King Nagarjuna: వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:49 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించిన మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నాగార్జున ఏమన్నారంటే..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. అక్కినేని నాగార్జున తన ట్వీట్‌లో ఏం చెప్పారంటే..
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’ అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read- Konda Surekha: చైతూ-సమంత విడాకులు, రకుల్ హడావుడి పెళ్లి.. కారణం కేటీఆరే..
అసలేం జరిగిందంటే..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై బుధవారం కొండా సురేఖ మీడియా ముందు కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.
Also Read- Jani Master: మరో ట్విస్ట్.. జానీ మాస్టర్ భార్య ఏం చేశారంటే..
మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ఇవే.
‘‘కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఓ జంట విడాకులకు కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు’’ అని సురేఖ అన్నారు.