Prakash Raj: పవన్‌ను ఈసారి సూటిగానే ప్రశ్నించిన ప్రకాష్ రాజ్..
ABN , Publish Date - Sep 27 , 2024 | 05:15 PM
ఓ వైపు పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై సెటైర్లు విసురుతున్నా.. ఆయన ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో వరుస పోస్ట్‌లతో విరుచుకుపడుతున్నారు. మొన్న వినమ్రంగా, నిన్న సమన్వయంగా డిప్యూటీ సీఎంని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. నేడు ఏకంగా రాజకీయ నైతికతనే ప్రశ్నించారు. ఆయన ఏమన్నారంటే..
తిరుపతి లడ్డూ వివాదం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)కి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు మధ్య మరింత మాటల వేడి రాజేస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో పవన్‌పై రెచ్చిపోయి మరి విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా నేడు మరో ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ రాజకీయ నైతికతను ప్రశ్నించారు. దీంతో మరోసారి సినీ రాజకీయ అభిమాన వర్గాలలో ఈ ఇష్యూ మరింత ఆసక్తికరంగా మారింది. ఓ వైపు పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై సెటైర్లు విసురుతున్నా ఆయన ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో వరుస పోస్ట్‌లతో ట్విట్టర్‌లో అటాక్ చేస్తున్నారు.
Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ
మొన్న వినమ్రంగా, నిన్న సమన్వయంగా డిప్యూటీ సీఎంని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. నేడు ఏకంగా ఆయన రాజకీయ నైతికతనే ప్రశ్నించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూనే ‘‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా?’’ అంటూ తెలుగు ట్వీట్లతో పరోక్షంగా పవన్‌ని టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. ఆయన చేసిన ఈ ట్వీట్‌లో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కురిపిస్తున్నారు.
తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, ప్రకాష్ రాజ్‌కు మధ్య నాలుగు రోజుల క్రితం నుండి మొదలైన ట్వీట్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ పోస్టులపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ముఖంగా హెచ్చరించడంతో ఈ ట్వీట్ల అటాక్ మొదలైంది. ‘నేను విదేశాల్లో ఉన్నా.. ఇండియా వచ్చిన తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం చెబుతా’ అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. అంతటితో ఈ వ్యవహారం ముగిసిందని అంతా భావించారు. కానీ ప్రకాశ్‌రాజ్ ఊరుకోలేదు. తమిళ హీరో కార్తీ లడ్డూ వ్యవహారంపై క్షమాపణ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ‘చేయని తప్పుకి క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో.. జస్ట్ ఆస్కింగ్’ అంటూనే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అయితే ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆయన మౌనంగా ఉన్నా ఊరుకోకుండా గురువారం మరో ట్వీట్ వదిలారు ప్రకాశ్‌రాజ్. ‘గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక మరో అవతారం.. ఏమిటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు.