వెట్రిమారన్ ఐఐఎఫ్‌సీలో.. కొత్తగా బీఎస్సీ ఫిల్మ్ కోర్సు
ABN , Publish Date - Aug 22 , 2024 | 10:15 PM
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ స్థాపించిన ‘ది ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ కల్చర్ ( IIFC)’ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran) స్థాపించిన ‘ది ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ కల్చర్ (ఐఐఎ్‌ఫసీ IIFC)’ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ ఇనిస్టిట్యూట్‌లో కొత్తగా బీఎస్సీ ఫిల్మ్ స్టడీస్, పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ ప్రొగ్రామ్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ రెండు కోర్సులను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రారంభించారు.
2022లో దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran) ఈ సంస్థను ఏర్పాటు చేశారు. నిరుపేద నేపథ్యం కలిగి చిత్రపరిశ్రమలో రాణించాలనే ఔత్సాహిక యువతకు సాధికారత కల్పించేందుకు సంస్థను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూడో సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా కొత్త ఈ కోర్సుల ప్రారంభోత్సవం ఇటీవల వేళచ్చేరిలోని ఐఐఎ్‌ఫసీలో జరిగింది. ప్రొఫెసర్ రాజనాయగం, వేల్స్ విశ్వవిద్యాలయం విజ్యువల్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఎస్‌ఎం వళర్మతి, లయోలా కాలేజీ ప్రొఫెసర్ రాజనాయగం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. వెట్రిమారన్ దార్శనికతను మెచ్చుకుంటూ ఈ అవకాశాన్ని ఔత్సాహిక యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ... ఈ సంస్థ అభివృద్ధికి తన మద్దతుతో పాటు సహాయ సహకారాలు ఉంటాయని, సినిమా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న వెట్రిమారన్‌ను అభినందనీయుడన్నారు.