Tamannaah Bhatia: ఈడీ ఎదుట హాజరైన మిల్కీ బ్యూటీ.. విషయం ఏంటంటే
ABN , Publish Date - Oct 17 , 2024 | 10:14 PM
తమన్నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకు కష్టాలు మొదలయ్యాయి. అవును స్పెషల్ సాంగ్స్‌తో ఇటీవల ఫోకస్ అయిన ఈ నటి పేరు ఇప్పుడు ఓ కేసులో వైరల్ అవుతోంది. ఏంటా కేసు? ఎందుకు ఈడీ విచారణ జరిపిందో తెలుసా?..
మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) కష్టాలు మొదలయ్యాయి. అవును స్పెషల్ సాంగ్స్‌తో ఇటీవల ఫోకస్ అయిన ఈ నటి పేరు ఇప్పుడు ఓ బెట్టింగ్ యాప్ కేసులో తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమన్నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్ సపోర్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా వీక్షించడాన్ని ప్రోత్సహించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చారు. ఈ నటి ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను చూడడాన్ని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. అంతేకాదు ఇటీవల ‘స్త్రీ 2’ చిత్రంతో తమన్నా వార్తల్లో నిలిచింది. అందులో ఆమె ‘ఆజ్ కీ రాత్’ పాటతో ఫుల్ ఫేమస్ అయ్యింది.
Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..
ఈ సందర్భంలో తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించడం లేదు. కానీ HPZ Token యాప్‌కు ప్రచారం చేసినందుకు విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా కోట్లాది మంది డబ్బులు పెట్టి మోసపోయారు. మోసం చేసేందుకు డొల్ల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేశారు. నిందితులు ఈ డబ్బును క్రిప్టో, బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.
ఇదివరకు కూడా తమన్నా భాటియా ఈ ఆరోపణలపై ఓసారి హాజరైంది. అది కూడా బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన అంశం. మహదేవ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్‌ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై నటిని మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రూ. 15 వేల కోట్ల కుంభకోణంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ యాప్ క్రికెట్ టోర్నమెంట్ అధికారిక ప్రసార సంస్థ వయాకామ్ 18 అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని సదరు సంస్థ అప్పట్లో సీరియస్ అవుతూ కేసు ఫైల్ చేసింది.