Mammootty: హేమ కమిటీ నివేదిక.. మమ్ముటీ ఏమన్నారంటే!
ABN , Publish Date - Sep 01 , 2024 | 04:45 PM
హేమ కమిటీ నివేదికను (Hema Committee Report) ఉద్దేశించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) స్పందించారు. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.
హేమ కమిటీ నివేదికను (Hema Committee Report) ఉద్దేశించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) స్పందించారు. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను ఆహ్వానిస్తున్నాం’ అన్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఆయన ఏమన్నారంటే ‘‘సెట్‌లో మహిళలకు ఇబ్బందికర ఘటనలు ఏమీ జరగకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలి. సినీ పరిశ్రమ గురించి అధ్యయనం చేసి, నివేదికను సిద్థం చేసి, పరిష్కారాలను సూచించడానికి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. వాటిని అమలు చేేసందుకు చిత్ర పరిశ్రమలోని అన్ని అసోసియేషన్స్ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా అందిన ఫిర్యాదులపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక పూర్తి వెర్షన్ కోర్టు ముందు ఉంది. దర్యాప్తు జరగనివ్వండి. నిందితులకు తగిన శిక్షలను న్యాయస్థానం నిర్ణయిస్తుంది. సినీ పరిశ్రమలో ‘పవర్ సెంటర్’ అనేది లేదు. ఫైనల్‌గా సినిమా బతకాలి’’ అని మమ్ముట్టి పేర్కొన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం అంతటా ఇదే చర్చనీయాశంగా మారింది. దీనిపై మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే శనివారం అగ్ర నటుడు మోహన్‌లాల్ స్పందించారు. ‘‘అమ్మ’ (AMMA)అనేది ఒక ట్రేడ్ యూనియన్ కాదు. ఒక కుటుంబం లాంటిది. పరిశ్రమను సరైన దిశలో నడిపించడానికి ఎన్నో మంచి పనులు చేశాం. ప్రస్తుతం వస్తోన్న ఆరోపణలు దృష్ట్యా కేవలం ‘అమ్మ’ సంఘాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవద్దు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీ పరిశ్రమ సమాధానం చెప్పాలి. మహిళలను వేధించిన దోషులను కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు సపోర్ట్‌గా ఉంటాం. పరిశ్రమ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. పలువురిపై వచ్చిన ఆరోపణలు గురించి దర్యాప్తు జరుగుతోంది. అందరినీ నిందిస్తూ.. పరిశ్రమను నాశనం చేయకండి’’ అని కోరారు.