Sriranga Neethulu: టైటిలే ఓల్డ్.. సినిమా మాత్రం గోల్డ్.. డోంట్ మిస్
ABN , Publish Date - Apr 11 , 2024 | 06:57 PM
నటుడు సుహాస్, ‘బేబీ’ హీరో విరాజ్ అశ్విన్, కార్తిక్ రత్నం, రుహాణి శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ ఈ చిత్రానికి రచన, దర్శకుడు. ఇది అతనికి మొదటి సినిమా. ఇంతమంది నటీనటులతో, మూడు ప్రధాన కథలతో విడుదలైన ఈ చిన్న సినిమా ఎలా వుందో చూద్దాం.
సినిమా: ‘శ్రీరంగనీతులు’
నటీనటులు: సుహాస్, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం, రుహాణి శర్మ, సంజయ్ స్వరూప్, కిరణ్, రాగ్ మయూర్, జీవన్ కుమార్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: అజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: టిజో టామీ
నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మోరి
రచన, దర్శకత్వం: ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్
విడుదల తేదీ: 11 ఏప్రిల్, 2024
రేటింగ్: 3.5 (మూడు పాయింట్ ఐదు)
-- సురేష్ కవిరాయని
నటుడు సుహాస్ (Suhas) ముందు చిన్న పాత్రలు చేసి, తర్వాత కథానాయకుడిగా మెప్పించి, మంచి నటనతో తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. సుహాస్ హీరోగా ఒక ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీరంగనీతులు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బేబీ’ సినిమాలో రెండో కథానాయకుడిగా మెప్పించి పేరు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ఈ సినిమాలో ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు. అలాగే మూడో ప్రధాన పాత్రలో కార్తీక్ రత్నం (Karthik Ratnam), కథానాయికగా రుహాణి శర్మ (Ruhani Sharma) నటించారు. ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ (Praveen Kumar VSS) ఈ చిత్రానికి రచన, దర్శకుడు. ఇది అతనికి మొదటి సినిమా. ఇలా ఇంతమంది నటులతో విడుదలైన ఈ చిన్న సినిమా ఎలా వుందో చూద్దాం. (Sriranga Neethulu Movie Review)
*Geethanjali Malli Vachindi Movie Review: అంజలి 50వ సినిమా ఎలా ఉందంటే...
Sriranga Neethulu Story కథ:
‘శ్రీరంగనీతులు’ సినిమాలో చాలామంది కథలున్నాయి, కానీ ప్రధానంగా సాగేవి ముగ్గురివే. శివ (సుహాస్) టీవీ రిపేర్ చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఆ నియోజకవర్గ ఎంఎల్ఏతో ఫ్లెక్సీ తన ఏరియాలో పెద్దగా పెట్టించి అందరి కళ్ళల్లో పడాలని కోరిక. దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫ్లెక్సీ పెడతాడు, కానీ అది ఎవరో తీసేస్తారు. ఎవరు తీసేశారని వెతుకుతూ, స్నేహితులతో గొడవలు పడుతూ ఉంటాడు. తన తాహతుకు లేకపోయినా పరువుకోసం అప్పు చేసైనా ఇంకో ఫ్లెక్సీ పెట్టాలని అనుకుంటాడు, ఆ ప్రయత్నంలో అతను ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు, అతని కథ ఎలా మలుపు తిరిగింది. ఇక రెండోది వరుణ్ (విరాజ్ అశ్విన్), ఇందు (రుహాణి శర్మ)ల కథ. ఇద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ కులం, ధనం అడ్డు వస్తుంది. ఇందు ధనవంతుల అమ్మాయి, ఆమెకి ఇంట్లో వేరే సంబంధం చూస్తారు. ఈలోగా ఆమె ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళుతుంది. నాన్న అంటే ఇష్టం, అందుకని ఇంట్లో తన పెళ్లి గురించి చెప్పలేక భయపడుతూ ఉంటుంది. ఇటు ప్రియుడిని వదులుకోలేక, అటు ఇంట్లో చెప్పలేక ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ చివరికి ఎటు దారితీసింది?. ఇక మూడో వ్యక్తి కార్తీక్ (కార్తిక్ రత్నం) కథ. చదువుకుంటాడు కానీ మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. నిరంతరం గంజాయి, సిగరెట్లు కాలుస్తూ తన గమ్యం ఏంటో తనకే తెలియని స్థితిలో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసుల బారిన పడతాడు. అతని తండ్రి (దేవి ప్రసాద్) కొడుకు పరిస్థితిని చూసి అతన్ని ఎలాగైనా మార్చాలని ప్రయత్నాలు చేస్తాడు. కార్తిక్‌ని తీసుకొని వేరే ఊరుకు వెళుతున్నప్పుడు అనుకోని చిక్కుల్లో పడతాడు. కొడుకు చేసే పని కారణంగా.. అతను పోలీసు స్టేషన్‌లో ఇరుక్కుంటాడు. చివరికి వీరి పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం ఏమవుతుంది? ఇలా మూడు రకాలైన భిన్న కథలతో ఆసక్తిగా వుండే ఈ కథల ముగింపు ఏమైందో తెలుసుకోవాలంటే ‘శ్రీరంగనీతులు’ సినిమా చూడాల్సిందే. (Sriranga Neethulu Telugu Movie)
విశ్లేషణ:
ఈమధ్య యువ దర్శకులు చాలామంది మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాంటి యువ దర్శకుల్లో ఈ ‘శ్రీరంగనీతులు’ సినిమా దర్శకుడు ప్రవీణ్ కుమార్ ఒకరు. సినిమా ప్రారంభం ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి హరికథ గానంతో మొదలవుతుంది. ఒక్కొక్కరి కథని చెప్పుకుంటూ వెళుతూ వుంటారు. దర్శకుడు ఈ సినిమాలో చూపించినవి మూడు కథలని అనుకుంటాం కానీ, ఇందులో ఎన్నో కథలుంటాయి. ఈ ముగ్గురి కథలు అనేకమందితో పెనవేసుకుంటాయి, అలాగే సమాజానికి కూడా ముడిపడి ఉంటుంది. ఒక యువ దర్శకుడు ఇటువంటి కథతో రావడం అంతే సాహసమనే చెప్పాలి. అందుకు అతన్ని అభినందించాల్సిందే. (Sriranga Neethulu Movie Review)
తను చేస్తున్న ఉద్యోగంలో ఇంకా కష్టపడితే పైకెళ్లొచ్చు అనే ఆలోచనలో కాకుండా కొంతమంది యువకులు తమ బస్తీలో వున్న ప్రజల కళ్ళల్లో పడటానికి, పరువుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టించుకోవటంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అదే తమకి గొప్ప పేరు తీసుకువస్తుందని అనుకుంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్లి అదే బస్తీలో వుండే యువకులకు స్ఫూర్తిగా ఉండాలి కానీ, ఇలాంటి చిల్లర రాజకీయ మోజులో పడి ఎలా కాలాన్ని వృధా చేసుకుంటున్నారు అనేది కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు. ఇది ప్రతి బస్తీలో, గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తూ ఉంటాము. పండగలకి, పబ్బాలకి వీధిలో పెట్టే పెద్ద ఫ్లెక్సీలు మనకి గుర్తుకు వస్తాయి. అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ. ఇద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కానీ ఇంట్లో చెప్పాలంటే భయం. అలా అని ప్రేమని వదులుకోరు. కులం, డబ్బులు అడ్డొస్తాయి. వీరిద్దరి మధ్య జరిగే ఆ సంఘర్షణ కూడా ఎంతో సహజసిద్ధంగా చూపించాడు దర్శకుడు. ఇక మత్తు పదార్ధాలకు బానిసై తన కెరీర్ పాడుచేసుకోవటమే కాకుండా, కుటుంబానికి కూడా ఎంతో మనస్థాపం కలిగించే యువకుడి మానసిక సంఘర్షణ, స్నేహితుల హాస్టల్‌కి వెళ్లడం, పోలీసుల నుంచి పారిపోవటం, తండ్రి కొడుకు గురించి మదన పడటం, ఇవన్నీ చక్కగా తెరపైన ఆవిష్కరించాడు దర్శకుడు ప్రవీణ్. (Telugu Movie Sriranga Neethulu)
ఇలా ముగ్గురి కథలే చూపించిన మధ్యలో ఒక మంచి పోలీసు ఆఫీసర్, అతను కుర్రాళ్లపై కేసులు పెడితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఎలా వాళ్ళని కౌన్సిలింగ్‌కి పంపిస్తున్నాడు అనే విషయం ఇవన్నీ ఎంతో సహజ సిద్ధంగా ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది, లేనట్టు అనిపిస్తుంది, కానీ ఈ కథలన్నీ సమాజంలోనే జరుగుతాయి. ఇలా ఈ కథలన్నీ ఎటువంటి ముగింపుకి వస్తాయి అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా చూపించడమే కాకుండా, ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. అయితే సందేశం ఉంటుంది అని ఇదేదో వ్యాపారాత్మక సినిమా కదా అంటే, ఇందులో అవన్నీ కూడా బాగా మిశ్రమం చేశాడు. కథలన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. ఇందు కారు ప్రమాదం జరిగినప్పుడు పోలీసు స్టేషన్‌లో జరిగే సంఘటన, ఇందు కాబోయే అత్తగారు ఒక్కసారిగా వీడియో కాల్ చేసినప్పుడు ఆమె మాట్లాడినప్పుడు వచ్చే సన్నివేశం, ఫ్లెక్సీ కోసం శివ డబ్బులు దొంగతనం చేసే సన్నివేశం ఇవన్నీ ఎంతో వినోదాత్మకంగా వుండి కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ఇవన్నీ సహజంగా వుండి ప్రేక్షకులని ఎంతో అలరిస్తాయి కూడా. (Sriranga Neethulu Report)
మధ్యలో తనికెళ్ళ భరణితో ఒక సందేశాత్మక హరికథ చెప్పించటం కూడా బాగుంది. ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, మాటలు బాగున్నాయి, నేపధ్య సంగీతం కూడా ఎంతో హృద్యంగా ఉంటుంది. అలాగే నటీనటులు అందరూ ఎంతో సహజంగా తమ పాత్రలో ఇమిడిపోయి, సినిమా చూస్తున్నంత సేపూ ఇది నిజంగా మన మధ్య, మన సమాజంలో జరుగుతున్న సంఘటనగా అనిపిస్తూ ఉంటుంది. యువ దర్శకుడు ప్రవీణ్ కుమార్ ఇలాంటి కథతో ఒక మంచి సందేశాత్మక సినిమాతో రావటం అభినందించాల్సిందే! ఇలాంటి చిన్న సినిమాలని ప్రోత్సహించాలి కూడా, మంచి సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకులు మాత్రం తప్పకుండా ‘శ్రీరంగనీతులు’ చూసి తీరాల్సిందే.
ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ అద్భుతంగా తమ పాత్రలని సమానంగా ఒకరితో ఒకరు పోటీ అన్నట్టుగా చేశారు. సుహాస్ ఈమధ్య నటుడిగా ఎదుగుతూ వస్తున్నాడు, అతని కెరీర్‌లో ఇదొక మంచి పాత్ర. శివ పాత్రలో ఇమిడిపోయాడు అని చెప్పాలి. విరాజ్ అశ్విన్ ‘బేబీ’ తర్వాత ఏవో సినిమాలు చేశాడు కానీ, ఈ ‘శ్రీరంగనీతులు’ సినిమా పాత్ర మాత్రం గుర్తుండిపోయే పాత్ర. ఎంతో సహజంగా నటించాడు, మెప్పించాడు, మంచి ప్రతిభ కనపరిచాడు. హావభావాలు, మాటలు చెప్పే విధానం చూస్తే ఈ సినిమాతో నిజంగా అతను ఒక మంచి నటుడిగా ఎదుగుతాడు అనిపిస్తోంది. కార్తీక్ రత్నం ఇంతకు ముందు ఏవేవో సినిమాలు చేశాడు, వెబ్ సిరీస్‌లు కూడా చేశాడు, కానీ ఇందులో మత్తు పదార్ధాలకి బానిస అయ్యే పాత్రలో జీవించేశాడని చెప్పొచ్చు.
అతన్ని చూస్తే నిజంగానే ఏదో కోల్పోయినవాడిలా అద్భుతమైన నటన కనబర్చాడు. ముఖ్యంగా హాస్టల్‌లో సన్నివేశం, తండ్రితో వుండే సన్నివేశాలు, రోడ్డుపై పడుకున్న ముసలి తాతతో సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఇక రుహాణి శర్మ మంచి నటి అని ఆమె మొదటి చిత్రం ‘చి.ల.సౌ’ తోనే నిరూపించుకుంది. ఈ సినిమాలో అందరితో పోటీగా ఎంతో సహజత్వంతో కూడిన నటన ప్రదర్శించింది. రుహాణి శర్మ అందం, అభినయంలో ప్రతిభ గల నటి అని మరోసారి నిరూపించింది. దేవి ప్రసాద్ తండ్రిగా మరోసారి జీవించారు. సంజయ్ స్వరూప్ పాత్ర పరిధి మేరకు చేశారు. సుహాస్ స్నేహితులుగా అందరూ మెప్పించారు. వాసు ఇంటూరి పోలీస్ అధికారిగా సహజంగా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాకి మాటలు, నేపధ్య సంగీతం, పాటలు హైలైట్ అలాగే సినిమా ఆసక్తికరంగా ఉండటానికి ఇవన్నీ ప్రధాన పాత్ర పోషించాయి.
చివరగా, ‘శ్రీరంగనీతులు’ అనే చిన్న సినిమా ఒక మంచి సినిమా. ఏదైనా మంచి సినిమా వస్తే చూడాలి అనుకునే ప్రేక్షకులు ఇలాంటి చిన్న సినిమాలని ప్రోత్సహిస్తే ఈ సినిమా దర్శకుడు ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం వుంది. అక్కడక్కడా చిన్న చిన్న సాగదీతలున్నా మంచి సినిమా ఇది. ఈమధ్య కాలంలో నాకు బాగా నచ్చిన సినిమా, సహజసిద్ధంగా వుండి, సందేశం కూడా మిళితమై వున్న సినిమా వచ్చింది అంటే అది ‘శ్రీరంగనీతులు’ అనే చెప్పాలి. (Sriranga Neethulu)
ఇవి కూడా చదవండి:
====================
*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్
**********************
*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..
****************************
*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
*********************