ఏఎన్నార్ ఫస్ట్ ఫిల్మ్ ‘శ్రీ సీతారామ జననం’కి 80 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా
ABN , Publish Date - Dec 01 , 2024 | 02:08 PM
వెంకట రాఘవాపురం అంటే అప్పట్లో గుడివాడ దగ్గర అనీ, కృష్ణా జిల్లా అని చెబితే కానీ తెలియని ఓ మారుమూల గ్రామం. అలాంటి మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు.. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుని ప్రముఖ వ్యక్తిగా మారాడు. ఆ వ్యక్తే అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నటించిన తొలి చిత్రం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ చిత్ర విశేషాలలోకి వెళితే..
లెజెండ్ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి చిత్రం ‘శ్రీ సీతారామ జననం’ చిత్రం 80 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 1944 డిసెంబర్ 1వ తేదీన విడుదలన ఈ చిత్రం నేటితో (2024 డిసెంబర్ 1) 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని విశేషాలలోకి వెళితే.. వెంకట రాఘవాపురం అనే గ్రామంలో పుట్టిన ఓ కుర్రాడు తెలుగు వారి ఆరాధ్య నటుడై, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రముఖులలో ఒకరయ్యాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు.. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. వెంకట రాఘవాపురం అంటే అప్పట్లో గుడివాడ దగ్గర అనీ, కృష్ణా జిల్లా అని చెబితే కానీ తెలియని ఓ మారుమూల గ్రామం. అలాంటి మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు.. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుని ప్రముఖ వ్యక్తిగా మారాడు. ఒకవ్యక్తి తలుచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా వెళ్లవచ్చని నిరూపించారు ద లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఒక పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని.. సినీ కళామతల్లికి ముద్దు బిడ్డగా ఎదగడం వెనుక ఎంతో స్ఫూర్తి దాయకమైన చరిత్ర ఉంది. ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ తనని తాను మలచుకున్న పట్టుదల ఉంది.
అక్కినేని బాల నటుడిగా నటించిన, నటుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘ధర్మపత్ని’. ఆ చిత్రంలో బాల నటుడిగా కనిపించినా అక్కినేని చలనచిత్ర జీవితం ప్రారంభమైంది, కొనసాగింది మాత్రం ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంతోనే అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేనికి ఎలా అవకాశం వచ్చిందంటే.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో యథాలాపంగా చూసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య.. అక్కినేని భవిష్యత్‌ను ముందుగానే ఊహించారో ఏమో తెలియదు కానీ.. తను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. విశేషం ఏమిటంటే.. తొలి చిత్రంలోనే శ్రీరాముని పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అక్కినేని చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
మరో విశేషం ఏమిటంటే.. అప్పటివరకు హీరోలుగా నటించిన వారి వయసు 30కి పైనే. కానీ చాలా చిన్న వయసులోనే కథానాయకుడిగా అవకాశం పొందిన తొలి నటుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావే. ఇందులో సీతగా నటించిన త్రిపుర సుందరి అక్కినేని తొలి కథానాయికగా సినిమా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమాలో రావణుడిగా, పరశురాముడిగా వేమూరి గగ్గయ్య, లక్ష్మణుడిగా బిఎన్ రాజు, విశ్వామిత్రుడిగా బలిజే పల్లి లక్ష్మి కాంతం, కైకగా కమలా కొట్నిస్ నటించారు. వీరందరూ వయసులోనూ, అనుభవంలోనూ అక్కినేని కంటే పెద్ద వారే. అలాంటి అనుభవజ్ఞులు పక్కన ఉన్నా కూడా.. ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అక్కినేని.
Also Read-Pushpa 2 The Rule: ‘పుష్ప 2’.. ‘దేవర’లా కాదు కదా..
మరో విషయం ఏమిటంటే కోరస్ సింగర్‌గా ఘంటసాలకి కూడా ఇదే మొదటి సినిమా కావడం. 1944 నవంబర్ 16న ‘శ్రీ సీతారామ జననం’ చిత్రం విడుదల అంటూ పత్రికా ప్రకటన వచ్చింది. కానీ సినిమా సిద్ధం కాకపోవడంతో డిసెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేశారు. ఇందులో ఏఎన్నార్ ఎలా నటించాడా? అని ఆయనని ఎరిగిన వారు కొంత ఆసక్తిగా, మరికొంత అపనమ్మకంగా ఎదురు చూశారు. ఎందుకంటే అప్పటి వరకూ ఆయన రంగస్థలం మీద ఆడ వేషాలు మాత్రమే వేసేవారు. అలాంటిది ఒక్కసారిగా శ్రీరాముడి పాత్ర చేశాడని తెలియడంతో.. ‘ఏం చేస్తాడు లే’ అని అనుకున్నవారే ఎక్కువ. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ అక్కినేని నటించారు. ఒక చరిత్రను సృష్టించారు. దటీజ్ అక్కినేని నాగేశ్వరరావు.
-వినాయకరావు