Akkineni: మొట్ట మొదట ఏఎన్నార్ ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడారో తెలుసా...
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:33 PM
అక్కినేని నాగేశ్వర రావు పాఠశాలకు వెళ్ళలేదు, పెద్దగా చదువుకోలేదు కూడా. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాక అతను చాలా నేర్చుకున్నారు, అందులో ఏఎన్నార్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. చదువులేని నాగేశ్వర రావు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఎక్కడ మొట్టమొదటి సారిగా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చారు. చదవండి..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటి తరం కథానాయకులలో అక్కినేని నాగేశ్వరావు ఒకరు. 1940వ దశకం నుండి సుమారు ఏడు దశాబ్దాల పాటు అంటే 2014లో వచ్చిన 'మనం' సినిమా వరకు నాగేశ్వర రావు గారు నటిస్తూనే వున్నారు. అంటే ఎంతో చిన్న వయసులో చిత్ర సీమలోకి ప్రవేశించి తాను జీవించి ఉన్నంత కాలం సినిమాలలో నటించారు అని చెప్పాలి. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన నటుల్లో నాగేశ్వర రావు ముందుంటారు.
నాగేశ్వర రావు జీవితంలో ఎప్పుడూ పాఠశాలకు పోలేదు, చదువుకోలేదు. తల్లికి, అలాగే ఇతరులకు సహాయంగా ఉంటూ, నాటకాలు వేసుకుంటూ వుండే నాగేశ్వర రావు సినిమాలోకి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మూలస్థంభం అయ్యారు. ఈనాటికీ నాగేశ్వర రావు పేరు చిరస్మరణీయం, అజరామరం. పాఠశాలకి వెళ్లకుండా, చదువులేకపోయినా, నాగేశ్వర రావు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఎక్కడ నేర్చుకున్నారు, అతను మొట్టమొదటి సారి ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడారు అనేది తెలుసుకుందాం.
అప్పట్లో చిత్ర పరిశ్రమలో అగ్రనటీనటులకి విదేశాలకి రమ్మని ఆహ్వానాలు వచ్చేవి. రెండు దేశాలు సాంస్కృతికంగా ఎలా వున్నాయి, వారి సంస్కృతి, సంప్రదాయం, మన సంస్కృతి, సంప్రదాయం ఒకరికొకరు తెలుసుకోవడానికి వెళుతూ ఉండేవారు. ఎక్కువగా నటీనటులు కి ఆహ్వానాలు వచ్చేవి. "1964లో నాకు అమెరికా ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేను, శివాజీ గణేశన్ మంచి మిత్రులం, ఒరేయ్, ఒరేయ్ అని పిలుచుకుంటూ ఉంటాం. అంత దగ్గర మిత్రులం మేము. వాడిని అడిగాను ఎలా నువ్వు అమెరికాలో మేనేజ్ చేసావురా అని, వాడు అమెరికన్ కాన్సులేట్ లో కుక్స్ అనే అతన్ని తీసుకెళ్లాడు. అతను తమిళం నేర్చుకున్నాడు, అందుకని శివాజీ గణేశన్ తమిళంలో చెపితే అతను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసేవాడు. అయితే అది ఎందుకో నాకు అంతగా నచ్చలేదు," అని చెప్పారు నాగేశ్వర రావు గారు.
అమెరికాలో అప్పట్లో కొన్ని వారాలపాటు పర్యటనలు చేసేవారు. "మేము ప్రభుత్వ అతిధులం కాబట్టి మాతో ఒక మనిషి అక్కడ సుందరమైన ప్రదేశాలు చూపించడానికి, ఇంకొక మనిషి భాషను తర్జుమా చెయ్యడానికి, ఇలా చాలామంది మాతోపాటు పర్యటించేవారు. నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మధుసూధనరావు గారు వాళ్ళు చాలా కంగారు పడ్డారు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, ఎలా వీడికి అక్కడ ఏమి చేస్తాడో అని. కానీ నేను అవేమీ ఆలోచించలేదు. కొన్ని ప్రదేశాలు చూపించాక సెయింట్ లూయిస్ వెళ్ళాము, అక్కడ ఒక అమెరికన్ కుటుంబంతో మాకు లంచ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి తెలియాలని. నేను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషని కూడా దగ్గరుండి గమనించేవాడిని. ఆ తరువాత మేము మిచిగాన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాం," అని చెప్పారు నాగేశ్వర రావు.
థియేటర్, టీవీ, నాటకాలు ఇలా వాటి గురించి అక్కడి విశ్వవిద్యాలయంలో మాట్లాడాలి. అందుకని నాగేశ్వర రావు కూడా ఆ విశ్వవిద్యాలయానికి ఆహ్వానం మేరకి వెళ్లారు. అక్కడ వాళ్ళు నాగేశ్వర రావును మాట్లాడమన్నారు. "మాకు ఒక ఇంటర్ ప్రిటర్ (భాషనీ తర్జుమా చేసే వ్యక్తి) వున్నారు, కానీ నాకెందుకే ఇంగ్లీష్ లోనే చెప్పాలని వుంది. అందుకని ముందుగానే అక్కడి వాళ్ళకి నాకు ఇంగ్లీష్ రాదు, చాలా డ్రమెటికల్ తప్పులు ఉంటాయి, కానీ నా భావాన్ని, ఆలోచనలని అర్థం చేసుకోండి అని చెప్పేశా. ముందే చెప్పేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో. నేను అంతకు ముందు పర్యటనలో గమనించినవి, కొంత అర్థం చేసుకున్నది అన్నీ మననం చేసుకొని అక్కడ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో నాకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడాను. నేను మాట్లాడాక అందరూ చప్పట్లు కొట్టి, బాగా మాట్లాడావ్ అని చెప్పారు. అది నా మొదటి ఇంగ్లీష్ స్పీచ్," అని చెప్పుకొచ్చారు నాగేశ్వర రావు.
ఆ అమెరికా పర్యటన ముగించేసరికి నాగేశ్వర రావు కి పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేసింది. "నేను ఆ పర్యటన ముగించేలోపు ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను. ఆ పర్యటన వలన నేను ఎంతో నేర్చుకున్నాను కూడా," అని చెప్పారు నాగేశ్వర రావు. ఒక్క అమెరికానే కాదు, అనేక దేశాలు పర్యటించారు నాగేశ్వర రావు ఆ ప్రభుత్వాల ఆహ్వానం మేరకు. అప్పట్లో ఇలా Cultural Exchange పేరిట నటీనటులు వెళ్లడం, వేరే దేశాల నటులు భారత దేశం రావటం జరుగుతూ ఉండేది.
-- సురేష్ కవిరాయని