Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ
ABN , Publish Date - Oct 08 , 2024 | 05:11 PM
కుమార్తెను కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ను తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
కుమార్తెను కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ను తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పరామర్శించారు. కూకట్ పల్లి హిందూ విల్లాస్లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రాజేంద్రప్రసాద్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజేంద్రప్రసాద్‌ని తలసాని పరామర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
Also Read- Actress: శృంగార తార ఇంట్లో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్
ఆ వీడియోలో రమాప్రభతో పాటు మరికొందమంది నటీమణులు రాజేంద్రప్రసాద్‌ను ఓదార్చుతున్నారు. వారిని చూసి ఒక్కసారిగా రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా జరుగుతుందని, తన కుమార్తె తనని వదిలి వెళ్లిపోతుందని అస్సలు ఊహించలేదంటూ రాజేంద్ర ప్రసాద్ బాధపడుతుంటే.. అతనని చూసిన ఆ నటీమణులు కూడా ఏడ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదంటూ.. రాజేంద్రప్రసాద్ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి (Gayathri) కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్రప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులెందరో రాజేంద్రప్రసాద్ మరియు ఆయన కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.