Swag Review: శ్రీవిష్ణు నటించిన ‘శ్వాగ్‌’ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 02:17 PM

'రాజ రాజ చోర’తో భారీ విజయం అందుకున్నారు శ్రీ విష్ణు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హసిత్‌ గోలితో  మరో చిత్రం శ్వాగ్‌ చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

సినిమా రివ్యూ: ‘శ్వాగ్‌’
విడుదల తేదీ: 4–10–2010
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూవర్మ, దక్ష నగార్కర్‌, శరణ్య, పృథ్వీ, గోపరాజు వెంకటరమణ, రవిబాబు, సునీల్‌, గెటప్‌ శ్రీను తదితరులు.


సాంకేతిన నిపుణులు:

సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ శంకరన్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌
దర్శకత్వం: హసిత్‌ గోలి

'రాజ రాజ చోర’తో భారీ విజయం అందుకున్నారు శ్రీ విష్ణు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హసిత్‌ గోలితో  మరో చిత్రం శ్వాగ్‌ చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. శ్రీవిష్ణు ఇందులో డిఫరెంట్‌ రోల్స్‌ చేశారు.  ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్‌’ తర్వాత హ్యాట్రిక్‌ కొట్టాలనే తపనతో చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? శ్రీవిష్ణు కోరిక తీర్చిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
భవభూతి (శ్రీవిష్ణు) ఎస్సైగా రిటైర్‌ అవుతాడు. విధి నిర్వాహణలో పలు కారణాల వల్ల ఆయనకు రావలసిన  పెన్షన్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ రాకుండా ఆయన పైనున్న మహిళా అధికారి అడ్డుకుంటుంది. అదే  సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్లతో కూడిన నిధి ఉందని తెలుస్తుంది. ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వెళతాడు భవభూతి. అతనికి అక్కడ అనుభూతి (రీతూ వర్మ) కనిపిస్తుంది. శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన ఓ పురాతన పలక ఆమె దగ్గర ఉంటుంది. ఆ పలక అనుభూతి దగ్గరికి ఎలా వచ్చింది. సింగ (శ్రీవిష్ణు) ఎవరు? ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగకు మధ్య సంబంధం ఏంటి? వాళ్లకు ఆస్తి రాకుండా చేసిన యయాతి (ట్రాన్స్‌జెండర్ శ్రీ విష్ణు) ఎవరు? అతను ఏం చేశాడు? 1551 సమయంలో మగాళ్లని తన కాలి కింద చెప్పుల కింద చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)ని మాయ చేసి పురుషాధిక్యం పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్‌), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది? అనేది కథ.

Swag.jpg

విశ్లేషణ:
లింగ భేదాలు లేని సమానత్వమే మానవత్వం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. పురుషాధిక్యత – స్ర్తీ సాధికారత, మాతృస్వామ్యం – పితృస్వామ్యం... సమాజంలో వీటి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఇక్కడి మాతృస్వామ్యం నడవాలని కోరుకునే  రాణి కథ ఇందులో ఓ భాగం. ఓ కథ అనుకున్నప్పుడు దాన్ని నేరుగా ప్రేక్షకుడి మైండ్‌లోకి వెళ్లేలా చెప్పాలి. చుట్టు తిప్పి చెబితే అది అర్థం కాక ప్రేక్షకుడు సతమతమైపోతాడు. ఇక్కడ అదే జరిగింది. హసిత్‌ ఎంచుకున్న కథ బావుంది. అందులో ఉన్న ఇంపాక్ట్‌, సందేశం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేదే అవుతుంది. అయితే తెరపై చెప్పే తీరులో కాస్త తికమకపెట్టాడు దర్శకుడు. ఒక్కో ట్విస్ట్‌తో సినిమాలో కీ రోల్స్‌ను  రివీల్‌ చేయాలనుకునే క్రమంతో దర్శకుడు తడబడ్డాడు. స్ర్కీన్‌ప్లేతో ఆయన చేయాలనుకున్న మేజిక్‌ వర్కవుట్‌ కాలేదు.  మాటల రచనలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. అలాగే కొన్ని సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. సినిమా టేకాఫ్‌ అంతా బావుంది. అయితే ప్రథమార్ధం వరకూ కూడా అలా నడిచిపోయింది కానీ.. కథ ఏంటనేది అర్థం కాలేదు. సెకెండాఫ్‌ ప్రారంభం నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. దర్శకుడి ప్రతిభ అక్కడే కనిపించింది. సమాజం ఓ వ్యక్తి ఎలా గౌరవించాలి? లింగ భేదాలు లేకుండా చూడడమే సమానత్వం అన్నది దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌. దానిని వినోదంతోపాటు భావోద్వేగాన్ని జోడించి బాగానే చెప్పారు. అయితే పాత్రలను వివరించడం, ఎవరు ఎవరికి ఏమవుతారు అన్న విషయాన్ని కన్‌ప్యూజ్‌ చేశాడు. 

నటీనటులు పనితీరుకొస్తే... యయాతి, విభూతి, సింగ, భవభూతి, భవభూతి మహారాజు ఇలా ఐదు పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపించారు. ఈ తరహాలో పలు గెటపుల్లో పాత్రలు చేయాలంటే సవాల్‌తో కూడిన విషయమే. ఆ పాత్రలకు శ్రీవిష్ణు న్యాయం చేశాడు. ఏ సినిమాలో అయినా సెటిల్డ్‌గా తన పాత్ర ఉండేలా చూసుకునే శ్రీవిష్ణు ఇందులో కూడా అలాగే బ్యాలెన్స్‌ చేశారు. విభూతి పాత్రతో భావోద్వేగాన్ని పంచారు. ఆ పాత్ర ఆయనకు గుర్తుండిపోతుంది. రుక్మిణిదేవిగా రాణిగా, సాధారణ యువతిగా రీతూవర్మ మెప్పించారు., కలువగా దక్షా నగార్కర్‌ గ్లామర్‌ను అద్డారు. చక్కని అభినయం ప్రదర్శించారు. మీరా జాస్మిన్‌ కథకు కీలకమైన పాత్ర పోషించారు. ఆ  పాత్రకు వన్నె తెచ్చారు. గోపరాజు రమణ, పృథ్వీ, సునీల్‌, శరణ్య తదితరులు పరిధి మేర అలరించారు.

వివేక్‌ సాగర్‌ పాటలు, నేపథ్య సంగీతం  బావున్నాయి. రెట్రో సాంగ్‌  అలరించింది.  కెమెరా వర్క్‌ సినిమా ఎసెట్‌. నిర్మాణ విలువలు బావున్నాయి. కథ పరంగా ఎక్కువే ఖర్చు చేశారు. సమాజంలో మనం చూస్తున్న సున్నితమైన అంశాన్ని దర్శకుడు తెరపై చూపించాడు. లింగ భేధాలు లేని సమానత్వమే మానవత్వం అనే సందేశాన్ని ఇచ్చారు. వినోదం పాళ్లు కాస్త పెంచి ఉంటే మరింత అలరించే దిశగా ఉండేది. డ్రామా ఎక్కువై వినోదం పక్కకు పడిపోయింది. భావోద్వేగ సన్నివేశాలు బాగానే అలరించాయి. సినిమాలో సందేశాన్ని ఎలా చెప్పారు.. రెగ్యులర్‌ శ్రీవిష్ణుని కాకుండా కొత్త యాంగిల్‌లో చూడాలనుకునే వారు ఈ సినిమాపై లుక్కేయవచ్చు.

ట్యాగ్‌లైన్‌: సమానత్వ పోరాటంలో గజిబిజి

Updated Date - Oct 04 , 2024 | 06:12 PM