సంగీత దర్శకుడు చక్రవర్తికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం తిరిగి స్వాధీనం
ABN , Publish Date - Nov 08 , 2024 | 09:28 PM
ప్రదేశం ఏదైనా సరే.. కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జా చేయడానికి గ్యాంగ్ రెడీగా ఉన్న రోజులివి. అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ఖాళీగా స్థలం కనబడితే వదులుతారా? అదే చేసింది కబ్జా గ్యాంగ్. తెలుగు సినీ సంగీత దర్శకుడు చక్రవర్తికి మ్యూజిక్ స్టూడియో నిమిత్తం ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా కోరల నుండి లాక్కొని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
కాస్త జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేయడానికి గ్యాంగ్ రెడీగా ఉన్న రోజులివి. అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ఖాళీగా స్థలం ఉంటే ఊరుకుంటారా? కబ్జా చేసేస్తారు కదా. అదే చేశారు. తెలుగు సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి (Music Director Chakraborty)కి మ్యూజిక్ స్టూడియో నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేసినట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో.. వెంటనే రెవిన్యూ అధికారులు రంగంలోకి దిగి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Also Read-కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడిన స్టార్ యాక్టర్
తెలుగు సినీ సంగీత దర్శకుడు చక్రవర్తికి మ్యూజిక్ స్టూడియో నిర్మాణం నిమిత్తం.. అప్పట్లో లెజెండ్ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బంజారాహిల్స్, రోడ్ నంబర్ 14లో 20 గుంటల స్థలాన్ని ఈ దిగ్గజ సంగీత దర్శకుడికి కేటాయించారు. ఆయన సంబంధిత పట్టా తీసుకున్నారే కానీ ఆ స్థలం గురించి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు సైతం ఆ స్థలాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
సంగీత దర్శకుడు చక్రవర్తిగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఈ స్థలాన్ని పట్టించుకోకపోతే కబ్జా గ్యాంగ్ ఊరుకుంటుందా? ఖాళీగా స్థలం కనబడగానే కబ్జా చేసి గుడిసెలు వేయడం కొన్నాళ్ళకు డీల్ చేసి అమ్ముకోవడం అనేది ప్రస్తుత ట్రెండ్ అనే విషయం తెలియంది కాదు. హైదరాబాద్ నడిబొడ్డున గత 40 ఏళ్లుగా చక్రవర్తి లేదా వారి కుటుంబ సభ్యులు వినియోగించని ఈ స్థలాన్ని కబ్జాదారులు వాడుకుంటున్నారని అధికారులకు తెలిసింది. ఆ మరుక్షణమే యాక్షన్ మొదలైంది. శుక్రవారం షేక్ పేట్ రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం విలువ దాదాపు రూ. 75 కోట్ల పైనే ఉంటుందని అంచనా.