Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:30 PM
విశ్వక్ సేన్ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
సినిమా: ‘గామి’ (Gaami)
నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, శాంతి రావు, అష్రాఫ్ తదితరులు
ఛాయాగ్రహణం: విశ్వనాధ్ రెడ్డి
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాత: కార్తీక్ శబరీష్
రచన: ప్రత్యూష్ వత్యం, విద్యాధర కాగిత
దర్శకత్వం: విద్యాధర కాగిత
విడుదల తేదీ: 8 మార్చి, 2024
రేటింగ్: 3 (Three)
-- సురేష్ కవిరాయని
విశ్వక్ సేన్ (Vishwak Sen) వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రచారాలు కూడా విరివిగా చేశారు, ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా కూడా వున్నాయి. ఈ సినిమా పూర్తి చేయడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. ఈ సినిమాతో విద్యాధర కాగిత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కోసమని ఎక్కడో హిమాలయాల్లో మంచు బాగా కురిసే ప్రాంతాల్లో షూటింగ్ చేయడం, కొన్నిసార్లు ప్రత్యేకమైన ఋతువులకోసం ఎదురుచూడటం వంటివి చేయడంతో సినిమా పూర్తి చేయడానికి చాలా కాలం పట్టిందని చెబుతున్నారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటించింది. మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.. (Gaami Movie Review)
Gaami Story కథ:
శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోర, అతనికి మానవ స్పర్శ, అంటే ఇంకొక మానవుడిని ఎవర్ని ముట్టుకున్నా అతనికి అదొక రకమైన వ్యాధి వచ్చి చనిపోతాడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉండే ఒక మొక్కలో ఆ ఔషధం ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్ వ్యాధి నయమవుతుందని స్వామీజీ చెప్తాడు. ఈ మొక్క కూడా 35 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని.. ఆ సమయంలోనే ఆ మొక్కని తీసుకురావాలని చెప్తాడు. జాహ్నవి (చాందిని చౌదరి) ఒక డాక్టర్, రీసర్చ్ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకు దేవదాసి నుండి తప్పించేస్తారు, కుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల మీద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు, అక్కడి నుండి ఒక అబ్బాయి తప్పించుకొని బయటపడతాడు. ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. శంకర్‌కు ఆ ఔషధం తీసుకురావడంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి సాధించాడా? జాహ్నవి ఏమైంది? దేవదాసి కుమార్తె తప్పించుకొని ఎక్కడికి వెళ్లింది? బయటపడిన కుర్రాడు ఏమయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘గామి’ సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
ఈ ‘గామి’ సినిమా తీసిన నిర్మాతకు, అలాగే దర్శకుడు విద్యాధరకు ముందు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమాలో ఒక వైవిధ్యమైన కథ చెప్పాలని, సినిమా అంటే వ్యాపార విలువలే కాకుండా ఒక మంచి కథ కూడా చెప్పాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసినందుకు. ఇక తెరమీద ఒక్కో సన్నివేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైన ఆ మంచు ప్రదేశాలు, ఆ కొండలు, ఆ పర్వతాలు, ఔషధం కోసం శంకర్ పడే పాట్లు, సాహసాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు చాలా తెలివిగా కథనాన్ని అల్లుకున్నాడు. శంకర్‌కి ఎందుకు మానవ స్పర్శ తగలకూడదు.. తగిలితే ఏమవుతుంది అనే విషయాన్ని దర్శకుడు చివరివరకు ఆసక్తిగా కొనసాగించాడు. మరోవైపు గ్రామాల్లో జరిగే దేవదాసి సంప్రదాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు. అలాగే మనుషుల మీద ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు వాళ్ళ మధ్యలో కొంతమంది మనుషులు ఏ విధంగా నరకయాతన పడుతున్నారనేది చాలా బాగా చూపించాడు. ఇక్కడ కథ ఎక్కువగా విశ్లేషించడానికి వీలుకాదు.. ఎందుకంటే సినిమా మొత్తం ఒక వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది. ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత.. ఈ సినిమా ఇంత వైవిధ్యంగా తీసినందుకు టీమ్‌ని అభినందిస్తాడు. ఈ సినిమాలో మాటలు తక్కువగానే ఉన్నప్పటికీ.. అవే చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక చాయాగ్రహణం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉందంటే అందుకు చాయాగ్రహణం చాలా ముఖ్యం చాలా బాగా చూపించారు. దానికి తోడు నేపథ్య సంగీతం బాగా తోడై సినిమా ఇంకో లెవెల్‌కి వెళ్లడానికి ఉపయోగపడింది. వీటన్నింటిని జనరంజకంగా మలిచినందుకు దర్శకుడిని అభినందించాలి. (Telugu Movie Gaami Review)
ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ (#VishwakSen).. శంకర్‌గా మంచి నటనను ప్రదర్శించాడీ సినిమాలో. వాణిజ్యపరమైన అంశాలు ఉన్నాయా? లేవా? అని కాకుండా పాత్ర బాగుందా.. లేదా? అని చూసి ఈ శంకర్ పాత్రలో మమేకం అయిపోయాడు. సినిమాలో మనకి నటులు గుర్తుకురారు పాత్రలే గుర్తుంటాయి. విశ్వక్సేన్కి ఈ పాత్ర కెరియర్లో గుర్తుండిపోయే పాత్ర. హీరోయిన్ చాందిని చౌదరి చాలా చక్కగా నటించింది. తెలుగమ్మాయిలు మంచి పాత్రలు వస్తే ప్రతిభ చూపిస్తారని చాందిని.. జాహ్నవి పాత్రలో నిరూపించింది. అభినయ దుర్గగా, ఉమగా వేసిన అమ్మాయి చాలా బాగా చేశారు. మిగతా పాత్రలన్నీ కూడా చాలా బాగున్నాయి. (#GaamiReview)
చివరగా ‘గామి’ సినిమా.. శంకర్ అనే ఒక అఘోర తనెవరో.. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవాలని చేసే ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనల ఆధారంగా మలచిన చిత్రం. ఆ లాబరేటరీ పరీక్షలవి ప్రేక్షకులకి అర్థం కాకపోవచ్చు. వాటిని పక్కన పెడితే.. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే దర్శక నిర్మాతలు చేసిన ఒక మంచి ప్రయత్నానికి కచ్చితంగా అభినందించాలి.
ఇవి కూడా చదవండి:
==================================
*Gopichand: ఆ ఇంటికి వెళ్తుంటే ఆయన కష్టం కనిపిస్తుంది
****************************