మెగా మేనల్లుడికి ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 09:36 PM
మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్.. తన చిన మామయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంని కలిసిన ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే..
యువ కథానాయకుడు, మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నటనపట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ సహ నటులు, సాంకేతిక నిపుణులపట్ల ఎంత గౌరవమర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ప్రతి విషయంపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తాడు. అదే విధంగా తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గా తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియచేస్తోంది. ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
Also Read-మిల్కీ బ్యూటీ తమన్నాలో ఈ మార్పు చూశారా..
సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ “చిన్నమావయ్య ఆశీర్వాదం పొందటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా కెరీర్‌కు మార్గదర్శిగా ఉన్నారు. చిన్నతనం నుంచి నాకు కళ్యాణ్ మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాణ్ణి. ఒక టోర్నమెంట్‌లో ఓడిపోయాను. ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కన పడేస్తే కళ్యాణ్ మావయ్య మోటివేట్ చేశారు. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచే వరకూ ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్‌కు పంపించారు. ఆ టోర్నీలో గెలిచాను. అప్పుడు మావయ్య బలంగా హత్తుకొని ముద్దుపెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు తీసుకువెళ్తోంది” అని అన్నారు.