Darshan Case: మధ్యంతర బెయిల్ రద్దుపై సుప్రీంలో పిటిషన్‌కు సర్కారు ఓకే
ABN , Publish Date - Nov 16 , 2024 | 03:22 PM
హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉన్న నటుడు దర్శన్.. వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బెయిల్ విషయమై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పిటిషన్ వేయబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
చిత్రదుర్గ రేణుకాస్వామి (Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్ (Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు. హైకోర్టు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది.
Also Read-Amaran: ‘అమరన్’ థియేటర్‌పై బాంబ్ దాడి.. ఏమైందంటే
ఈలోగా విచారణ అధికారులు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుపై హోంశాఖకు విన్నవించారు. అందుకు అనుగుణంగానే హోంశాఖ సమ్మతి తెలిపింది. ఈమేరకు శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ హోంశాఖ అనుమతులు ఇచ్చిన మేరకు త్వరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ దాఖలు చేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే.. దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి, భార్య ఉండగా మళ్లీ ప్రియురాలు ఎందుకంటూ ప్రశ్నించిన పాపానికి.. అతనిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడమే కాకుండా.. శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టినట్లుగా విచారణలో తెలిసింది. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించి.. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారని.. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. రేణుకస్వామిని హింసించిన విధానాన్ని చూసిన నెటిజన్లు, పబ్లిక్.. ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్రగౌడ, ఇతరలను ఏ మాత్రం వదిలిపెట్టకూడదని, సభ్య సమాజం తలవంచుకొనేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ అనంతరం దర్శన్‌ని జైలులో పెట్టగా.. అక్కడా కూడా ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌తో ఆయన బయటికి వచ్చారు. ఆ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో పిటిషన్‌కు ప్రభుత్వం సమ్మతించింది.