Ajith Kumar: అజిత్‌కి హాలీవుడ్ ఝలక్.. ఆ సినిమా పరిస్థితేంటి
ABN , Publish Date - Dec 04 , 2024 | 03:27 PM
'గేమ్ ఛేంజర్' సినిమాకి పోటీగా నిలుస్తుందనుకున్న అజిత్ సినిమాకి హాలీవుడ్ బిగ్ ఝలక్ ఇచ్చింది. ఏం జరిగిందంటే..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. AK 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడమే బాకీ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మేకర్స్ కి ఝలక్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విదాముయార్చి’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'బ్రేక్ డౌన్'కి కాపీ అంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ లీగల్ పోరుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఒరిజినల్ మేకర్స్ నుండి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా లైకా సంస్థ ఈ సినిమాని తెరకెక్కించడంపై పారామౌంట్ నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక ఈ సినిమా టీజర్‌ను గమనిస్తే.. హీరో అజిత్ కుమార్ డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పరవాలేదు.. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో యాక్షన్ బేస్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. అజిత్ దేని కోసమో అన్వేషిస్తూ.. అడ్డువచ్చిన విలన్స్ భరతం పడుతూ.. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్లటానికైనా, ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. సంక్రాంతికి మెప్పించే కంటెంట్ ఇందులో ఉందనేది ఈ టీజర్ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యేలా అనిపిస్తోంది.