మల్టీఫ్లెక్స్ తరహా పర్సంటెజీలు ఇవ్వాలి.. లేకుంటే థియేటర్లు మూతే
ABN , Publish Date - May 22 , 2024 | 09:55 PM
తెలంగాణ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని యాజమాన్యాలు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్టితులపై ఇటీవలే థియేటర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు సమావేశాలు నిర్శహించారు.
తెలంగాణ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని యాజమాన్యాలు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు చూస్తున్నామని, పెత్త సినిమాలు కూడా రావట్లేదని.. ఇలా పలు కారణాలతో పది రోజులు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించి అమలు చేస్తున్నారు కూడా. ఈక్రమంలో ప్రస్తుతం తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడ్డాయి. ముందుగా చెప్పిన ప్రకారం మే 25న తిరిగి విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించాయి కూడా.
అయితే తాజాగా పరిస్టితులపై ఇటీవలే థియేటర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telangana Film Chamber Of Commerce) సమావేశం నిర్శహించారు. సమావేశంలో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పాల్గొనగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకనుంచి అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాలు పర్సెంటేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా వారం తేడా ఉండేలా, ఒక్కో సినిమాకు దాని బడ్జెట్ బట్టి పర్సెంటేజ్ ఉండాలని నిర్ణయించారు.
అధేవిధంగా తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు (Film Exhibitors) సమావేశం ఏర్పాటు చేసుకోని మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాతలు ఎగ్జిబిటర్లకు అనుకున్న పర్సంటేజీలు ఇవ్వాలని, అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించమని, మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటెజీలు చెల్లిస్తే సినిమాల ప్రదర్శన చేస్తామని తెలిపారు. దీనిపై నిర్మాతలు జులై 1 లోపు ఏ విషయం చెప్పాలని గడువు విధించారు. అయితే వీటిల్లో కల్కి, పుష్ప2, గేమ్ చేంజర్, భారతీయుడు వంటి భారీ సినిమాలకు మినహాయింపు ఇచ్చారు.
అలాగే.. నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే భవిష్యత్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదని, గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దేశవ్యాప్తంగా మూతపడ్డాయని, కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు అంటూ బెనిఫిట్ షోలు, అదనపు షోలతో మోసాలకు పాల్పడుతున్నారు, ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్రదర్శించం అని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ థియేటర్స్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.