Ooru Peru Bhairavakona movie review: సందీప్ కిషన్ ఫాంటసీ సినిమా ఎలా ఉందంటే...
ABN , Publish Date - Feb 16 , 2024 | 08:56 AM
సుందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఐ ఆనంద్ దర్శకుడు ఈ సినిమాకి. ఫాంటసీ, అతీంద్రీయ శక్తుల నేపధ్యలో సాగే ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: ఊరు పేరు భైరవకోన
నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, హర్ష చెముడు, రవిశంకర్, వెన్నెల కిషోర్, వడివుక్కరసి తదితరులు
ఛాయాగ్రహణం: రాజ్ తోట
కథ: భాను బోగవరపు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: రాజేశ్ దండా
కథనం, దర్శకత్వం: వీఐ ఆనంద్
రేటింగ్: 2 (రెండు)
-- సురేష్ కవిరాయని
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఐ ఆనంద్ దర్శకుడు, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించగా, రాజేష్ దండా నిర్మాత. ఇది ఒక ఫాంటసీ, అతీంద్రియ శక్తి నేపథ్యంలో సాగే చిత్రం. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవ్వాల్సి వుంది, కానీ 'ఈగల్' నిర్మాతలు తమకి సోలోగా విడుదల ఇస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాట ఇచ్చారని, అందువలన ఆ మాటకి కట్టుబడి ఉండాలని ఒక లేఖ రాశారు. అందువలన ఈ 'ఊరు పేరు భైరవకోన' ఈ వారం అంటే ఫిబ్రవరి 16న విడుదలైంది. ఈ సినిమా మీద గట్టి నమ్మకంతో ఈ సినిమాని 'వాలెంటైన్స్ డే' సందర్భంగా కొన్ని ప్రీమియర్ ఆటలు వేశారు. దానికి మంచి స్పందన లభించింది. సందీప్ కిషన్ ఈమధ్య చాలా సినిమాలు చేసాడు కానీ అతనికి సరైన హిట్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఇప్పుడు అతనికి ఈ 'ఊరు పేరు భైరవకోన' హిట్ ఇచ్చిందా, లేదా చూద్దాం.
Ooru Peru Bhairavakona story కథ:
బసవ (సందీప్ కిషన్) అనే అతను సినిమా స్టార్స్ కి బాడీ డబుల్ గా పని చేస్తూ ఉంటాడు. ఒకసారి అతను ఆటోలో వెళుతుంటే భూమి (వర్ష బొల్లమ్మ) అనే అమ్మాయి తన బేగ్ ఇద్దరు దొంగలు తీసుకుపోతున్నారు అని బసవ నడుపుతున్న ఆటో ఎక్కుతుంది. బసవ ఆమెని చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత కొంత పరుగుపందెం తరువాత బసవ ఆ ఇద్దరు దొంగలను పట్టుకొని ఆ బాగ్ లో వున్న వస్తువులని చూడగానే షాక్ అవుతాడు. అందులో ఒక వ్యక్తి యొక్క అస్థిపంజరం అవయవాలుంటాయి. అదే అమ్మాయి కోసం బసవ ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి అక్కడ పెళ్లికూతురు నగలు ఎత్తుకుపోతాడు. అతని స్నేహితుడు జాన్ (హర్ష చెముడు) తో ఆ నగలను పట్టుకొని పోలీసులకి దొరక్కుండా పారిపోవాలని కారులో పారిపోతూ ఉంటాడు. దారిమధ్యలో ఒక అమ్మాయి గీత (కావ్య థాపర్) స్పృహ తప్పి పడిపోయి వుంటే ఆమెని కూడా తమ కారులోకి ఎక్కించి ఆమెని ఒక డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకుంటారు. ఆలా వెళుతూవుండగానే భైరవకోన అనే వూరులోకి ప్రవేశిస్తారు. ఆ వూరులో వీళ్ళకి అన్నీ వింత గా ఉంటాయి, వింత మనుషులు కనిపిస్తారు. అక్కడ ఒక డాక్టర్ (వెన్నెల కిశోరె) కి గీతని చూపించి ఆమెకి వైద్యం చెయ్యాలని చెప్తారు. ఆ వూర్లో ఎందుకు అందరూ వింతగా వున్నారు, భైరవకోనకి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం వుంది. భైరవకోనలోకి వెళ్ళినవారు తిరిగి బయటకి రాగలరా? అక్కడ ఈ వెళ్లిన ముగ్గురూ ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? భూమి ఎవరి అస్థిపంజరం అవయవాలు ఆలా బేగ్ లో పెట్టుకొని తిరుగుతుంది, ఆమె కథ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'ఊరు పేరు భైరవకోన' సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు వీఐ ఆనంద్ ఇంతకు ముందు తాను చేసిన కొన్ని సినిమాలలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా' లలో ఫాంటసీ లేదా ఈ అతీంద్రీయ శక్తులు (supernatural) నేపధ్యం కనపడుతుంది. ఇప్పుడు ఈ 'ఊరు పేరు భైరవకోన' లో కూడా ఫాంటసీ, అతీంద్రీయ శక్తులు నేపధ్యం ఉంటుంది. అయితే ఇవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ప్రేక్షకులని నమ్మించే విధంగా ఉండాలి. అదీ కాకుండా ఎలా ఫాంటసీ/ అతీంద్రీయ శక్తుల నేపధ్యం చూపించేటప్పుడు దర్శకుడు సినిమాలో కొన్ని సన్నివేశాలనైనా అద్భుతంగా 'ఆహా' అనిపించే విధంగా తీయగలిగితే సఫలీ కృతుడు అవుతాడు. అదీకాకుండా కథ, దానికనుగుణంగా వచ్చే భావోద్వేగాలు ఎటువంటి నేపధ్యం వున్నా ఈ రెండూ ఆ కథలో సాధారణంగా ఉండేవి. అయితే ఇప్పుడు విఐ ఆనంద్ ఈ రెండిటినీ ఈ 'ఊరు పేరు భైరవకోన' లో చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి.
అసలు కథ ఎటు నుండి ఎటు వెళుతోంది, ఎక్కడికి పోతోంది, అసలు ఏమి జరుగుతోంది అనేది ప్రేక్షకుడికి పూర్తిగా అర్థం కాదు. దానికితోడు కథలో బలమైన భావోద్వేగాలు పూర్తిగా మిస్ అయ్యాయి. ఒక్కో పాత్ర తాను ఎదో నటించి చూపాలి అన్నట్టుగా నటిస్తున్నారు తప్పితే ఆ పాత్రలో లీనమై నటించడం లేదు. ప్రేక్షకులకి ఇది ఫాంటసీ కథా, అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో తీసిన కథా, లేక ఇంకేమైనా అనేది అసలు అర్థం కాకుండా పోయింది. దర్శకుడు తాను ఏమి చెప్పదలుచుకున్నాడో అది చెప్పలేకపోయాడు. ఒక్కో సన్నివేశానికి మధ్య కనెక్టివిటీ మిస్ అయింది. అక్కడక్కడ కొన్ని వినోద సన్నివేశాలు తప్పితే సినిమాలో విషయం లేదు, రెండో సగం పూర్తిగా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష అనే చెప్పాలి.
కథానాయకుడు, కథానాయిక అయిన సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ల మధ్య ఎటువంటి భావోద్వేగం లేకుండా వారి ప్రేమ సాదా సీదాగా తీసేసారు. పోనీ భైరవకోనలోకి ప్రవేశించాక సినిమా కథ ఏమైనా ఆసక్తికరంగా సాగుతుందా అంటే అదీ లేదు. అక్కడ కూడా మామూలుగానే సాగుతుంది, దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. ప్రమాదకరమైన భైరవకోనలోకి రెండో సారి కథానాయకుడు తన ప్రేమని గెలిపించుకోవడం వెళతాడు, ఆలా వెళ్ళినప్పుడు అతని ప్రేమ ఎంత బలమైనదో దర్శకుడు చూపించాలి, కానీ అది చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు దర్శకుడు.
ఇక ఆ దెయ్యాల గోల ఏంటో అర్థం కాదు. ఎక్కడ భావోద్వేగాలు లేవు, ప్రేక్షకుడిని కట్టి పడేసేలా, లేదా నమ్మించే కథ లేదు. ఏదో నాలుగు వినోద సన్నివేశాల కోసం భైరవకోనలో ఆ దెయ్యాలను పెట్టినట్టు చూపించేసాడు. సినిమా విడుదలకి ముందు దర్శకుడు ఆనంద్ 'గరుడ పురాణం' గురించి మాట్లాడేరు. మనిషి చనిపోయాక అతని/ఆమె ఆత్మ తిరుగుతూ ఉంటుంది, చేసిన పాప పుణ్యాలని బట్టి, చనిపోయిన బంధువులు చేసిన కర్మలు వాటి గురించి, ఆత్మలు ఎటు వెళతాయి వాటి గురించి ఎక్కువగా గరుడ పురాణం వర్ణిస్తుంది. మరి ఈ దెయ్యాల కథలేంటో అవి అంత నమ్మేట్టు కథని చెప్పలేకపోయాడు దర్శకుడు. సాంకేతికంగా సినిమా బాగుంది అని చెప్పొచ్చు. ఆ సెట్స్ వేసిన అతన్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే అవి బాగున్నాయి. శేఖర్ చంద్ర పాటలు వినడానికి బాగున్నాయి, కానీ తెరమీద అవి అంతగా బాగా రాలేదు అనే చెప్పాలి. ఛాయాగ్రహణం బాగుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే బసవ పాత్రలో సందీప్ కిషన్ బాగున్నాడు, కానీ ఎందుకో ప్రతి సన్నివేశంలోనూ చాలా ఆలస్యంగా అతని ప్రతిస్పందన వుంది. ఉదాహరణకు అవతలి వ్యక్తి ఏదైనా అంటే ఒక రెండు నిముషాలు ఆగి అతనికి సమాధానం చాలా ఆలస్యంగా చెపుతూ వచ్చాడు సినిమాలో. అతనికి, వర్షకి మధ్య కెమిస్ట్రీ అసలు కుదరలేదు. కథ సరిగ్గా లేనప్పుడు అతను మాత్రం ఏమి చేస్తాడు. హర్ష చెముడు తన పాత్రకి న్యాయం చేసాడు. వెన్నెల కిషోర్ కామెడీ రొటీన్ అయిపొయింది. మొదటి పదిహేను నిముషాల్లో బ్రహ్మాజీ వున్నారు అతను ఉన్నంతసేపూ సినిమా వినోదంగా వుంది. అతని పాత్ర రెండో సగంలో వుండే బాగుండేది. వర్ష బొల్లమ్మ భూమి పాత్ర బలంగా లేదు, కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువ, ఆమె గురించి చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. రవి శంకర్ మాటలు లౌడ్ గా వున్నాయి, ఆ మత్తల్లాగే పాత్ర కూడా అంతే ఓవర్ యాక్టింగ్ లా ఉంటుంది, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
చివరగా, 'ఊరు పేరు భైరవకోన' సినిమా అనుకున్నంత ఆసక్తికాగా చూపించడంలో దర్శకుడు ఆనంద్ విఫలం అయ్యారు. కథలో బలం లేదు, భావోద్వేగాలు లేవు, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ లేదు. అక్కడక్కడా కొన్ని వినోద సన్నివేశాలు, భైరవకోన వూరు సెట్స్ తప్ప సినిమాలో విషయం లేదు. విడుదలకి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ఆటలు వేసి ఈ చిత్ర నిర్వాహకులు తప్పు చేశారేమో అనిపిస్తుంది!