Super Star Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కృష్ణ ఒక సంచలనం

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:35 PM

తెలుగు చలన చిత్రంలో కృష్ణ ఓ సంచలనం, సాహసానికి మరోపేరు. సుమారు 350కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించడమే కాకుండా సాంఘీక, జానపద, కౌబాయ్, గూఢచారి, చారిత్రాత్మక, పౌరాణిక ఒకటేమిటి అన్ని రకాల పాత్రలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించి, వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణని అభిమానులు ఎన్నటికీ గుర్తుంచుకుంటూనే వుంటారు

Super Star Krishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కృష్ణ ఒక సంచలనం
The Daring and Dashing Krishna

సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమకి 1965లో ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో సినిమా నిర్మిద్దామని చెప్పి ప్రకటన ఇస్తే, ఆ ప్రకటన చూసి తన ఫోటో పంపిన కృష్ణ ఆ సినిమాలో కథానాయకుడిగా సెలెక్ట్ అవటం, తరువాత ఆ సినిమా అఖండ విజయం సాధించింది. అంతే కృష్ణ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

krishnararephoto.jpg

కృష్ణ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, కాంతారావు, హరనాథ్ వంటి దిగ్గజ నటులు వున్నారు. ఆ తరువాత శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులు కూడా కథానాయకులుగా పోటీలో వున్నారు. ఎన్టీఆర్ అంటే పౌరాణికాలూ, సాంఘికాలూ, జానపదాలూ ఒకటేమిటి అన్ని జానర్స్‌లోనూ ఆయనకి ఆయనే సాటి. ఏఎన్నార్ అయితే ప్రేమ సినిమాలు, సాంఘీక సినిమాలు, పౌరాణికాలు ఇలా ఆయన కూడా తనదైన మార్కు వేసుకున్నారు. కృష్ణంరాజు అంటే రెబల్ స్టార్, కళ్ళతో భావాలు పలికించగల మేటి నటుడు.. శోభన్ బాబు అందగాడు, అతని సినిమాలో పాటలు, ఇద్దరు కథానాయికలు అతని ఇంకో రకమైన నటుడిగా ఇలా అందరూ స్థిరపడ్డారు.

krishnararephotoa.jpg

అలాంటి దశలో కృష్ణ పరిశ్రమలోకి రావటం, నటులుగా అందరూ మిత్రులైనా, వృత్తిపరంగా పోటీ ఉంటుంది, ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే తనదైన శైలి చూపించాలి. అదే కృష్ణ చేశారు, అందుకే అంతమంది మహానటుల మధ్య తనదైన ఒక ఇమేజ్‌ని సృష్టించుకొని చరిత్ర సృష్టించారు. ‘గూఢచారి 116’ సినిమా చేసి, తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బాండ్ సినిమాగా చరిత్ర సృష్టించారు. అంతవరకు ఎవరూ అది టచ్ చెయ్యలేదు, కృష్ణ అది చేశారు. అప్పటి నుండి ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటే కృష్ణ అనే అప్పట్లో అనేవారు. ఎన్నో సినిమాల్లో కృష్ణ రహస్య గూఢచారిగా, సిఐడిగా, పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. (Super Star Krishna known for his daring and dashing nature is one of the rare actors in Telugu Cinema History)

krishnararephotopolitical.jpg

తెలుగులో తొలి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం నిర్మించి డేరింగ్, డాషింగ్ అనిపించుకున్న నటుడు కృష్ణ. ఈ జానర్ అప్పటికి ఎవరూ ప్రయత్నం చేయకపోవటం ఆసక్తికరం. కృష్ణ అది ఎంచుకొని తన వైవిధ్యం అక్కడ చూపించారు. ఈ సినిమా షూటింగ్ కూడా రాజస్థాన్, థార్ ఎడారి ప్రాంతాల్లో జరిగింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఇది అప్పట్లో ఒక సంచలనం. చరిత్ర సృష్టించిన సినిమా.

krishnararephotob.jpg

‘పండంటి కాపురం’ వంటి కుటుంబ కథా చిత్రం తీసి శెభాష్ అనిపించుకున్నారు కృష్ణ. నలుగురు అన్నదమ్ములు కలిసి వున్న కుటుంబంలో కలతలు, కలహాలు, చివరికి ఆ కుటుంబం మళ్ళీ ఎలా ఒక్కటైంది అన్న కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మరో సంచలనం. కృష్ణ తాను ఏ పాత్ర వేసిన ఆ పాత్రకి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాను అని చెబుతూ ఉండేవారు. అందుకే కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేరము శిక్ష’ సినిమాలో కృష్ణ పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్రలో కృష్ణ తన నట విశ్వరూపం చూపించారు అనే కన్నా, ఆ పాత్రలో ఎంతో సహజంగా నటించి తన పాత్రకి జీవం పోశారు. (Krishna is sensational in Telugu Cinema History)

krishnararephotoe.jpg

తరువాత చారిత్రాత్మక సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. ఇది తెలుగు సినిమా పరిశ్రమలోనే ఒక అద్భుతం అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలుగు పరిశ్రమ మిగతా సినిమాల చిత్రీకరణలు ఆగిపోయేట్టు వున్నాయి అని చెప్పుకునే వారు. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం పరిశ్రమలో వుండే ముఖ్యమైన నటులు అందరూ వున్నారు. జగ్గయ్య, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, కాంతా రావు, చంద్రమోహన్, శ్రీధర్, మిక్కిలినేని, కెవి చలం, అల్లు రామలింగయ్య, విజయ నిర్మల, మంజుల, జయంతి, పండరీ భాయ్, రాజశ్రీ ఇలా ఎంతోమంది నటీనటులు ఈ సినిమా చిత్రీకరణ కోసం చింతపల్లి అడవులకి వచ్చేశారు. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అంతా చింతపల్లిలో వుంది అనేవారు అప్పట్లో. అది కృష్ణ అంటే, అది సాహసం, అది డేరింగ్. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలై ఒక సంచలనం సృష్టించింది. మళ్ళీ అలాంటి సినిమా తెలుగులో రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాతో తెలుగుకి సినిమా స్కోప్ అనే ఒక కొత్త సాంకేతికని పరిచయం చేసింది కూడా కృష్ణే.

krishnararephotof.jpg

నటుడిగా తనదైన శైలిలో విభిన్న సినిమాలతో దూసుకుపోతున్న కృష్ణ దర్శకుడిగా మారి ‘సింహాసనం’ అనే సినిమా తీశారు, 70MM అనే ఇంకో కొత్త సాంకేతికని పరిచయం చేశారు. ఇది ఒక ఫాంటసీ, జానపద, చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా కోసమని వేసిన సెట్స్ అప్పట్లో పరిశ్రమలోనే కాకుండా, మొత్తం తెలుగు ప్రజలందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఈ సినిమాలో కృష్ణ రెండు పాత్రలలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హిందీ నటి మందాకినీ ఈ సినిమా ద్వారా తెలుగుకి కథానాయికగా పరిచయం అయింది. బప్పీలహరి సంగీతం, రాజ్ సీతారాం నేపధ్య గానం అందించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కృష్ణకి పాడను అన్నప్పుడు, అధైర్య పడక కొత్త గాయకుడైన రాజ్ సీతారాంతో పాడించారు. ఈ సినిమాలో నటించడంతో పాటు, రచన, దర్శకత్వం, ఎడిటింగ్, నిర్మాతగా ఎన్నో అవతారాలు ఎత్తారు కృష్ణ.

krishnasimhasanam.jpg

ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించి అప్పట్లో సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ఈ సినిమా వందరోజుల పండగ చెన్నైలో జరిగింది. కొన్ని వందల బస్సులు తెలుగు రాష్ట్రం నలుమూలలనుండి చెన్నై‌కి బయలుదేరాయి. చెన్నై ప్రభుత్వం కంగారు పడింది, ఏమైనా రాజకీయ వివాదం వచ్చిందా, లేదా ఇంకేమైనా సంఘటన జరిగిందా, ఏమిటీ జన సందోహం అని వాళ్ళకి అర్థం కాలేదు. తమిళనాడు పోలీసు విభాగం హడావిడిగా ఏదో జరగబోతోంది లేకపోతే ఇన్ని వందల బస్సులు, ఇంతమంది జనాలు ఏమిటి, ఎక్కడికి అని కొన్ని బస్సుల్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిన సమాధానంతో అవాక్కయిపోయారు.

krishnararephotog.jpg

తెలుగు రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిగా వస్తున్న ఆ జనసందోహం కృష్ణ అభిమానులని, కృష్ణ నటించి, దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ శతదినోత్సవ సభకి వస్తున్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయి, ‘హమ్మయ్య’, ఏదో అనుకున్నాం, ఇదా సంగతి అని ఊపిరి పీల్చుకున్నారు. ఎవరూ రమ్మని చెప్పలేదు, అభిమానులు వాళ్ళంతట వాళ్లే వచ్చారు, అప్పుడు తెలిసింది కృష్ణ ప్రభంజనం అంటే ఏమిటో ప్రపంచానికి. ఆ తరువాత సుమారు మరొక 15 సినిమాలకి కృష్ణ దర్శకత్వం వహించారు.

krishnavarasudu.jpg

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరి అగ్ర నటులతో మల్టీ స్టారర్ సినిమాలు చేసిన నటుడు ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క కృష్ణ మాత్రమే అని చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, శోభన్ బాబు, కృష్ణం రాజు, జగ్గయ్య, కాంతారావు తరువాత వచ్చిన రజినీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణ అందరితో కృష్ణ నటించారు. నాగార్జునతో చేసిన ‘వారసుడు’ సినిమాలో నాగార్జునకి తండ్రిగా నటించి మెప్పించారు. కానీ అభిమానులు కృష్ణని అప్పట్లో తండ్రి పాత్రలో చూడలేకపోయారు, ఆందోళన పడ్డారు. దానికి కృష్ణ తన అభిమానులకి తాను వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని చేయాలని ఉంటుందని, అది ఒక ఛాలెంజ్ అని, అభిమానులు అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో అదొక సంచలనం అయింది.

krishnararephotogajula.jpg

సాంఘికం, గూఢచారి, జేమ్స్ బాండ్, పల్లెటూరి నేపధ్యం, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మక సినిమాలు ఒకటేమిటి అన్ని జానర్‌లు టచ్ చేసి తానేమిటో నిరూపించిన నటుడు కృష్ణ. రాజకీయ నేపధ్యం వున్న సినిమాలు కూడా తీసి సంచలనం సృష్టించారు. ‘ఈనాడు’ సినిమాలో తనకి కథానాయిక లేకుండా తన 200వ సినిమాగా విడుదల చేసి ఆశ్చర్యపరిచారు కృష్ణ. ఒకటేమిటి ఎన్నో రికార్డులు కృష్ణకి మాత్రమే సొంతం. అవి ఎవరూ దాటలేరు, మళ్ళీ సృష్టించలేరు. ఒకే సంవత్సరంలో కృష్ణవి 18 సినిమాలు విడుదలయ్యాయంటే అతను ఎంతటి డిమాండ్ వున్న నటుడో అర్థం అవుతోంది కదా. అంటే కొన్ని నెలల్లో రెండేసి సినిమాలు విడుదలయ్యేవి. అలా తన సినిమాలకి తన సినిమాలే పోటీగా విడుదలయ్యేవి. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన ఈ రికార్డులు అలాగే ఉంటాయి, వాటిని ఎవరూ బీట్ చేయలేరు. ఎందుకంటే కృష్ణ అంటే సంచలనం, డేరింగ్, డేషింగ్, ఎప్పటికీ సూపర్ స్టార్!

krishnaoldphoto.jpg

కృష్ణ ఇంతటి మహోన్నత శిఖరాలకు ఎదిగారంటే, అయన వెంట వున్న ఇద్దరు సోదరులు ఆదిశేషగిరి రావు, హనుమంత రావులు కృష్ణ వెనకాల ఉండబట్టే! వారిద్దరూ కృష్ణకి కుడి, ఎడమ బుజాలవలె కృష్ణ కి చేదోడువాదోడుగా ఉంటూ, అన్నిటిలో కృష్ణకి సహాయ సహకారాలు అందించారు. అసలు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి కదా అని ఈ ఘట్టమనేని ముగ్గురి సోదరులను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అంతటి అనురాగం, అనుబంధం ఆ అన్నదమ్ముల మధ్య ఉండేది. అన్న కృష్ణ అంటే ఇద్దరు తమ్ముళ్ళకి ఎంత ప్రేమో! కృష్ణ తీసుకున్న ఎటువంటి సాహసోపేత నిర్ణయం అయినా, ఆ నిర్ణయానికి కట్టుబడి, కృష్ణ వెనకాల ఈ ఇద్దరు అన్నదమ్ముల ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. అందుకే ఘట్టమనేని కృష్ణ అన్నా, ఘట్టమనేని ఇంటి పేరు చెప్పినా తెలుగు ప్రజల్లో ఒకరకమైన గౌరవం, గర్వం!

krishnabrothers.jpg

సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే సాధ్యమైన రికార్డులు:

* 1965 నుండి 2009 వరకు 44 ఏళ్ల పాటు విరామం లేకుండా నటించిన ఏకైక హీరో...

* 350 చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించిన ఏకైకహీరో

* కృష్ణతో జతగా నటించిన హీరోయిన్లు 80మంది

* విజయనిర్మలతో జంటగా 50 సినిమాలు

krishnalluri.jpg

* జయప్రదతో జంటగా 43 సినిమాలు

* శ్రీదేవితో జంటగా 31 సినిమాలు

* రాధతో జంటగా 21 సినిమాలు

* కృష్ణ చిత్రాలకు సంగీతమందించిన దర్శకులు 52మంది

* కృష్ణతో పనిచేసిన దర్శకులు 105 మంది

* విజయనిర్మల కాకుండా అత్యధికంగా KSR దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు

* కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు 16

krishnahindi.jpg
* కృష్ణ నటించిన మల్టీ స్టారర్ సినిమాలు 50

* 1983లో ఆరు శతదినోత్సవ చిత్రాలలో నటించిన తొలి భారతీయనటుడు..

* 1972లో అత్యధికంగా కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదల

* తమిళంలోకి డబ్ అయిన కృష్ణ సినిమాలు 20 (ఆ రోజుల్లో)

* హిందీలోకి డబ్ అయిన కృష్ణ సినిమాలు 10 (అప్పటి రోజుల్లో)

* కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 25

krishnasivajiganeshan.jpg

* కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 7

* తెలుగులో తొలి సాంఘిక కలర్ సినిమా ‘తేనెమనసులు’

* తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా ‘గూఢచారి 116’

* తెలుగులో తొలి మర్డర్ మిస్టరీ జోనర్ సినిమా ‘అవేకళ్ళు’

* తొలి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’

* తెలుగులో తొలి స్కోప్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’

* తెలుగులో తొలి 70MM సినిమా ‘సింహాసనం’

* మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి తెలుగు సినిమా ‘సాక్షి’ (1967)

Updated Date - Jun 01 , 2024 | 06:35 PM