Prasanna Vadanam Movie Review: సుహాస్ కి ఇంకో హిట్ వచ్చిందా?

ABN , Publish Date - May 03 , 2024 | 05:37 PM

సుహాస్ కథానాయకుడిగా నటించిన మరొక సినిమా 'ప్రసన్నవదనం' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దగ్గర పనిచేసిన అర్జున్ వైకె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Prasanna Vadanam Movie Review: సుహాస్ కి ఇంకో హిట్ వచ్చిందా?
Prasanna Vadanam Movie Review

సినిమా: ప్రసన్నవదనం

నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: ఎస్ చంద్రశేఖరన్

నిర్మాతలు: మణికంఠ జెఎస్, టిఆర్ ప్రసాద్ రెడ్డి

రచన, దర్శకత్వం: అర్జున్ వైకె

విడుదల తేదీ: 3 మే, 2024

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా చేసిన సుహాస్ ఇప్పుడు కథానాయకుడిగా ఎదిగి వరసగా సినిమాలు చేస్తున్నాడు. అలా కథానాయకుడిగా చేసిన ఇంకో సినిమా 'ప్రసన్న వదనం' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్ర దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన వైకె అర్జున్ అనే అతను దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కథానాయకులు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Prasanna-Vadanam-3.jpg

Prasanna Vadanam Story కథ:

సూర్య (సుహాస్) ఒక ఎఫ్ఎం రేడియోలో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు, ఒకసారి అతను తల్లిదండ్రులతో కారులో వస్తూ ఉండగా ప్రమాదం జరుగుతుంది. తల్లిదండ్రులు చనిపోతారు, బాగా గాయపడిన సూర్యకి ఒక వింతైన వ్యాధి వస్తుంది. అతను ఏ వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తిని పోల్చుకోలేడు, ఈ ప్రమాదం వలన అతనికొచ్చిన వింతైన వ్యాధి ఇది. అందుకని ఏదైనా ఒక బండగుర్తుపెట్టుకొని ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా అయితే పోల్చుకోలేడు. ఇటువంటి వింత వ్యాధి వున్న సూర్యని ఒక అమ్మాయి (పాయల్) ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు వర్షం పడుతూ ఉంటే, సూర్య రోడ్డు పక్కన వున్న చిన్న పాక కింద తడవకుండా నిలుచున్నప్పుడు, ఒక హత్యని చూస్తాడు. ఒక వ్యక్తి, అమృత అనే అమ్మాయిని రోడ్డుపై స్పీడుగా వెళుతున్న లారీకిందకి నెట్టేస్తాడు, ఆమె చనిపోతుంది. సూర్య అది చూస్తాడు, కానీ అతనికున్న వ్యక్తుల మొహాలు పోల్చుకోలేకపోవటం అనే వ్యాధి వలన అతను ఏమీ చెయ్యలేక, ఒక అపరిచిత వ్యక్తిలా పోలీసు స్టేషన్ కి ఫోను చేసి, అది ప్రమాదం కాదు, హత్య అని చెబుతాడు. అయితే ఈ హత్య చేసింది అదే పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్ఐ రామచంద్ర (నితిన్ ప్రసన్న), కానీ సూర్యకున్న వింత వ్యాధివలన అతన్ని పోల్చుకోలేకపోతాడు. కానీ సూర్య అపరిచిత వ్యక్తిలా పోలీసు స్టేషన్‌కి సమాచారం ఇచ్చిన సంగతి రామచంద్ర తెలుసుకుంటాడు. ఒకసారి సూర్యపై దాడిచేసి, బెదిరిస్తాడు. భయపడిన సూర్య పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఏసిపి (రాశి సింగ్) కి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాడు. అమృత చనిపోయింది ప్రమాదంలో కాదని, అది హత్య అని, ఒక వ్యక్తి తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో చెప్తాడు. ఫిర్యాదు తీసుకున్న ఏసిపి ఏమి చేసింది? ఇంతకీ ఈ హత్య వెనకాల వున్న నేపధ్యం ఏంటి, ఎందుకు చేశారు? మొహాలు పోల్చుకోలేని సూర్యని అమృత హత్యలో ఎలా ఇరికించారు? అందులోంచి ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే 'ప్రసన్న వదనం' చూడాల్సిందే.

Prasanna-Vadanam-5.jpg

విశ్లేషణ:

దర్శకుడు అర్జున్ ఒక 'ఫేస్ బ్లైండ్ నెస్' లేదా మొహాలు పోల్చుకోలేకపోవటం అనే వ్యాధి నేపథ్యంలో తీసిన థ్రిల్లర్ సినిమా ఇది. దర్శకుడు కొంతవరకు సఫలీకృతం అయ్యాడనే చెప్పొచ్చు. కథానాయకుడికి ఒక ప్రమాదం జరిగి అతను ఏదైనా బండ గుర్తు పెట్టుకుంటే తప్ప ఏ వ్యక్తినీ పోల్చుకోలేడు అనే విషయాన్ని సినిమా ప్రారంభంలో చెప్పేశాడు. ఆ విషయంపై కొన్ని వినోదాత్మక సన్నివేశాలను కూడా బాగానే తీశాడు. కానీ అందులో కొన్ని మరీ సాగదీసినట్టుగా కూడా చూపించాడు. కథని ఎలా నడిపించాలో తెలియక దర్శకుడు కథానాయకుడికి, అతని ప్రియురాలికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బలవంతంగా పెట్టినట్టుగా మరీ ఎక్కువై సాగదీసినట్టుగా అనిపించింది. అయితే ఇటువంటి కథా నేపధ్యం వున్న సినిమాలు ఇంతవరకు తెలుగులో మాత్రం రాలేదు. కానీ ఇటువంటి సినిమా హాలీవుడ్‌లో వచ్చింది. 'ఫేసెస్ ఇన్ ది క్రౌడ్' (2011) అనే సినిమాని స్ఫూర్తిగా దర్శకుడు తీసుకున్నట్టు కనబడుతోంది. ఆ ఇంగ్లీష్ సినిమాలో ఒక అమ్మాయి, సీరియల్ కిల్లర్ ఒక హత్య చెయ్యడం చూస్తుంది, వెంటనే ఆ సీరియల్ కిల్లర్ ఆ అమ్మాయిపై దాడి చేస్తాడు, ఆమె వెంటనే ఒక బ్రిడ్జిపైనుండి దూకుతుంది, ఆ ప్రమాదంలో ఆమెకి 'పేస్ బ్లైండ్ నెస్' అనే వ్యాధి వచ్చి, ఏ వ్యక్తి మొహాన్ని గుర్తుపట్టలేకపోతుంది. దానివలన ఆమె ఎటువంటి ఇబ్బందులకు గురైంది, చివరికి ఆమె ఎలా ఆ కిల్లర్ ని పట్టి ఇచ్చింది అనేది ఆ సినిమా సారాంశం. అదే కథా నేపధ్యాన్ని ఇక్కడ దర్శకుడు అర్జున్ తీసుకున్నాడు, ఆ సినిమాలో అమ్మాయిని, ఇక్కడ అబ్బాయిగా, అలాగే తెలుగులో అటు, ఇటు కొంచెం మార్చాడు అంతే.


తెలుగులో కథానాయకుడికి ఇటువంటి వ్యాధి ఉందని ముందే చెప్పేస్తాడు దర్శకుడు. సూర్య ఎప్పుడైతే హత్యని చూశాడో, అక్కడ నుండి కథ ఆసక్తికరంగా వెళుతుంది. సూర్య స్నేహితుడు వారిస్తున్నా, వినకుండా, ఉండలేక అది ప్రమాదం కాదు, హత్య అని పోలీసు స్టేషన్ కి ఫోన్ చెయ్యడం, పోలీసు స్టేషన్ కి వెళ్ళినప్పుడు హత్య చేసిన వ్యక్తి అదే స్టేషన్ లో ఎస్ఐ గా ఉండటం, అతన్ని పోల్చుకోలేక పోవటం ఇవన్నీ ఆసక్తికరంగా వున్నాయి. అలాగే విరామం ముందు వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు, అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఎప్పుడైతే అసలు విషయం బయటకి వచ్చిందో, ఇంక అక్కడ నుండి పిల్లి, ఎలుకల ఆటలా సాగుతుంది. సూర్యని హత్యకేసులో ఇరికించడం, అతని తప్పించుకోవటం అవన్నీ మరీ సినిమాటిక్ గా వున్నా, పతాక సన్నివేశాలు, దానిముందు వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా తీయగలిగాడు దర్శకుడు. ఒకవిధంగా చెప్పాలంటే అక్కడక్కడా కొన్ని లోపాలున్నా దర్శకుడు ప్రేక్షకులని చివరివరకూ ఆసక్తికరంగా కూర్చునేలా చేశాడు. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం సన్నివేశాలకి అనుగుణంగా వుంది, ఛాయాగ్రహణం కూడా బాగుంది.

Prasanna-Vadanam.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సుహాస్ తన నటనతో మరోసారి మెప్పించాడు. ఇటువంటి పాత్రలు అతనికి మాత్రమే సూట్ అవుతాయి అనే విధంగా చేశాడు. అతను కూడా వైవిధ్యమైన ఇటువంటి కథలను ఎంచుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. పాయల్ రాధాకృష్ణ, సుహాస్ ప్రియురాలిగా పరవాలేదు అనిపించింది. కానీ 'ప్రసన్నవదనం' సినిమాలో హైలైట్ మాత్రం రాశి సింగ్ అనే చెప్పాలి. ఆమె పాత్ర సినిమాకే హైలైట్, ఆమె అంతే అద్భుతంగా తన నటన, హావభావాలతో ఆ పాత్రని ముందుకు తీసుకెళ్లింది. కెరీర్ మొదట్లోనే ఆమె ఇటువంటి పాత్ర చెయ్యడం, ఆమె మెప్పించడం, ప్రతిభ కనపరచడం, ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతోంది. నితిన్ ప్రసన్న పాత్ర కూడా బాగుంది, అతను కూడా బాగా మెప్పించాడు. హర్ష చెముడు ఇంకో రొటీన్ పాత్రలో కనపడతాడు. నందు పాత్ర గంభీరంగా ఉంటుంది, కనపడినంతసేపు బాగా చేశాడు.

చివరగా.. 'ప్రసన్న వదనం' ఆసక్తికరంగా వుండే థ్రిల్లర్ సినిమా. ఒక వైవిధ్యమైన కథని దర్శకుడు అర్జున్ ప్రేక్షకులని చివరివరకు అలరించే విధంగా బాగా తీశాడు. సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించాడు, అలాగే ఇలాంటి వైవిధ్యమైన కథలతో తనతో సినిమాలు తీయవచ్చు అని కొత్త దర్శకులకి, నిర్మాతలకి సూచన ప్రాయంగా ఈ సినిమాతో చెప్పాడు. అక్కడక్కడా సాగదీతలు వున్నా 'ప్రసన్నవదనం' సినిమా నిరాశపరచదు, ఒకసారి చూడొచ్చు.

Updated Date - May 03 , 2024 | 06:09 PM