Super Star Krishna: రామ్మోహన్ కి మంచి ప్రచారం వచ్చింది, కానీ కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు

ABN , Publish Date - May 04 , 2024 | 05:23 PM

'తేనె మనసులు' చిత్రం ద్వారా కృష్ణ, రామ్మోహన్ ఇద్దరూ కథానాయకులుగా పరిచయం అయ్యారు. సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రామ్మోహన్ బాగా చేస్తున్నారని అప్పట్లో బాగా ప్రచారం వచ్చింది. కానీ సినిమా విడుదలైన తరువాత, కృష్ణ వరసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ స్టార్ అయ్యారు, రామ్మోహన్ మాత్రం వెనుకబడ్డారు.

Super Star Krishna: రామ్మోహన్ కి మంచి ప్రచారం వచ్చింది, కానీ కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు
Rare photo of Krishna and Ram Mohan

సూపర్ స్టార్ కృష్ణ 'తేనె మనసులు' సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు. కృష్ణ, రామ్ మోహన్ ఇద్దరూ ఆ సినిమాలో కథానాయకులు. ఆ సినిమాలో అందరూ కొత్తవారే కావటం ఆసక్తికరం. కొత్తవారిని తీసుకోవటం కూడా ఒక వార్తా ప్రకటన ఇచ్చి అందులో వచ్చిన ఫోటోల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకున్నారు ఆదుర్తి సుబ్బారావు. అతనికి సహాయ దర్శకుడిగా పనిచేసిన కె విశ్వనాధ్ కృష్ణకి మేకప్ వేయించి ఫోటో తీయించిన సంగతి ఎంతమందికి తెలుసు. (Rare photo of Super Star Krishna and Ram Mohan from their debut film Tene Manasulu)

అప్పట్లో 'మూగ మనసులు' సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది. కృష్ణ తెనాలిలో ఉంటూ ఆ సినిమా చూసి, చాలాబాగుంది, పనిచేస్తే అటువంటి దర్శకుడితో పని చెయ్యాలని అనుకున్నారు. అదే సమయంలో బాబూ మూవీస్ వారు వార్తా పత్రికలో ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు, 'తేనెమనసులు' సినిమాని కొత్తవాళ్లతో తీయాలని అనుకుంటున్నామని, అందుకు ఫోటోలని పంపాలని, ఎవరినీ ప్రత్యక్షంగా రావద్దని ఆ ప్రకటన సారాంశం. చాలామందితో పాటు కృష్ణ కూడా తన ఫోటోలు పంపారు, సెలక్టు అయ్యారు.

krishnaRamMohan.jpg

అలా సెలెక్టు అయినా వారిలో కృష్ణతో పాటు రామ్మోహన్ కూడా వున్నారు. సినిమా మొదలు పెట్టకముందు 'తేనె మనసులు' సినిమాకోసం సెలెక్టు అయిన నటీనటులందరిచేతా రిహార్సల్స్ చేయించేవారు. కృష్ణకి, రామ్మోహన్ కి డాన్సులు కూడా నేర్పించారు. అలా ఆ సినిమా చిత్రీకరణకు వెళ్లేముందు అందరిచేత బాగా తర్ఫీదు ఇచ్చి మరీ ప్రారంభించారు. సినిమా చిత్రీకరణ ముందుగా నలుపు, తెలుపులో తీశారు, కానీ ఆదుర్తి సుబ్బారావు తరువాత అలోచించి కొత్తవాళ్లతో తీస్తున్నాం కాబట్టి, ఖర్చు ఎక్కువ అవదు అని మొదటి తీసిన నాలుగు రీళ్లు పక్కన పడేసి, మళ్ళీ మొదటినుండి చిత్రీకరణ రంగులలో తీశారు. (Tene Manasulu is the debut film of Super Star Krishna and it was directed by Adurti Subba Rao. Ram Mohan played another lead actor in that film)

చిత్రీకరణ ప్రారంభం అయిన తరువాత కృష్ణ కన్నా, రామ్మోహన్ బాగా చేస్తున్నారని ప్రచారం జరిగింది అప్పట్లో. కానీ సెట్ లో అవేమీ పట్టించుకోకుండా అందరూ కలిసిమెలిసి, సంతోషంగా వుండే వారు. సినిమా పూర్తయిన తరువాత చాల అంచనాల మధ్య 1965, మార్చి 31న విడుదలైంది. సినిమా మొదటి రోజునుండి మంచి టాక్ రావటంతో ఇది వందరోజులు ఆడుతుందని చెప్పేసారు. అలాగే సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. కృష్ణతో పాటు రామ్మోహన్‌కు కూడా మంచి పేరొచ్చింది.

tenemanasulu.jpg

కానీ ఎందుకో తరువాత రామ్మోహన్ అంతగా నిలదొక్కుకోలేకపోయారు. కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు. కానీ తనతో మొదటి సినిమా చేసిన రామ్మోహన్ ని కృష్ణ ఎప్పుడూ గుర్తుపెట్టుకొని, తాను చేసిన చాలా సినిమాలలో రామ్మోహన్ కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చి అతను నిలదొక్కుకోవడానికి, అలాగే అది అతనికి ఆర్థికంగా సాయపడటానికి ఎంతో సహాయం చేశారు కృష్ణ. వాళ్లిద్దరూ మొదటి సినిమాలో ఎంత స్నేహంగా ఉండేవారో, అలాగే ఎన్నో సంవత్సరాలు వారి స్నేహం కూడా కొనసాగింది.

Updated Date - May 04 , 2024 | 05:29 PM