ఇవ్వడం, సొమ్ము కోసం కన్న బిడ్డను బలి ఇవ్వానుకోవడం, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి అన్నది దర్శకుడు చక్కగా చూపించారు. దైవ, దుష్ట శక్తుల మధ్య పోరాటం జరిగే పోరాటాన్ని, నిధి కోసం ప్రాకులాడే ఇద్దరు స్వార్థపరులను ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్న సీక్వెన్స్ ఆసక్తిగా సాగుతుంది. ఎర్రగుడి గ్రామ దేవత మారెమ్మ తనకు చెందిన గుప్త నిధిని రాయప్ప, నాగమ్మ బారి నుంచి ఎలా కాపాడుకుంది. తనని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలిచింది అన్న విషయంలో కాస్త నాటకీయల ఎక్కువగా అనిపించింది. పీరియాడిక్ డ్రామా సినిమాలో ఽఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలు గుర్తు చేశారు. బుజ్జమ్మ, శ్రీనుల లవ్ ట్రాక్ కూడా బావుంది. ఇద్దరి ఽమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో సున్నితమైన అంశం కులాల గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అగ్ర కులంలో పుట్టి, తన కులాన్ని ఎక్కడా తగ్గకూడదనే అహంకారిగా రాయప్ప పాత్ర ఆకట్టుకుంది. నాగమ్మ పాత్రకు ధీటుగా ఆ పాత్ర ఉంది. ఎస్తర్ హాట్‌హాట్‌గా కనిపించి అలరించింది. ఇలాంటి చిత్రాలకు గ్రాఫిక్స్ అత్యంత కీలకం. దర్శకుడు తన పరిధి మేరకు గ్రాఫిక్స్ వర్క్ బాగానే చేయించారు. కానీ ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండే బావుండేది. (Adi parvam movie Review)
నటీనటుల విషయానికొస్తే.. నాగమ్మ పాత్రకు మంచు లక్ష్మీ న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో పవర్‌ఫుల్‌గా కనిపించింది. తనదైనశైలి నటన, డైలాగ్ డెలివరీతో పాత్రకు గుర్తింపు తీసుకొచ్చింది. లవ్ పెయిర్‌గా వెంకట్ కిరణ్, శ్రీజిత పాత్రలు కూడా బాగానే అనిపించాయి. దేవత పాత్రలో చంటిగాడు ఫేం సుహాసిని ఆకట్టుకుంది. ఆమె ఈ టైప్ క్యారెక్టర్ చాలా సార్లు చేసింది. సత్యప్రకాశ్ పాత్ర బలంగా మంచు లక్ష్మీకి దీటుగా ఉంది. క్షేత్రపాలకుడిగా శివ కంఠమనేని యాప్ట్‌గా అనిపించారు. జెమినీ సురేష్‌చ సమ్మెట గాంధీ, ఆదిత్య ఓం పాత్రలకు చిత్రానికి కీలకంగా ఉన్నాయి. తెరపై చాలామంది ఆర్టిస్ట్‌లు కనిపించారు. కొందరికి ప్రాధాన్యం దక్కింది. కొందరు వచ్చి వెళ్తూ ఉంటారు. గ్రాఫిక్స్‌పై ఇంకాస్త దృష్టి పెట్టుండే బావుండేది. కెమెరా వర్క్ బావుంది. ఎడిటర్ ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేసుంటే బావుండేది. ఐదు పాటల్లో రెండు మూడు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో చూశాం. ఈ తరహా కథల్ని ఎంత కొత్తగా తెరకెక్కించాం అన్నదే ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు సఫలం అనే చెప్పాలి. అమ్మోరు, అరుంధతీ చిత్రాలు మాస్టర్ పీస్‌లు. ఆ చిత్రాలతో దీనిని కంపేర్ చేయకూడదు. ఈ సినిమాకు బెటర్ అవుట్‌పుట్ కోసం దర్శకనిర్మాతలు తమ శక్తి కొద్దీ ఎంత చేయాలో అంతా చేశారు. ((Adi parvam movie Review)
ట్యాగ్‌లైన్: దైవశక్తి.. దుష్టశక్తికి మధ్య పోరాటం