Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన రవిబాబు, ఏం మాట్లాడుకున్నారు?
ABN , Publish Date - Jan 08 , 2024 | 07:02 PM
ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆసుపత్రిలో కలిశారు. అయితే ఈ ఇద్దరూ ఏమి మాట్లాడుకున్నారు, పరిశ్రమకి సంబంధించిన విషయాలు ఏమైనా వీళ్లిద్దరి మధ్య చర్చకు వచ్చాయా అని పరిశ్రమలో ఆసక్తిగా చర్చిస్తున్నారు
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు రవిబాబు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఆసుపత్రిలో కలిశారు. ఈమధ్య చాలామంది తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు కోమటిరెడ్డి ని కలిశారు, కానీ ఈరోజు రవిబాబు మంత్రి గారిని కలవటం వెనక ఏమైనా ఉందా అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం అస్వస్థతగా వుండి మాదాపూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అతన్ని చూడటానికి రవిబాబు వచ్చారని అంటున్నారు, కానీ అక్కడ అతని ఏమి మాట్లాడిందీ మాత్రం తెలియదని అంటున్నారు.
రవిబాబు కి దగ్గరగా వుండే కొంతమందిని వాకబు చేస్తే, వాళ్ళు చెప్పిన ప్రకారం రవిబాబు, కోమటి రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మంచి స్నేహితులని అంటున్నారు. గత 16 సంవత్సరాల నుండి ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారని, ఇద్దరూ అప్పుడప్పుడూ లంచ్, డిన్నర్ బోజనాలప్పుడు కలుస్తూ ఉంటారని కూడా వినికిడి. అలాగే ఈ ఇద్దరు కుటుంబాలు కూడా చాలా సన్నిహితంగా వుంటాయని కూడా చెపుతున్నారు.
మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటు వేయాల్సిందిగా రవిబాబు ఒక వీడియో చేసి సామజిక మాదేమాల్లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 'నాకే కనక నల్గొండలో ఓటు ఉన్నట్టయితే నేను కోమటిరెడ్డి గారికే వేసేవాడిని. నల్గొండలో వోటున్న మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వేసి ఒక అతి ఉత్తమ నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోండి' అంటూ ఒక వీడియో ఆ ఎన్నికల ప్రచారంలో రవిబాబు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పరిశ్రమలో ఎవరూ ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నా, రవిబాబు మాత్రం కోమటిరెడ్డి తరపున ఒక ప్రచార వీడియో చేసి అతన్ని గెలిపించవలసిందిగా ప్రజలని ప్రార్ధించారు. మంత్రితో చాలా సన్నిహితంగా ఉండబట్టే రవిబాబు ఎన్నికల్లో కోమటిరెడ్డికి ఓటెయ్యమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు అని కూడా అంటున్నారు.
కోమటిరెడ్డి గెలిచారు, ఎంఎల్ఏ అయ్యారు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అయ్యారు, అంటే పరిశ్రమ బాగోగులు గురించి, సమస్యలు గురించి ఏమైనా ఉంటే కోమటిరెడ్డికే చెప్పాలి. మరి రవిబాబు, కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా ఆసుపత్రిలో కలిసి త్వరగా కోలుకోవాలని చెప్పారా, లేక పరిశ్రమకి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఇటువంటి సందేహమే పరిశ్రమలో చర్చ ఒకటి నడుస్తున్నట్టుగా వినికిడి.