భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే పోసానిని అరెస్ట్ చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 09:02 PM
భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే వైఎస్‌ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళిని వెంటనే అరెస్ట్ చేయాలని టాలీవుడ్ నిర్మాత డిమాండ్ చేశారు. ఎవరా నిర్మాత? ఏంటా కథ? తెలుసుకోవాలంటే..
భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే వైఎస్‌ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళిని వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు. పోసాని నేటికీ వితండవాదంగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా నట్టి కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ తన ప్రకటనలో..
Also Read-Devaki Nandana Vasudeva: మంచి, చెడుల మధ్య యుద్ధం.. ట్రైలర్ ఎలా ఉందంటే..
‘‘పోసాని మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా చేసుకుని బూతులు తిట్టే విష సంస్కృతికి నాంది పలికిన ఆ పార్టీ కార్యకర్తలు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలుసు. పలుమార్లు ముఖ్యమంతి పీఠాన్ని అధిష్టించిన విజన్ కలిగిన నాయకులు, పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు అంతటి వారితో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులనే కాకుండా.. వారి ఫ్యామిలీలకు చెందిన మహిళల పైన కూడా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టించి, పైశాచిక ఆనందం పొందింది వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కాదా! ఇవన్నీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, పోసాని వంటి వారికి తెలియదా! వీటిని వాళ్ళు ప్రోత్సహించ లేదా! ఒక్కసారి వారంతా మననం చేసుకోవాలి. ఇప్పటికీ ఆ సంస్కృతి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బయటపడకుండా అవాకులు, చవాకులు పేలుతుండటం వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
మనం ఎలాంటి భాషను వాడుతున్నాము, అలాగే మన కార్యకర్తల చేత ఏమి మాట్లాడిస్తున్నామో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలి. పాలసీ పరంగా, సబ్జెక్టు పరంగా వాస్తవాలను ఎవరైనా మాట్లాడవచ్చు, దానికి ఏ పార్టీ అయినా ముందుకు రావచ్చు. కానీ కావాలని లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా.. తిట్టడమే లక్ష్యంగా చేసుకుని చౌకబారు మాటలను ఉపయోగించడం ఎంతవరకు సంస్కారమో సదరు నేతలు ఆలోచించుకోవాలి. ప్రజలు వారిని ఘోరంగా ఓడించినా వారి బుద్ధి మాత్రం ఇంకా మారడం లేదు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి, ఆ విధంగా లాభపడాలని అనుకుంటున్న వారికి ప్రజలు ఇంకా తగినరీతిలో బుద్ధి చెబుతారు. గతంలోనే కాదు నేటికీ భావ స్వేచ్ఛ అంటూ బూతులు తిడుతున్న పోసానిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని నట్టి కుమార్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.