Kamal Haasan: దయచేసి.. నన్ను అలా పిలవకండి! కమల్ హసన్ బహిరంగ లేఖ
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:09 PM
'కళాకారుడు కళ కంటే ఉన్నతమైన వాడు కాదు' అంటూ కమల్ హాసన్ కామెంట్ చేశారు. తాజాగా కమల్ తన జీవితంలో ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాటించాలని తన అభిమానులని, ఆరాధకులని, మీడియాని అందరిని ఉద్దేశించి ఒక బహిరంగ విన్నపం చేశారు. ఆ విన్నపం ఏంటంటే..
భారతీయ సినిమా చరిత్ర ఉన్నంత కాలం గర్వించదగ్గ కళాకారుడు 'కమల్ హాసన్' (Kamal Haasan). సినిమా అనేది సాహిత్యం అయితే ఆయనను చరిత్ర స్టార్‌గానో, హీరోగానో కాదు గొప్ప కళాకారుడిగా గుర్తించుకుంటుంది. కేవలం వర్సటైల్ యాక్టింగ్‌తోనే కాకుండా సినీ రంగంలో అనేక ప్రయోగాలతో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన స్థానం ఎవరెస్ట్. ఇటీవల 'కమల్ హాసన్' 70 ఏళ్ళలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తన జీవితంలో ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాటించాలని తన అభిమానులని, ఆరాధకులని, మీడియాని అందరిని ఉద్దేశించి ఒక బహిరంగ విన్నపం చేశారు. ఆ విన్నపం ఏంటంటే..
కమల్ అభిమానులు ఆయనని ప్రేమగా "ఉలగనాయగన్" (Ulaga Nayagan) అని పిలుస్తారు. దాని అర్థం యూనివర్సల్ స్టార్. తెలుగులోనూ 'విశ్వనాయకుడు', 'లోకనాయకుడు' టైటిల్స్‌తో ఆయనని సంబోధిస్తారు. అయితే అలా పిలవడం కమల్‌కి ఇష్టం లేదని తెలిపారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేస్తూ.. " అందరికి నమస్కారం, 'ఉలగనాయగన్' అని నన్ను ఎంతో ప్రేమతో పిలిచే అభిమానులు, కొలీగ్స్, అందరికి నేను వినయంగా రుణపడి ఉంటాను. మీ ప్రేమకి నేను ఎంతో కదిలించబడ్డాను. అయితే సినిమా అనేది ఒక కళ. నేను దానికి నిత్య విద్యార్థిని. ఎప్పటికి ఎదో ఒకటి నేర్చుకోవాలనే తాపత్రయంతోనే ఉంటాను. ఇదే ఇండస్ట్రీలో ఎందరో సృజనాత్మక కలిగిన కళాకారులు ఉన్నారు. కళాకారుడు కళ కంటే ఉన్నతంగా ఉండకూడదని నా వినయపూర్వకమైన నమ్మకం. నేను అనేక లోపాలను చేస్తాను, కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను. నా కర్తవ్యాలను నిరంతరం తెలుసుకుంటూ ఉంటాను. సో, నేను నా భారతీయ సహోదరులందరికి నన్ను 'ఉలగనాయగన్' అనే పేరుతో పిలవకండి అని వినమ్రంగా కోరుకుంటున్న. ఇక నుండి నన్ను కేవలం కమల్ హాసన్, కమల్, కేహెచ్ (KH) పేర్లతోనే సంభోదించండి" అంటూ కోరారు.