Pushpa 2 Review: అల్లు అర్జున్ 'పుష్ప -2' ఎలా ఉందంటే...
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:43 AM
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప -2' చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం
సినిమా రివ్యూ: పుష్ప2: ది రూల్ (Pushpa : The Rule)
విడుదల తేది: 5–12–2024
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్(Fahadh Faasil), జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, అజయ్, డాలీ ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, శ్రీతేజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ (Devi Sriprasad)
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి (Mythri movie Makers)
మాటలు: శ్రీకాంత్ విస్సా
రచన, దర్శకత్వం: సుకుమార్ (Sukumar)
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న చిత్రం 'పుష్ప–1’. తొలిరోజు నెగటివ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాదు 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మహామహులు సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అల్లు అర్జున్ తీసుకొచ్చింది. ఇప్పుడు పుష్ప అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్‌గా మారిపోయింది. దానికి ధీటుగా పుష్ప–2 ప్లాన్ చేశారు. ఫస్ట్ టీజర్ నుంచే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం పోటీ పడ్డారు. ప్రీమియర్ షోలకూ, టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. బెనిఫిట్ టికెట్ రేటు చూసి ‘అమ్మో ఇంతా’ అనుకున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ మధ్య డిఫరెన్సస్. అల్లు అర్జున్ సినిమా చూసేది లేదని సోషల్ మీడియాలో రచ్చ.. ఇన్ని అంచనాలు, ఒత్తిళ్ల మధ్య ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తొలి చిత్రానికి మించి ఉందా? సుకుమార్, అల్లు అర్జున్ మూడేళ్ల కష్టానికి ఫలితం ఎలా ఉందో చూద్దాం... (Pushpa 2 Review)
కథ: (Pushpa 2 Story)
ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక). అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ. (Allu Arjun's Performance)
విశ్లేషణ:
పుష్ప అంటే నేషనల్ కాదు... ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే తొలి సీన్ నుంచి దర్శకుడు చూపించాడు. తొలి సినిమాలో అల్లు అర్జున్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌ని నమ్ముకుని ఆ పాత్ర, హీరోయిజంపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. కథలో తన మార్క్ సైకలాజికల్, మైండ్ గేమ్‌ను ప్రదర్శించాడు. జపాన్‌లో తలకిందులుగా పుష్ప ఎలివేషన్ సీన్‌లో సినిమా మొదలవుతుంది. అక్కడి తన సరుకుపై చెయ్యి వేసిన గ్యాంగ్‌ను తుక్కు తుక్కుగా బాదడం సాదాసీదాగానే అనిపించింది. 40 రోజులు తిండి తిప్పలు లేకుండా కంటైనర్‌లో ప్రయాణం చేసి తన సరుకు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసుకోవడానికి, దాని సొమ్ము చేజిక్కించుకోవడానికి జపాన్ వెళ్తాడు పుష్ఫ. కట్ చేస్తే ఫ్లాష్‌బ్యాక్. చిన్నతనంలో తండ్రి పేరు, ఇంటి పేరు అంటూ స్నేహితులు చేసిన అవమానాలు.. సీన్ తెరపైకి వస్తుంది. ఆ జర్క్‌తో ప్రేక్షకుడు మైండ్ డైవర్ట్ అవుతుంది. గాడి తప్పిందేమో అనిపిస్తుంది. తదుపరి ఒక్కో సీన్‌తో కథ దార్లోకి వస్తుంది. పోలీస్‌స్టేషన్‌లో ‘ఇది పుష్పగాడి రూలు..’ అని డిక్లేర్ చేసినప్పటి నుంచీ అసలు జాతర స్టార్ట్ అవుతుంది. కథను రెగ్యులర్ ఫార్మెట్‌లో మొదలుపెట్టినా.. దాని కన్‌క్లూజన్ కన్వెన్‌సింగ్‌గా ఇచ్చాడు దర్శకుడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో మైండ్ డైవర్ట్ కాకుండా చేశాడు. మాల్, డబ్బు కాదు.. తనని నమ్మిన వాళ్లే ముఖ్యమని పోలీస్ స్టేషన్‌లో పుష్ప చేసే హంగామా మరో లెవల్. అక్కడి నుంచి పుష్ప, షెకావత్ ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో కాసేపు గడిచిపోతుంది. ప్రథమార్థం అంతా కాస్త నెమ్మదిగా నడిచినా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మరో ఎత్తు. పుష్పతో సారీ చెప్పించుకున్న షెకావత్‌కి ఊహించని రీతిలో షాక్ ఇస్తాడు. అయితే ఇక్కడ పుష్ప వ్యాపారం మాత్రమే కాకుండా మధ్యలో కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలను కూడా తీసుకొచ్చాడు. భార్య మాట దాటని పుష్ప భార్య చెప్పింది చేస్తే ఎలా ఉంటాదో చూపించాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, ఎఫెక్షన్ ఫీలింగ్ తెరపై భలే క్యూట్‌గా ఉంటాయి. ఇక సెకెండాఫ్‌కి వస్తే గంగమ్మ జాతర ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ మోతమోగిపోయింది. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు ఒక లెవల్‌లో ఉంటాయి. ఆ సన్నివేశాల్లో శ్రీవల్లి పాత్ర చాలా కీలకం. భర్తను ఒక మాట అంటే పడని భార్య తన స్టాండ్ ఏంటో చూపించింది. నదీలో లారీల ద్వారా రెండు వేల కోట్ల ఎర్రచందనం బోర్డర్ దాటించే సీన్ ఆకట్టుకుంటుంది. అయితే షెకావత్ లారీలను ఆపే ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్‌లను దూకేసి పారిపోవడం వెనక ఏదో కారణం ఉందని అర్థమవతుంది. ఇక సెకెండాఫ్ అంతా కుటుంబం 'చిన్నాయన' అని పిలిచే తన అన్న కూతురు చుట్టూనే కథ నడుస్తుంది. ఆ సన్నివేశాలు.. కథ పక్కకు వెళ్లిన భావన కలుగుతుంది. అయితే అసలు కథే అక్కడే ఉందని పతాక సన్నివేశాల్లో అర్థమవుతుంది. అక్కడ వచ్చే పోరాట సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. సినిమా హై ఇచ్చే సీన్లు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావిస్తే ఆసక్తి పోతుంది. తెరపైనే చూడాలి.
మైనస్ పాయింట్స్: సినిమాలో సాగదీత కూడా బాగానే ఉంది. ప్రారంభంలో ఫైట్ కథకు లింగ్ కానట్టు.. ఎలివేషన్ కోసమే పెట్టినట్లు ఉంటుంది. సెకెండాఫ్‌లోని లారీల్లో ఉన్నది ఎర్ర చందనం కాదని తెలిసి షెకావత్‌కు తెల్ల పువ్వు ఇచ్చే సన్నివేశాలు కథకు భారంగా ఉన్నాయి. అయితే మొదటి పార్ట్‌లాగే ఇందులో కూడా బలమైన విలనిజం లేదు.
నటీనటుల విషయానికొస్తే.. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. మాస్ క్యారెక్టర్స్ తెరపై చాలా చూస్తుంటాం. కానీ బన్నీ చూపించిన మాస్ మామూలు మాస్ కాదు.. వైల్ మాస్ అన్నట్లు ఉంది. లుక్, మేకోవర్, మ్యానరిజం, యాస, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ప్రతి విషయంలో తన మార్క్ చూపించాడు బన్నీ. ఫైట్స్, డాన్స్ పైనా ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో బన్నీ యాక్టింగ్ మాటల్లో చెప్పలేం.. తెరపైన చూడాల్సిందే. రష్మికతో కెమిస్ర్టీ చాలా బాగా కుదిరింది. పీలింగ్స్, సూసేకి సాంగ్స్‌లో ఇద్దరి జోడీ, వాళ్లు కలిసి చేసిన డ్యాన్సులు అలరిస్తాయి. ఈ సారి రష్మిక గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్‌లోనూ ఆమె నటన బాగుంది. షెకావత్ పాత్ర క్లైమాక్స్‌కి వచ్చే సరికి తూతూ మంత్రంగా అనిపిస్తుంది. మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలూ అంతే! ఉన్నాయంటే ఉన్నాయంతే! షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ పర్ఫెక్ట్ ఫిట్. కానీ క్యారెక్టర్ రాయడంతో తేలిపోయినట్లు అనిపించింది. ఆ క్యారెక్టర్ ముగింపు కన్వెన్‌సింగ్‌గా లేదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితరుల పాత్రలో సోసోగా ఉన్నాయి. జగపతిబాబు, తారక్ పొన్నప్ప పాత్రలు ఒకే. అజయ్ పరిధి మేరకు బాగా చేశాడు. సాంకేతికంగా సినిమా ఎక్కడా తగ్గలేదు. ప్రతి డిపార్ట్‌మెంట్ తమ ప్రతిభను చూపించారు. దేవిశ్రీప్రసాద్ పాటలు, ఆర్‌ఆర్‌తో (DSP's Music) కట్టిపడేశారు. బన్నీ, సుకుమార్ అంటే తనకు ఎంత అభిమానమో మరోసారి చూపించాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్, అంతా గ్రాండియర్‌గా ఉంది. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్ వేశారు. కథని క్రిస్పీగా చూసే ప్రేక్షకులకి ఈ సినిమా లెంగ్త్ కాస్త ఇబ్బందే (Allu Arjun)
ఇక పాటల విషయానికొస్తే ప్రతి పాట సందర్భానుసారంగా ఉంది. ఫస్ట్టాఫ్‌లో పీలింగ్ పాట మాస్‌తో ఉర్రూతలూగిస్తుంది. 'పీలింగ్' సాంగ్‌లో రష్మిక డాన్స్ బన్నీని డామినేట్ చేసింది. సెకెండాఫ్‌లో సూసేకి, కిస్సిక్ పాటలు అలరిస్తాయి. కిస్సిక్ పాటలకు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మల్లె తీగలా మెలికలు తిరిగిపోయింది. డాన్సింగ్ స్పీడ్, గ్లామర్‌తో పిచ్చేకించింది. పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.
'పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు లెక్క..తీసుకోవమే కానీ నో అనడం ఉండదు’.. ''
ఆడబిడ్డ పుడితే మరో ఇంటికి పోతాది.. ఇంటి పేరు ఉంటాడి.. మగాడు పుడితే నాలాగే ఇంటి పేరు కోసం తాపత్రయ పడాలి’ అనే డైలాగ్‌లు అలరించాయి. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకున్నాయి.
‘ఎంత పుష్పగాడైనా ఇంట్లో పెళ్లాం వండిన కూర బాగోలేదని చెప్పకూడదు’ అనే డైలాగ్ చిన్నదే కావొచ్చు. కానీ భార్య భర్త ఎమోషన్‌ని, వాళ్ల బంధాన్ని సూచిస్తుంది. పెళ్లాం దగ్గర చిన్న పిల్లాడైపోయిన పుష్పని కుటుంబ ప్రేక్షకులు బాగా లైక్ చేస్తారు. ‘పీలింగ్స్’ మాటలను బట్టి వాటి చుట్టూ రొమాంటిక్ సీన్లు నడిపించారు. ‘పుష్ప 1’లో వ్యాన్ సన్నివేశంలా కాకుండా ఇందులో అన్ని పద్దతిగా ఉన్నాయి. షెకావత్‌కి పుష్ప సారీ చెబుతాడా లేదా.. చెబితే తర్వాత ఏదో ఉంటాదనే ఇంట్రెస్ట్ కలిగించాడు. అరగంట జాతర సన్నివేశం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. అయితే తెరపై అది అరగంటలా అనిపించదు. అంతగా బన్నీ నటనా విశ్వరూపం చూపించాడు. సిద్దప్ప ముఖ్యమంత్రి కాగానే కథ పూర్తి అయిపోవాలి. కానీ అలా జరగదు. సీఎంతో ఫొటో అనేది భార్య కోరిక. అంతకన్నా ముఖ్యం తన ఇంటి పేరు దక్కించుకోవడం.. అందుకే క్లైమాక్స్ కాస్త పొడగించారనిపించింది. అది కాస్త ల్యాగ్ ఉన్నా.. కానీ పుష్ప ప్రయాణానికి కన్‌క్లూజన్ రావాలంటే ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ కావాలి. పతాక పోరాటాలు కమర్షియల్‌గా సాగేదే. మాస్‌కి విపరీతంగా నచ్చుతాయి. ఆ సీన్‌ని దేవిశ్రీ సంగీతం మరింత ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కాస్త షార్ప్ ఉండాలి. కొన్ని సన్నివేశాలు అవసరం లేదనిపించేలా ఉన్నాయి. వాటికి కత్తెర వేసుంటే బావుండేది. ఇక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
నిజంగా బన్నీ చెప్పినట్లు మైత్రీ నిర్మాతలు తప్ప ఎవరూ ఇలాంటి సాహసం చేయరేమో అనిపిస్తుంది. అయితే పుష్ప–2లో పెద్ద కథేమీ లేదు. మొదటి పార్ట్‌కే కంటిన్యూ చేసి దానికి కుటుంబ భావోద్వేగాలు బాగా జోడించారు. కథ కంటే.. పుష్ప క్యారెక్టర్‌ను మాత్రమే సుకుమార్ నమ్ముకున్నాడు. ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా హీరో పాత్రను బలంగా రాసుకున్నాడు. అయితే కథ లేదు అని ప్రేక్షకుడు గుర్తించ లేకుండా లెక్కల మాస్టార్ మాయాజాలం చేశారు. పుష్ప1తో బన్నీ నేషనల్ అవార్డు రావడం కొందరికి నచ్చలేదు. అసలు బన్నీకి ఆ అర్హత ఉందా అనుకున్నారు. పుష్ప 2 చూస్తే ఆ అనుమానాలు ఇక రావు. అంతగా నటనలో విజృంభించాడు. పుష్ప 1 రిలీజ్ రోజు మిశ్రమ స్పందన వచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. పుష్ప 2కి మిశ్రమ స్పందన అనే మాటకు చోటు లేకపోవచ్చు. నార్త్‌లో ఈ సినిమాకు ఆదరణ బావుంటే మరో రేంజ్‌కి వెళ్తుంది.
ట్యాగ్‌లైన్: పుష్పగాడి ర్యాంపేజ్