Mahesh Babu: 'మురారి' సినిమా చూసి కృష్ణ ఏమన్నారో తెలిస్తే షాకవుతారు
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:22 PM
మహేష్ బాబు, దర్శకుడు కృష్ణ వంశీ కాంబినేషన్ లో వచ్చిన 'మురారి' సినిమా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు మహేష్ బాబు తన తండ్రి కృష్ణ తో సినిమా చూసారు, సినిమా అయ్యాక కృష్ణగారు చెప్పిన మాటలు ఏంటంటే...
దర్శకుడు కృష్ణ వంశీ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'మురారి' ఈరోజుకి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది మహేష్ బాబు కెరీర్ లో ఒక స్పెషల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత దర్శకురాలు నందిని రెడ్డి ఈ 'మురారి' సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేశారు. అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. సోనాలి బెంద్రే ఇందులో కథానాయికగా వేశారు. ఇందులో చాలామంది నటీనటులు కనిపిస్తారు. సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, లక్ష్మి, రవి బాబు, రఘుబాబు, శివాజీ రాజా, చిన్న, హేమ, అనిత చౌదరి, ప్రసాద్ బాబు, అన్నపూర్ణ ఇలా చాలామంది వుంటారు.
మహేష్ బాబు చేసిన మురారి పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, అతనికి చేసిన నటనకి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు వచ్చింది. అలాగే ఇందులో మహేష్ అమ్మగా నటించిన లక్ష్మి గారికి ఉత్తమ నటిగా నంది అవార్డు రావటం విశేషం, అలాగే ఈ సినిమా రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ఆ సంవత్సరం గెలుచుకుంది.
ఇదే సినిమా గురించి మహేష్ ఒకసారి మాట్లాడుతూ ఈ సినిమాని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారితో హైదరాబాదులోని ఒక సినిమా థియేటర్ లో చూసాను అని చెప్పారు. సినిమా అయిపోయాక కృష్ణ గారు ఏమీ మాట్లాడకుండా చాలా భావోద్వేగానికి గురయి మహేష్ బుజం మీద చేతులు వేసి గట్టిగా భుజాలను పట్టుకున్నారు. మహేష్ నటనని మాటలతో కాకుండా తన చేతలతో చెప్పి ఎంతో బావోద్వేగాయానికి గురైన కృష్ణ గారు. ఆరోజు అయన చేసిన ఆ చర్య మహేష్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనగా ఎన్నోసార్లు చెప్పారు మహేష్. అలాగే మహేష్ కెరీర్ లో ఈ 'మురారి' సినిమా ఒక మైలురాయి అని చెప్పొచ్చు.
క్లైమాక్స్ ముందు రవిబాబు తో పోరాట సన్నివేశం జరిగిన తరువాత మహేష్ బాబు నటన అత్యద్భుతం అని అప్పట్లోనే విమర్శకులు కొనియాడారు. కుటుంబ ప్రేక్షకులకి ఈ సినిమా ఎంతగానో నచ్చడం విశేషం. ఈ సినిమాకి ముందు రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, ఆ సమయంలో ఈ 'మురారి' విజయం సాధించటం మహేష్ బాబు కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టిన సినిమా ఇది. అందుకే అతని కెరీర్ లో ఈ సినిమా ఒక గుర్తుండిపోయే సినిమాగా ఉంటుంది.