Morning Show: సెలబ్రిటీలు ఆవిష్కరించిన జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ బుక్

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:13 PM

సినిమా జర్నలిస్ట్‌గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. తాజాగా ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ సెలబ్రిటీలు ఆవిష్కరించారు.

Morning Show: సెలబ్రిటీలు ఆవిష్కరించిన జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ బుక్
Morning Show Book Launch

సినిమా అంటే చాలా మందికి ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్‌గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. యాభై యేళ్లుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి ఆలోచనాత్మక విశ్లేషణతో ఆయన రచించిన ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. తాజాగా ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ సెలబ్రిటీలు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. కుమారస్వామి ఎంతో కష్టపడి, నిబద్ధతతో ఈ పుస్తక ముద్రణ కోసం శ్రమించారు. అంతకంటే ఎక్కువగా తన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా కోసం కృషి చేశారు. త్వరలో విడుదల కాబోతోన్న ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక జిఆర్ మహర్షి గారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. వారు చిన్నతనం నుండి చూసిన సినిమాల సంగతులను తనకే సొంతమైన ఒక సెటైరికల్ వేలో రాశారు. ఈ పుస్తకం కేవలం సినిమా విశేషాలను గురించి మాత్రమే కాదు.. అనేక ఆలోచనలను కలిగించేలా ఉంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే.. ఇక ఆపలేం. అంత గొప్పగా మహర్షి గారు ఈ పుస్తక రచన చేశారు. ఇలాంటి పుస్తకాన్ని మనందరి ముందుకూ తెస్తున్న కుమార స్వామిని మరోసారి అభినందిస్తున్నానని అన్నారు.


‘మార్నింగ్ షో’ పుస్తక రచయిత జీఆర్ మహర్షి మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి విపరీతమైన సినిమా పిచ్చి ఉంది. వారం రోజులు ప్రయత్నిస్తే ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లు. ఆ రూపాయితో సినిమా చూడ్డంతో పాటు ఇంటర్వెల్‌లో కొనుక్కునేవాళ్లం. అలాగే చిన్నప్పుడు సినిమాల్లో ఎన్టీఆర్ విన్యాసాలు విపరీతంగా నవ్వు తెప్పించేవి. ఆ హీరోలు అలా ఎలా ఎగిరి గంతేస్తారు అని ఆశ్చర్యంతో చూసేవాడిని. విఠాలాచార్య సినిమాల్లోలాగా మంత్రాలు నేర్చుకుని మా హిందీ సార్‌ను రామ చిలుకను చేయాలని ప్రయత్నించేవాడిని. భాషతో సంబంధం లేకుండా కదిలే బొమ్మలైనా చూడటం నాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే యాభైయేళ్లుగా ఇంకా ఇంకా సినిమాలు చూస్తూనే ఉండాలనిపించేలా చేసింది. కాకపోతే ఒకప్పుడు సినిమా చూస్తే ఒక ఎమోషనల్ బాండ్ కనిపించేది. ఇప్పుడు అది మిస్ అయింది. నాకు ఏ ఊరైనా వెళితే.. ఆ ఊరిలో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడమే అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన పని. ఓ సారి సినిమా చూడ్డానికే 19యేళ్ల వయసులో మైసూర్ వెళ్లాను. నైట్ షో చూసిన తర్వాత ఆటోలు దొరక్క, అడ్రెస్ గుర్తు లేక ఇబ్బంది పడ్డాను. ఇలాంటి ఇబ్బందులు చాలానే పడ్డాను. కానీ ఏ రోజూ సినిమా చూడొద్దు అన్న భావన కలగలేదు. ‘షోలే’ సినిమాను ఇప్పటికి ఒక వెయ్యి సార్లు చూసి ఉంటాను. ఆ సినిమాలోని ప్రతి కదలిక నాకు కంఠతా వచ్చు. 1970ల నుంచి 1990ల తర్వాత వరకూ సినిమా రంగంలో వచ్చిన అనేక మార్పులను ఈ పుస్తకంలో రాశాను. కథల పరంగా, టెక్నికల్‌గా, నటీనటుల పరంగా ఇలా ఎన్నో మార్పులు చూసిన తెలుగు సినిమా పరిణామక్రమాన్ని రాశాను అని చెప్పలేను కానీ.. చాలా వరకూ రికార్డ్ చేశాను. ఇది కేవలం నాకు తెలిసిన అంశాలే కాక తెలుసుకుని రాసిన అంశాలు కూడా పొందుపరచబడిన పుస్తకం. వ్యంగ్యం అనేది నాకు తెలియకుండానే నాలో ఏర్పడ్డ లక్షణం. అక్కడక్కడా నవ్వించినా.. ఎన్నోసార్లు ఆలోచింపజేస్తుందీ పుస్తకం. ఏదో ఆశించి కాదు కానీ.. నా అనుభవాలు, సినిమాతో నాకు ఉన్న అనుబంధాన్ని తెలిపే ఈ పుస్తకం మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక చివరగా ఈ పుస్తకం కోసం కుమార స్వామి ఎంతో టైమ్ కేటాయించాడు. టైమ్‌కు రాదేమో అని నిన్నటి వరకూ చాలా టెన్షన్ పడ్డాను. బట్ నా టెన్షన్‌ను కూడా తనే తీసుకుని ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణం కుమార స్వామి. అతనికి కృతజ్ఞతలు చెబుతూ.. దర్శకుడిగా అతను రూపొందించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ప్రతినిధి కుమారస్వామి(అక్షర) మాట్లాడుతూ.. ‘‘సాహిత్యం, సాంస్కృతిం రెండూ గొప్ప ప్రయాణాలు. ఈ రెండు చోట్లా నేను ఉండటానికి కారణం సాహిత్యమే. జమిలి లక్ష్యానికి తగ్గట్టుగానే ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ మార్నింగ్ షో మీ అందరు చదివి ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర, దర్శకుడు కరుణ కుమార్, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, కవి సిద్ధార్థ్ వంటి వారు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

**************************

*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు

******************************

Updated Date - Feb 07 , 2024 | 09:13 PM