OTTకి వచ్చిన.. మలయాళ పొలిటికల్ సెటైరిక్ కామెడీ!ఎందులో అంటే?
ABN , Publish Date - Jul 05 , 2024 | 07:35 AM
తెలుగు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకమైన పాలిటిక్స్,సెటైర్ జానర్లో ఓ మలయాళ చిత్రం మలయాళీ ఫ్రం ఇండియా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది .
తెలుగు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకమైన పాలిటిక్స్,సెటైర్ జానర్లో ఓ మలయాళ చిత్రం మలయాళీ ఫ్రం ఇండియా (Malayalee from India) వచ్చేసింది. నివిన్ పౌలీ ( Nivin Pauly) కథానాయకుడిగా నటించగా అనశ్వర రాజన్ (Anaswara Rajan), ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan), షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ప్రధాన పాత్రల్లో నటించారు. మే1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేరళలో మంచి విజయం సాధించింది.ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.
కథ విషయానికి వస్తే కేరళలోని ఓ మారుమూల గ్రామంలో ఉండే గోపి తల్లి, చెల్లితో కలిసి ఉంటాడు. ఇంటి విషయంలో, కెరీర్‌పై ఎలాంటి బాధ్యత, పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ ప్రతి విషయంలో ఆ పార్టీ విధానాలను సమర్దిస్తూ ఉంటాడు. ఈక్రమంలో తన మిత్రుడి అవేశంతో జరిగిన చిన్న ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా మత, రాజకీయ ఘర్షణలు తలెత్తుతాయి. దీంతో కుటుంబం ఒత్తిడితో దేశం వదిలి ఓ ఏడారి దేశంలో ఉద్యోగానికి బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది.
తీరా అక్కడికి వెళ్లాక అక్కడ అప్పటికే సూపర్వైజర్గా చేస్తోన్న ఓ పాకిస్తాని వద్ద పని చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో గోపి అక్కడ ఎలా ఉండగలిగాడు, తర్వాత పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడు, మళ్లీ ఇండియా వచ్చాడా అనే సింపుల్ పాయింట్‌తో సినిమా సాగుతుంది. ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ ప్రస్తుతం దేశంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీపై, వారి విధానాలు, నిర్ణయాలపై వ్యంగాస్త్రాలను సంధించినట్లు ఉంటుంది. మన రోజువారి జీవితానికి, పార్టీలు చెప్పే మాటలను లింక్ చేస్తూ కామెడీగా చెప్పారు. హిందూ, ముస్లిం అంతా ఒక్కటే అనే చిన్న మెసేజ్ ఇస్తారు.
సినిమాలో ఓ సన్నివేశంలో దేశ జీడీపీ అంత పెరిగిందని కాలర్ ఎగుర వేస్తారు, ఆ వెంటనే దోశకు ఇంత, టీ రేట్లు పెరిగాయని మాట్లాడుతూ ధరలు పెరిగితేనే అభివృద్ది ఉంటుంది భారత్ మాతాకీ జై అంటూ నవ్వులు పూయిస్తారు. సెకండాఫ్ తర్వాత సినిమా హిందూ, ముస్లిం టర్న్ తీసుకుని కాస్త సాగ దీసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడీ సినిమా మలయాళీ ఫ్రం ఇండియా (Malayalee from India) సోని లీవ్ (Sony LIV) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవు. కుటుంబం అంతా హాయిగా కలిసి చూడొచ్చు.