Breathe: ఓటీటీలోకి.. ఎన్టీఆర్ మనవడి సినిమా! మరి.. ఇక్కడైనా?
ABN , Publish Date - Mar 05 , 2024 | 03:04 PM
నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన బ్రీత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.
నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన బ్రీత్ (Breathe) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ మధ్య చాలా పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు సైతం 15 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండగా ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి మాత్రం మూడు నెలలపైనే పట్టడం గమనార్హం. అయితే ఈ సినిమా వచ్చిన సంగతి, వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి గుర్తు లేకపోవడమే కాక, తెలుగు సినిమా చరిత్రలో జీరో కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ బ్రీత్ (Breathe) పేరు మూట గట్టుకున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వైరల్ అయ్యాయి.
‘బసవతారకరామ క్రియేషన్స్’ (Basavatarakaram Creations) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna) తన కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna)ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘బ్రీత్’ (Breathe). ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ (Vamsi Krishna Akella) దర్శకత్వం వహించగా.. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
రాష్ట్ర సీఎం గోల్ఫ్ ఆడుతూ అనారోగ్యం పాలవుతాడు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తారు. అయితే తర్వాత సీఎంపై చాలామంది హత్యా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో హీరో వాటిని అడ్డుకుంటూ ముఖ్యమంత్రిని కాపాడుతూ నేరస్థులను పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, మెడికల్ మాఫియాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో ఏ మేరకు ఆదరణ చూరగొంటుందో చూడాల్సి ఉంది..