Paarijatha Parvam Movie Review: ఇదేమి సినిమారా బాబోయ్!
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:23 PM
ఈ వారం చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయి, అందులో ఈ 'పారిజాత పర్వం' సినిమా ఒకటి. కిడ్నాప్ నేపథ్యంలో వినోదాత్మకంగా తీసిన సినిమా అని విడుదలకి ముందు ఈ చిత్ర నిర్వాహకులు చెప్పారు, మరి సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: పారిజాత పర్వం
నటీనటులు: చైతన్య రావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధ దాస్, మాళవిక సతీషన్, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, రోహిణి, తదితరులు
ఛాయాగ్రహణం: బాల సరస్వతి
సంగీతం: రి
దర్శకత్వం: కంభంపాటి సంతోష్
నిర్మాత: మహీధర్ రెడ్డి, దేవేష్
రేటింగ్:1 (ఒకటి)
-- సురేష్ కవిరాయని
ఈ వారం చాలా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, అందులో ఒకటి 'పారిజాత పర్వం'. చైతన్య రావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధ దాస్ నటించిన సినిమా ఇది, కంభంపాటి సంతోష్ దర్శకత్వం వహించారు. (Paarijatha Parvam Movie Review) చాలా కాలం తరువాత శ్రద్ధ దాస్ ఈ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Paarijatha Parvam Story కథ:
చైతన్య (చైతన్య రావు) దర్శకుడవుదామని కథలు నిర్మాతలకి వినిపిస్తూ ఉంటాడు, అతని స్నేహితుడు హర్ష (హర్ష చెముడు)ని కథానాయకుడిగా అనుకొని కథలు రాస్తూ ఉంటాడు. నిర్మాతలు అతని కథలు బాగున్నాయి అంటారు కానీ, అతని స్నేహితుడిని కథానాయకుడి అంటే ఎవరూ ఒప్పుకోరు. మరో వైపు శీను (సునీల్) నటుడవుదామనుకొని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, మిగతా టైమ్లో ఒక బార్లో పనిచేస్తూ ఉంటాడు. అదే బార్లో పార్వతి (శ్రద్ధ దాస్) డాన్సర్ గా పని చేస్తూ ఉంటుంది. పార్వతితో ఒకరోజు ఆ బార్ ఓనర్ అసభ్యంగా ప్రవర్తించడంతో శీను కలుగచేసుకొని ఓనర్ ని కొడతాడు, ఓనర్ చనిపోతాడు. (Paarijatha Parvam Movie Review) అప్పటి నుండి శీను, బార్ శీను అనే రౌడీగా పాపులర్ అయి సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఏ నిర్మాతా సినిమా ఛాన్సులు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన చైతన్య.. హర్ష, తమ స్నేహితురాలు (మాళవిక సతీషన్) తో కలిసి నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) రెండో భార్య సురేఖ (సురేఖ వాణి) ని కిడ్నాప్ చేసి, నిర్మాత దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు వసూల్ చెయ్యాలని అనుకుంటారు. అదే సమయంలో బార్ శీను, పార్వతి కూడా సురేఖని డబ్బులు కోసం కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ వేస్తారు. ఇంతకీ ప్లాన్ ప్రకారం ఈ రెండు బృందాలలో ఎవరు నిర్మాత భార్యని కిడ్నాప్ చేశారు? నిర్మాత స్నేహితుడు సిఐ (సమీర్) ఈ కిడ్నాపర్ లని పట్టుకునే ప్రయత్నంలో ఏమి చేశాడు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ:
ఈవారం అన్నీ చిన్న సినిమాలే విడుదలయ్యాయి అందులో కొంచెం బజ్ వున్న రెండు సినిమాలలో ఈ 'పారిజాత పర్వం' ఒకటి. ఈమధ్య కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వ్యాపారాత్మకంగా నడవకపోయినా, సినిమా బాగుంది అని విమర్శకులు ప్రశంసించినవి వున్నాయి. అలా అనుకునే ఈ 'పారిజాత పర్వం' అనే సినిమాకి వెళితే, అసలు సినిమా ఎలా తీయ్యకూడదో దర్శకుడు చాలా చక్కగా తీసి చూపించాడు. ఈమధ్య కాలంలో ఇంతటి దారుణమైన సినిమా ఏదైనా వచ్చిందంటే అది ఈ 'పారిజాత పర్వం' అనే చెప్పాలి. (Paarijatha Parvam Movie Review) దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడు, తెరపైన ఏమి చూపించాడు, కిడ్నాప్ డ్రామా అని సినిమా విడుదలకి ముందు ప్రచారాల్లో చెప్పి, తెరపైన ప్రేక్షకుడికి ఎంతటి నరకం చూపించాడో ఆ దర్శకుడికే తెలియాలి. ప్రేక్షకుడి సహనానికి కూడా ఓ హద్దుంటుంది, మొదటి సగం చూసిన తరువాత సంతోషంగా ఇంటికి వెళ్లిపోవచ్చు, అంతగా విసుగు పుట్టించాడు దర్శకుడు.
ఈ కిడ్నాప్ ల కథల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి, అందులో వినోదాత్మకంగా తీసినవి చాలా వున్నాయి, విజయం కూడా సాధించాయి. ఇలాంటి కథలు కొత్తేమీ కాదు, కానీ ఈ 'పారిజాత పర్వం' అనే సినిమాలో మాత్రం కథ లేదు, కథనం లేదు, ఒక భావోద్వేగం లేదు, ఈ సినిమా కన్నా రంగస్థలంపై కళాకారులు వేసే నాటకాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతగా ఈ సినిమాతో విసిగించాడు అనే చెప్పాలి. సినిమా కథలో నిర్మాత చెప్పినట్టుగా 'కృష్ణానగర్ నుండి వచ్చినవాళ్లు తాము గొప్ప కథ చెపుతున్నాం అని అనుకుంటారు' అని అంటాడు చైతన్య రావుతో. అదే విషయం నిజ జీవితంలో ఈ సినిమా దర్శక, నిర్మాతలు ఎందుకు పాటించలేదో మరి. మొదటి సగం ప్రేక్షకుడి సహనానికి ఒక పరీక్ష అయితే, రెండో సగం అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే, ఒక్క సన్నివేశం కూడా సరిగ్గా చూపించలేకపోయారు. సినిమా అయిపోయేసరికి ఎందుకు ఈ సినిమాకి వచ్చామా అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యే పరిస్థితికి వస్తాడు. ఒకే ఒక్క ఆసక్తికరం అంశం ఏంటంటే ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం ఎవరు చేయించారన్నది, అంతే తప్ప ఈ సినిమాలో ఇంకెటువంటి ఆసక్తికర అంశం లేదు.
Mahesh Babu: పొడవాటి జుట్టు, గడ్డం.. సూపర్ స్టార్ లుక్ అదిరిపోలా..
నటీనటుల విషయానికి వస్తే చైతన్య రావు పరవాలేదనిపించాడు. హర్ష చెముడు చాలా ఓవర్ యాక్టింగ్ చెయ్యడమే కాకుండా తన మాటలు మామూలుగా చెప్పకుండా అరుస్తూ, తన నటనతో ప్రేక్షకులని విసిగెత్తించాడు అనే చెప్పాలి. సునీల్ బార్ శీను గా పరవాలేదు. శ్రద్ధ దాస్ పాత్ర కొంచెం బలంగా రాసుంటే బాగుండేది, ఆమె చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో కనిపించింది. మాళవిక సతీషన్ కథానాయిక పాత్రలో కనపడుతుంది, ఆమె పరవాలేదు. సురేఖా వాణి, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు ఒకే. (Paarijatha Parvam Movie Review) జబర్దస్త్ రోహిణి కూడా ఒక పాత్రలో కనిపించింది. మాటలు, సంగీతం, ఛాయాగ్రహణం అంతా నాసిరకంగా వున్నాయి. నేపధ్య సంగీతం ఎలా ఉందంటే మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వినిపిస్తూ ఉంటుంది కదా సంగీతం అలా వుంది ఈ సినిమాలో నేపధ్య సంగీతం. సినిమాలో మ్యాటర్ లేనప్పుడు ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, అందుకని ఈ సినిమా గురించి విశ్లేషణ ఎక్కువ అవసరం లేదు.
చివరగా, 'పారిజాత పర్వం' సినిమా ఎలా తీయకూడదో దర్శక, నిర్మాతలు ఈ సినిమా ద్వారా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ప్రేక్షకుడి సహనానికి ఈ సినిమా ఒక అగ్నిపరీక్ష, అసలే థియేటర్స్ కి ప్రేక్షకులు రావటం లేదు అని అనుకుంటూ ఉంటే, ఇలాంటి సినిమాలు తీసి ఆ వచ్చే పదిమందిని కూడా సినిమా చూడటానికి రానివ్వకుండా చేస్తున్నారు.