Bigg Boss8 Fame Sonia Akula: వాళ్లు ఎలిమినేట్ చేస్తే నేను రాలేదు.. ఎంతకైనా తెగిస్తాననే పంపారు
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:18 PM
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇంతకు ముందు సీజన్లకంటే చప్పగా కొనసాగుతుంది. ఆడియన్స్ ఈసారి బిగ్ బాస్‌కు కనెక్ట్ కావటం లేదు. కారణం ఏమిటో 4వ వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో పై, అలాగే హోస్ట్ నాగార్జునపై తాజాగా సోనియా కొన్ని సంచలన ఆరోపణలను చేసింది. ఆ ఆరోపణలు ఏమిటంటే..
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇంతకు ముందు సీజన్లకంటే చప్పగా కొనసాగుతుంది. ఆడియన్స్ ఈసారి బిగ్ బాస్‌కు కనెక్ట్ కావటం లేదు. దీనికి ప్రధాన కారణం కంటెస్టెంట్‌ల ఆట తీరుతో పాటు.. నిర్వాహకులు కంటెస్టెంట్‌లతో ఆడిస్తోన్న ఆట కూడా ఓ కారణం. తమకు నచ్చిన కంటెస్టెంట్‌లకు స్కోప్ ఇవ్వడంతో పాటు.. నచ్చని వారిని మిడ్ ఎలిమినేషన్, సెల్ఫ్ ఎలిమేషన్‌ల పేరుతో బయటకు పంపటం.. రోజుకు 24 గంటల ఫుటేజ్ ఉంటే.. అందులో తమకు ఇష్టం ఉన్న వారిని పాజిటివ్‌గా చూపటం.. ఇష్టం లేని వారిని నెగిటివ్‌గా ప్రొజెక్ట్ చేయటం లాంటి కారణాల వల్ల.. ఎలిమినేషన్ల విషయంలో కూడా ఆడియెన్స్ కన్ఫ్యూజ్‌కి గురువుతున్నారు. సేఫ్ అవ్వాల్సిన వాళ్లు ఎలిమినేట్ అవడం, అందుకు రీజన్ ఓట్లు అని నాగార్జున చెప్పడం చూస్తుంటే.. ఎందుకో ఆడియన్స్‌కు ఈ సీజన్ అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తోంది.
Also Read-Bigg Boss 8 Telugu: ‘తొక్కలో నామినేషన్’.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు
ముఖ్యంగా సోనియా ఆకుల ఈసారి బిగ్ బాస్ షోలో తన ఆట, మాట తీరుతో ఆడియన్స్ అటెన్షన్‌ను గెలుచుకుంది. అయితే సీజన్ నడిచే కొద్దీ ఆమె ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీల విషయంలో సోనియా ప్రవర్తించిన తీరుపై బిగ్ బాస్ ఆడియెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా చివరి వరకు హౌస్‌లో ఉంటుందనుకున్న సోనియా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె బయటకు వచ్చింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ షో పై సోనియా ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
తన మాటలను ఇష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి చూపించారంటూ సోనియా మండిపడుతోంది. మీకు నచ్చినట్టు చూపిస్తే పడటానికి నేను ఇక్కడికి రాలేదు.. నన్ను నన్నుగా నా రియాలిటీ ఏంటో చూపిద్దాం అని బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాను. నా వ్యాల్యూస్‌ని దెబ్బకొడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సోనియా ఆకుల. బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల.. తాను ప్రేక్షకుల ఓటింగ్‌ని బట్టి ఎలిమినేట్ కాలేదని.. ఇది నూటికి నూరు శాతం నిజమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read-Vishal: విజయ్ పిలవకపోయినా వెళతా.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
నాగార్జున తనతో తప్పు మాట్లాడారని.. థర్డ్ వీక్‌లో నేను అలిగానని అన్నారు.. అది రాంగ్. హోస్ట్‌గా ఆయన చేసింది తప్పు. వాడెవడో పెట్టలేదని, తినమని అడగలేదని నేనెందుకు అలుగుతా. అది కూడా తప్పే. యష్మీ విషయంలో కూడా నన్నే రాంగ్‌గా చూపించారు. అడల్ట్ రేటెడ్ కామెడీతో అన్నదానితో లింక్ చేశారు.. అది కూడా తప్పే. నిఖిల్‌ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని అన్నారు.. అది కూడా తప్పే. మిస్ ఫైర్ అయ్యిందని నిఖిల్ అంటే.. ఏ మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాగార్జున సార్ తప్పు మాట్లాడారు. లేదు సార్.. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని వివరణ ఇచ్చిన తరువాత కూడా.. ఆయన ఏం చెప్పాలని అనుకున్నారో.. నాకు అర్థమైపోయింది. నన్ను రాంగ్ వేలో చూపిస్తున్నారని నాకు క్లారిటీ వచ్చేసింది.
నేను విష్ణుని ఏ డిస్కషన్‌లో అడల్ట్ రేటెడ్ కామెడీ అని అన్నానో.. దాన్ని తీసుకొచ్చి యష్మీ ఇష్యూతో లింక్ చేశారు. అది టోటల్ రాంగ్. విష్ణుకి నేను క్షమాపణ చెప్పా.. దాన్ని కూడా చూపించలేదు. నీకు నచ్చినట్టు చూపించడానికి నేను ఇక్కడికి రాలేదు. నా రియాలిటీ ఏంటో చూపించడానికి వచ్చాను. నా వ్యాల్యూస్‌ని డౌన్ చేస్తే నేను తీసుకోలేను. నాగ్ సార్ ఇలా అన్నప్పుడు నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒక వారం ఇస్తా.. ప్రతి వారం ఇదే రిపీట్ చేస్తున్నారు. వాళ్లు నన్ను ఎలా చూపించాలని అనుకుంటున్నారో.. నాగార్జున సార్ మాటల్ని బట్టి తెలిసింది. నా విలువని తగ్గిస్తే నేను అస్సలు సహించను.. అందుకే నా అంతట నేను బయటకు వచ్చేశాను. వాళ్లు ఎలిమినేట్ చేస్తే నేను రాలేదు. వాళ్లు నన్ను పంపకపోతే నేను ఎంతకైనా తెగిస్తానని భయపడి నన్ను బయటకు పంపారంటూ చెప్పుకొచ్చింది సోనియా ఆకుల.
ఇలా బిగ్ బాస్ నిర్వాహకులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ను ఒకలా, నచ్చని వారిని మరోలా ప్రొజెక్ట్ చేయటంతో పాటు, ఎలిమినేషన్ టైమ్‌లో రేటింగ్‌ను కూడా మ్యానిప్లెట్ చేస్తున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తొంది. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్‌లో ఏమాత్రం పస లేదు.. నస తప్ప.