Prasanna Kumar: ‘బహిష్కరణ’లో.. అంజలి సన్నివేశాలు రహస్యంగా చిత్రీకరించాం
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:31 PM
కెమెరామాన్ ప్రసన్న కుమార్ తమిళం, తెలుగు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు తాజాగా ఆయన పని చేసిన రెండు వెబ్ సిరీస్‌లు ఇటీవల ఓటీటీలోకి వచ్చి ఆయనకు మరింత పేరును తీసుకు వచ్చాయి.
విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా వచ్చిన ‘పిచ్చైకారన్’ (Pichaikkaran) ద్వారా కెమెరామాన్‌గా కోలీవుడ్‌కు పరిచయమైన ప్రసన్న కుమార్ (Prasanna Kumar) ఇపుడు తమిళం, తెలుగు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ప్రతి సినిమాకు తనలోని ప్రతిభను మెరుగు పరుచుకుంటూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు.
నిరంతరం విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకు పనిచేస్తూ, తన కెమెరా పనితనాన్ని చూపిస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల జీ5లో విడుదలైన ‘బహిష్కరణ’ (Bahishkarana) అనే సిరీస్‌ను పీరియాడిక్ కలర్ టోన్‌లో అద్భుతంగా తమ కెమెరాలో బంధించారు. అదేవిధంగా రాధా మోహన్ - యోగిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్‌లో కుటుంబ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించారు.
ఈ విషయంపై ప్రసన్న మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథాంశాల్లో తెరకెక్కించే చిత్రాలకు పని చేయాలన్నది నా కల. నేను పనిచేసిన తొలి చిత్రం ‘పిచ్చైకారన్’ (Pichaikkaran) బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఇందులోని ప్రతి విజువల్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రశంసలు సంతోషంతో పాటు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు తోడ్పడ్డాయని అన్నారు. సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు.
తాజాగా నేను పని చేసిన దర్శకుడు శశి తెరకెక్కించిన ‘నూరు కోడి వానవిల్’(Nooru Kodi Vaanavi), ‘మద్రాస్‌కారన్’ (Madraskaaran) చిత్రాలు విభిన్న కథాంశాలతో రూపొందించినవి. వీటి ట్రైలర్స్ చాలా బాగున్నాయంటూ అభినందనలు వస్తున్నాయన్నారు.
నేను ఇప్పటివరకు పని చేసిన విజయ్ ఆంటోనీ, అంజలి, యోగిబాబు మంచి నటులే కాదు మంచి స్నేహితులు కూడా. ‘బహిష్కరణ’(Bahishkarana)లో పాత్ర కోసం హీరోయిన్ అంజలి (Anjali) చేసిన కొన్ని సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించాం’ అని వివరించారు.