Hero Darshan Wife: కర్ణాటక డిప్యూటీ సీఎంని కలిసిన దర్శన్ వైఫ్.. విషయం ఏమిటంటే?
ABN , Publish Date - Jul 24 , 2024 | 08:21 PM
దర్శన్ భార్య విజయలక్ష్మీ దర్శన్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలవడంతో.. మరోసారి దర్శన్ కేసుపై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. దర్శన్ సతీమణి విజయలక్ష్మీ, డీకే శివకుమార్ భేటీలో ఏ విషయం చర్చకు వచ్చిందని అంతా అనుకుంటున్న సమయంలో.. ఈ భేటీపై స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమారే వివరణ ఇచ్చారు.
అభిమాని హత్య కేసులో హీరో దర్శన్ (Hero Darshan) జైలుపాలైన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య దర్శన్ గురించి కొందరు నటీనటులు పాజిటివ్‌గా మాట్లాడుతుండటంతో.. ఏదో రకంగా దర్శన్ వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మీ దర్శన్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలవడంతో.. మరోసారి దర్శన్ కేసుపై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. దర్శన్ సతీమణి విజయలక్ష్మీ, డీకే శివకుమార్ (DK Shivakumar) భేటీలో ఏ విషయం చర్చకు వచ్చిందని అంతా అనుకుంటున్న సమయంలో.. ఈ భేటీపై స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమారే వివరణ ఇచ్చారు. (Darshan Wife Vijayalakshmi Meets DK Shivakumar)
ఆయన మాట్లాడుతూ.. ‘‘దర్శన్ భార్య విజయలక్ష్మీ (Darshan Wife Vijayalakshmi) తన భర్త విషయంపై మాట్లాడేందుకు నా దగ్గరకు రాలేదు. ఆమె తన కుమారుడి భవిష్యత్‌పై ఆందోళన చెందుతోంది. ఇప్పుడు కూడా తన కుమారుడి స్కూల్ అడ్మిషన్ నిమిత్తమే నన్ను కలవడానికి వచ్చింది. ఇంతకు ముందు ఆ పిల్లాడు మా స్కూల్‌లోనే చదివేవాడు. ఈ మధ్య వేరే స్కూల్‌కు మారినట్లుగా ఆమె చెప్పింది. మళ్లీ మా స్కూల్‌లో తన కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలని ఆమె ప్రాధేయపడింది. తప్పకుండా ఆమెకు ఈ విషయంలో సహాయం చేస్తానని, తన కుమారుడికి ఎటువంటి పరీక్షలు లేకుండా అడ్మిషన్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి.. కచ్చితంగా ఆమెకు సహాయం చేస్తాను’’ అని తెలిపారు.
దర్శన్ విషయానికి వస్తే.. దర్శన్, పవిత్రా గౌడ రిలేషన్‌ని ఉద్దేశించి దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి (Renuka Swamy) కొన్ని కామెంట్స్, పోస్ట్‌లు చేయగా.. వారిద్దరూ మరికొంతమందితో కలిసి అతనిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిద్దరితో పాటు ఈ హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ కేసు విషయంలో దర్శన్‌కు ఏమైనా సాయం చేయబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే సమాధానమిస్తూ.. పోలీసుల విచారణలో ఉన్న కేసుజోలికి పోయే ఉద్దేశ్యం నాకు లేదని ఆయన చెప్పుకొచ్చారు.