Nayanthara: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ఎలా.. ఉందంటే
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:16 PM
నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ (Nayanthara - Beyond The Fairy Tale)
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
నిడివి: 1.22 గంటలు
దర్శకత్వం: అమిత్ కృష్ణన్
నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. ఈ డాక్యుమెంటరీ కోసం నయన్ - విఘ్నేశ్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’లోని సన్నివేశాలను చూపించాలనుకున్నారు. కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించకపోవడంతో నయన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ధనుష్‌ను విమర్శిస్తూ కథానాయిక నయనతార ఘాటు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేసింది. అసలు ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది? ఇందులో ‘నానుమ్ రౌడీదాన్’ సన్నివేశాలను చూపించారా? అన్నది ఈ సిరీస్‌లో చూడాల్సిందే! (Nayanthara - Beyond The Fairytale)
యాడ్ టు సినిమా ఎలా?
సౌత్ లేడీ సూపర్‌స్టార్ ‘నయనతార జీవితాన్ని ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్. నయన్ ఫ్యామిలీని, ఆమె చిన్నప్పటి ఫొటోలను, చదువు ఇతర విషయాలను చెబుతూ ప్రారంభ సన్నివేశాలున్నాయి. చిన్నప్పుడు అస్సలు సినిమాలు చూసేదాన్ని కాదని, ఎప్పుడైనా బంధువులు వస్తే వెళ్లేదానినని నయన్ ఈ సందర్భంగా చెప్పారు. నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి, సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? మలయాళం నుంచి తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను ఆయా దర్శకులతో చెప్పించారు.
విమర్శలు తప్పలేదు...
తొలినాళ్లలో నయన్ ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను ఇందులో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ‘గజినీ’ మూవీ సమయంలో ఎందుకు విమర్శలు వచ్చాయి? పత్రికలు, ఇండస్ర్టీలోని వాళ్లు తనని ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను వివరించారు. అప్పుడు ధైర్యం చేసి ‘బిల్లా’ కోసం బికినీ వేసుకుని నటించడం వంటి సాహసాలు చేసినట్లు చెప్పారు. ఇండస్ర్టీ, జనాలు చేసిన విమర్శలే తాను రాటు దేలడానికి ఎలా కారణమయ్యాయో కూడా వివరించారు. సినిమా పరిశ్రమ రంగుల ప్రపంచం. తెరపై కనిపించినట్లే తారల నిజ జీవితంలోనూ బంధాలు బావోద్వేగాలు మారిపోతుంటాయి. కానీ, అవి వాళ్ల వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంతటి నిరాశ నిస్పృహలకు లోనవుతారు? తారల మధ్య కొనసాగే బంధంపై వచ్చే వార్తలు చూస్తే మనసుకు ఎలాంటి మనోవేదనకు గురవుతారన్న విషయాలను నయన్ వివరించిన తీరు నాడు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ఒక వ్యక్తితో బంధం నమ్మకంపై కొనసాగుతుంది. ఎదుటి వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాం. అలాగే రిలేషన్ కొనసాగుతుంది. వారి కోసం ఏమైనా చేస్తాం. జనాలు చాలా ఊహించుకుంటారు. నా మనసు ముక్కలైన విషయం ఏంటంటే, ప్రజలు వాళ్లకు నచ్చినట్లు ఊహించుకోవడమే’ అంటూ నయన్ పలికిన మాటలతో తారల జీవితాలు ఎలా ఉంటాయో తెలిపాయి. ముఖ్యంగా ‘జనాలు ఎప్పుడూ మగాళ్లను ఏమీ అడగరు. కేవలం మహిళలను మాత్రమే ప్రశ్నిస్తుంటారు. నటీమణులు మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నట్లు.. వాళ్లు మాత్రమే ప్రేమిస్తున్నట్లు రాసారు’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు నయన్.
నయన్ పడిన మానసిక క్షోభ...
ఓ పక్క వ్యక్తిగత జీవితం.. మరో పక్క సినిమాల్లో విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయన్ తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారన్న సంగతులు ఆసక్తిగా తెలియజేశారు. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున ఫోన్ చేసి ‘బాస్’ కోసం అడగటం, రిలేషన్షిప్ దెబ్బతిని బాధపడుతున్న సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో అవకాశం రావడం అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయన్ పడిన మానసిక క్షోభ తదితర వివరాలను కూడా ఆయా నటీనటులు, నిర్మాతలతో చెప్పించారు. మరీ ముఖ్యంగా ‘సీత’ పాత్ర చేసినన్ని రోజులు నయన్ ఎంతో నిష్ఠగా ఉండేదని చెప్పారు. అక్కడి నుంచి ‘లేడీ సూపర్‌స్టార్’ ఎలా అయ్యారో.. ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయనే విషయాలను ఇందులో ప్రస్తావించారు.
విఘ్నేశ్‌తో ప్రేమ...
మొదటి అర్థ భాగంలో నయన్ కెరీర్‌ను ప్రస్తావించగా, సెకెండాఫ్ నుంచి విఘ్నేశ్ శివన్ ఫ్యామిలీ, కెరీర్‌ను కాస్త స్పృశిస్తూ నేరుగా ‘నానుమ్ రౌడీ దాన్’ కోసం నయన్‌తో కలిసి పనిచేయడాన్ని చెబుతూ వెళ్లారు. తొలిరోజు నయన్ సెట్లో ఎలా ఉన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? దర్శకుడిగా కెరీర్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న విఘ్నేశ్‌కు నయన్ ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది విషయాలను వివరించారు. అదే సెట్లో అతడిని చూసి నయన్ మనసు పారేసుకున్న విధానాన్ని వివరించారు. ప్రస్తుతం ధనుష్, నయన్‌ల మఽధ్య చర్చకు కారణమైన ఆ మూవీ సెట్లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలను కూడా చూపించారు. నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించుకుంటున్నారన్న విషయం అటు ఇండస్ర్టీ, ఇటు జనాలకు తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్పైనా విక్కీ మాట్లాడారు. ‘నాగూర్ బిర్యానీ, ఉలందూర్పేటలోని కుక్కకు దొరకాలని రాసి ఉంటే, ఎవరూ ఆపలేరు’ మీమ్ బాగా ఫేమస్ అయిందని చెప్పారు.
పెళ్లికి ముందు...
పెళ్లికి ముందు నయన్-విఘ్నేష్ రిలేషన్షిప్ ఎలా సాగిందో ఇద్దరూ పంచుకున్నారు. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? వస్త్తే ఏం చేస్తారు. వీరి పంచాయతీ లోకి వచ్చి సర్దిచెప్పే దర్శకుడు ఎవరు? అలాగే, ఇద్దరిలో ఎవరు ఎవరికి ముందుకు తినిపించుకునేవాళ్లు వంటి ఆసక్తికర విషయాలను సరదాగా షేర్ చేసుకున్నారు. ఇక పెళ్లి కోసం ఐదారు వేల మంది పనిచేయడం, గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజున నయన్ ఽధరించిన ఎరుపు రంగు డిజైనర్ దుస్తులు వెనుక కథ తదితర ఆసక్తికర విషయాలు బాగున్నాయి. వాటిని తీర్చిదిద్దడానికి డిజైపర్లు పడిన శ్రమను నయన్ చెప్పుకొచ్చారు. చివరిలో నయన్, విఘ్నేష్‌ల పిల్లలు ‘ఉలగం, ఉయిర్’లను చూపిస్తూ డాక్యుమెంటగిని ఎండ్ కార్డ్ వేశారు.