తెలుగు సినిమాకి 92 ఏళ్ళు, మొదటి తెలుగు టాకీ విడుదలైంది ఎప్పుడంటే
ABN , Publish Date - Feb 07 , 2024 | 10:31 AM
మొదటి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' విడుదలై నేటికీ 92 సంవత్సరాలు అయింది. హెచ్ ఎం రెడ్డి దీనికి దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి పనిచేసిన వారిలో ఎల్వీ ప్రసాద్ ఒకరు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఇప్పటికి 92 ఏళ్ళు. మొదటి తెలుగు పూర్తి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' 1931, ఫిబ్రవరి 6 వ తేదీన విడుదలైంది. హెచ్.ఎం.రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా. మొదటి హిందీ టాకీ చిత్రం నిర్మించిన స్టూడియోలోనే ఈ తెలుగు టాకీ చిత్రం నిర్మించడం విశేషం. అప్పట్లో సురభి నాటక సమాజం వాళ్ళు ఈ 'భక్త ప్రహ్లాద' నాటకాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుండే వాళ్ళు. ఆ నాటక సమాజం వాళ్ళని అప్పట్లో బొంబాయి పిలిపించి ఈ చిత్రానికి కావలసిన కథని, ఎలా తీయాలన్న ప్రణాళికని రూపొందించుకుని ఈ చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఈ చిత్రానికి అయ్యే ఖర్చు సుమారు 18 వేల రూపాయలు.
ఈ 'భక్త ప్రహ్లాద' మొదటి పూర్తి టాకీ తెలుగు సినిమాగా విడుదలైన రోజు తెలుగు సినిమా పుట్టినరోజు కూడా అవటం విశేషం. ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఈ సినిమాకి ఎల్.వి.ప్రసాద్ సహాయ దర్శకుడిగా పని చేశారు. అలాగే ఇందులో ఒక చిన్న పాత్రలో కూడా ఎల్వి ప్రసాద్ కనపడతారు.
తొలి తెలుగు భారతీయ టాకీ చిత్రం 'ఆలం ఆరా', తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద', తోలి తమిళ టాకీ చిత్రం 'కాళిదాసు' ఈ మూడు సినిమాలకి పని చేసిన ఘనత తెలుగు వాడైనా ఎల్వీ ప్రసాద్ కి దక్కింది. ఆ తరువాత ఎల్వీ ప్రసాద్ దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, మల్టీప్లెక్స్ లు, కంటి ఆసుపత్రులు ఎన్నో నిర్మించి ఘనత పొందారు.
ఇంకో ఆసక్తికర విశేషం ఈ చిత్రానికి పాటలు రాసిన చందాల కేశవదాసు మొట్టమొదటి సినీ గీత రచయితగా ప్రసిద్ధికెక్కారు. ఇతను కవి, నటుడు, గాయకుడూ కూడాను. వీటితో పాటు ఇతను హరికథలు కూడా చెప్పేవారు. ఈయనడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి అనే గ్రామం.