Karthi: అభిమానులను కలిసి.. విందు వడ్డించిన హీరో కార్తీ
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:07 AM
తమిళ, తెలుగు కథానాయకుడు కార్తీ సమాజానికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంటారు. ఆయన తాజాగా తన అభిమానులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి వారిని స్వయంగా కలుసుకుని అభినందించారు.
తమిళ, తెలుగు కథానాయకుడు కార్తీ (Karthi) సమాజానికి ఏదో ఒక రూపంలో తన వంతు సాయం చేస్తుంటారు. ఇందులో ఆయన అభిమానులు కూడా చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మే 25వ తేదీ హీరో కార్తీ తన 47వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తన అభిమానుల సేవలను గుర్తించిన హీరో కార్తీ వారిని స్వయంగా కలుసుకుని అభినందిస్తున్నారు.
ఇందులో భాగంగా, తొలుత ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, సెంట్రల్ చెన్నైతో పాటు కళ్ళకుర్చి, తిరువారూర్, తిరువళ్ళూరు జిల్లాలకు చెందిన అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. వారికి రుచికరమైన విందు భోజనం స్వయంగా వడ్డించారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగారు. స్థానిక త్యాగరాయ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన అభిమానులకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ, ‘నా పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను. బర్త్‌డే రోజున అనారోగ్యంతో ఉండటంతో స్వయంగా కలుసుకోలేక పోయాను.
నేను ఒక వైద్యుల గ్రూపులో ఉన్నాను. వారి మధ్య జరిగే సంభాషణల్లో రక్తం కొరత అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. అందుకే రక్తదానం చేసి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నానన్నారు.