Saindhav Movie Review: నిజంగా ఇది సైకో సినిమానే!
ABN , Publish Date - Jan 13 , 2024 | 03:05 PM
సీనియర్ నటుడు వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ సినిమాగా 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు విడుదలైంది. శైలేష్ కొలను దర్శకుడు. ఇది ఒక యాక్షన్ సినిమా, ఎలా వుందో చదవండి.
సినిమా: సైంధవ్
నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ తదితరులు
ఛాయాగ్రహణం: ఎస్ మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
విడుదల: జనవరి 13, 2024
రేటింగ్: 2 (రెండు)
-- సురేష్ కవిరాయని
సీనియర్ నటుడు వెంకటేష్ తన 75వ సినిమాగా 'సైంధవ్' సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు, వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈ పండగ లిస్ట్‌లో ఉన్న నాలుగు సినిమాలలో ఇది మూడో సినిమా. ఇందులో చాలామంది ఇతర భాషా నటులు వున్నారు. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగులో ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
ఈ కథ అంతా చంద్రప్రస్థ అనే ఒక సిటీలో జరుగుతుంది. సైంధవ్ కోనేరు లేదా సైకో (వెంకటేష్) చంద్రప్రస్థ పోర్టులో ఉద్యోగి. అతను తన పాప గాయత్రి (సారా పాలేకర్) తో ఉంటాడు, స్నేహితురాలు మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) పక్కింట్లో ఉంటుంది, ఆమె ఒక క్యాబ్ డ్రైవర్. మనోజ్ఞ, తన భర్త (గెటప్ శ్రీను) మీద గృహ హింస కేసు పెట్టి వెంకటేష్ ఇంటి పక్కన ఉంటుంది, ఆమెకి సైంధవ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అతని బిడ్డను తన కూతురిలా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు స్కూల్లో గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళితే ఆమెకి ఎస్ఎంఏ (నాడీ కండరాల వ్యాధి) ఉందని, పాప బతకడానికి రూ.17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ అవసరం అని డాక్టర్లు చెబుతారు. మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) తదితరులు భాగస్వామిగా ఉన్న ఒక కార్టల్ టీము అక్రమంగా కొన్ని రవాణా వ్యాపారాలు చేస్తూ, అందులో కొంతమంది పిల్లల్ని కూడా అక్రమంగా తరలిస్తుంటారు. ఈ మాఫియా గ్యాంగ్ కి సైకో అంటే భయం. ఎందుకు వీళ్ళకి సైకో అంటే భయం? అతని నేపధ్యం ఏంటి? పాప బతకడానికి ఆ మందు కొనడానికి సైకో రూ.17 కోట్లు ఎలా తెచ్చాడు, చివరికి పాపని బతికించుకున్నాడా? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు శైలేష్ కొలను ఇంతకు ముందు రెండు సినిమాలు చేసాడు, 'హిట్' ఈ సినిమాకి సీక్వెల్ 'హిట్ 2'. ఈ రెండూ కూడా థ్రిల్లర్ సినిమాలు. ఆ రెండు సినిమాల్లో యువ నటులు విశ్వక్ సేన్, అడివి శేష్ కథానాయకులు అయితే, ఇప్పుడు సీనియర్ నటుడు వెంకటేష్ తో ఈ 'సైంధవ్' చేసాడు శైలేష్. ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు నుంచీ చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత, దర్శకుడు అయిన శైలేష్ కథ ఏమి చెప్పాడు వెంకటేష్ కి, లేదా వెంకటేష్ ఏమైనా తప్పుగా విన్నారా, అని ప్రేక్షకుడిని ఆలోచనలో పడేస్తుంది. ఎందుకంటే అంత సీనియర్ నటుడు అయిన వెంకటేష్ ఈ కథ ఎలా ఒప్పుకున్నారు, అతని జడ్జిమెంట్ ఎక్కడ తప్పయింది? అని అనుకుంటారు.
దర్శకుడుకి ఇంగ్లీష్ సినిమా 'జాన్ విక్' మైండ్ లో బాగా పాతుకుపోయిందేమో, అందుకే ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే అందులో మొదటి నుండి చివరి వరకు యాక్షన్, అలాగే ఈ 'సైంధవ్' కూడా అంతా యాక్షన్, అయితే ఇందులో యాక్షన్ మరీ ఘోరంగా వుంది. కొన్ని పోరాట సన్నివేశాలు అయితే దీపావళి పండగనాడు టపాకాయలు పేల్చినట్టు సైకోకి, గ్యాంగ్ మెంబర్లకు అవుతూ ఉంటుంది. పాపకి వ్యాధి, అది నయం అవటానికి అయ్యే ఇంజెక్షన్ ఖర్చు రూ.17 కోట్లు అనే చిన్న పాయింట్ మీద కదంతా అల్లారు కానీ, అది నమ్మేట్టుగా తీయలేకపోయారు.
మనోజ్ఞకి, సైంధవ్ కి ఎలా పరిచయం అన్నది చూపించలేదు, అవసరం లేదు, కానీ ఆమె సైంధవ్ పక్కింట్లో ఉంటుంది, ఒక్కోసారి సైంధవ్ ఇంట్లో ఉంటుంది. భర్త మీద గృహ హింస కేసు పెడుతుంది, భర్తని కూడా చూపిస్తారు. భర్తని పూర్తిగా వదల్లేదు అన్నట్టుగా చూపిస్తారు, కానీ సైంధవ్ తో మాత్రం బాగా దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ చంద్రప్రస్థ సిటీలో వందలమంది చనిపోతూ వుంటారు కానీ, పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమీ ఉండదు. సినిమా చివర్లోనే వస్తారు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
వెంకటేష్ 75వ సినిమా అని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు, ప్రచారాలు కూడా చేశారు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఇది తెలుగు సినిమాలా కనిపించదు, డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో వెంకటేష్ తప్పితే తెలుగు నటులు కనిపించేది చాలా తక్కువ. నవాజుద్దీన్ సిద్దిఖీ గొప్ప నటుడే కావచ్చు, కానీ అతని తెలుగు, హిందీ మాటలు మాత్రం ప్రేక్షకులకి చిరాకు తెప్పించాయి. మిగతా నటులకి డబ్బింగ్ గొంతులు పెద్దగా అరుస్తూ వినపడుతూ ఉంటాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ తన పాత్రకి తగిన న్యాయం చేశారు, ఎక్కువ పోరాట సన్నివేశాలే కాబట్టి, అలా నరుక్కుంటూ, పొడుచుకుంటూ అతని పాత్ర చివరి వరకు వెళుతూ ఉంటుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ గొప్ప నటుడే కానీ, ఈ తెలుగు సినిమాలో మాత్రం అంతగా అతని పాత్ర పండలేదు. శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది, పరవాలేదు. ఆండ్రియా విలన్ గా చేసింది, ఎప్పుడూ బబుల్ గమ్ నములుతూ ఉంటుంది. తమిళ నటుడు ఆర్యని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. రుహాని శర్మ పాత్ర పరిమితం. ముఖేష్ రుషి, జిషుషేన్ గుప్త, జయప్రకాశ్ అందరివీ మామూలు పాత్రలే.
చివరగా, 'సైంధవ్' ఒక అర్థం పర్థంలేని యాక్షన్ సినిమా, పండగనాడు చూసే సినిమా కాదు, ముఖ్యంగా కుటుంబంతో, పిల్లలు చూడాల్సిన సినిమా కూడా కాదు. వెంకటేష్ 75వ సినిమా ఒక గుర్తిండిపోయే సినిమాగా ఉంటుందని అనుకుంటారు, కానీ ఈ సినిమాతో నిరాశ పరిచారు అనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ కు మహిళా అభిమానులు, కుటుంబంతో చూసే అభిమానులు ఎక్కువ, అందుకని అతని నుండి పండగనాడు అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తారు, కానీ ఇలా ఈ 'సైంధవ్' తో నిరాశ పరిచారు.